Share News

GST Growth: తల్లికి వందనంతో జీఎస్టీ జోష్‌!

ABN , Publish Date - Oct 06 , 2025 | 03:37 AM

కూటమి ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌ 12న తల్లికి వందనం పథకం డబ్బులను లబ్ధిదారులైన తల్లుల ఖాతాల్లో వేసింది. దీనికి రూ.10,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఈ పథకం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల..

GST Growth: తల్లికి వందనంతో జీఎస్టీ జోష్‌!

  • ఒకేసారి సొమ్ము అందడంతో ప్రజల్లో పెరిగిన కొనుగోలు శక్తి

  • చదువులకే కాకుండా గృహోపకరణాలు, సైకిళ్లు, బైకుల కొనుగోలుపై వ్యయం

  • కొందరు మరికొంత సొమ్ము కలిపి బంగారం కొన్న వైనం

  • దీంతో జీఎస్టీ వృద్ధి రెండింతలు

  • జూలై, ఆగస్టులో గణనీయ పెరుగుదల

  • జూన్‌ నెలలో వసూళ్లు 2,591 కోట్లు

  • తర్వాతి 2 నెలల్లో 2,977 కోట్లకు చేరిక

  • (ఆంధ్రజ్యోతి-అమరావతి/న్యూస్‌ నెట్‌వర్క్‌)

కూటమి ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌ 12న తల్లికి వందనం పథకం డబ్బులను లబ్ధిదారులైన తల్లుల ఖాతాల్లో వేసింది. దీనికి రూ.10,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఈ పథకం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతోంది. ఈ పథకం అమలుచేసిన మరుసటి నెలలు జూలై, ఆగస్టుల్లో రాష్ట్ర జీఎస్టీ సాధారణం కంటే ఎక్కువగా పెరిగింది. వైసీపీ హయాంలో ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ)లు ఉన్నప్పటికీ.. అవి అర్హులకు ఒక్కసారిగా ఇంత ప్రయోజనం కలిగించలేదు. ఆ డబ్బు ఒక్కసారిగా కాకుండా ఏడాదికి కొంచెం చొప్పున పడడంతో అవి అప్పటి అవసరాలకు సరిపోయాయి. వాటితో ఏదైనా ఉపయోగపడే వస్తువు గానీ, బంగారం గానీ కొనే అవకాశం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధిదారులకు ఒక్కసారిగా రూ.13 వేల నుంచి రూ.78వేల వరకు చేతికి రావడంతో వాటితో గృహోపకరణాలు, పిల్లలకు సైకిళ్లు, తమ జీవనోపాధికి ఆటోలు, గొర్రెలు, గేదెలు సైతం కొనుగోలు చేశారు. బైకులు, కొంత చేతిసొమ్ము కలిపి కాస్త బంగారం కొన్నవారు కూడా ఉన్నారు. దీంతో ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయం పెరిగింది. వైసీపీ హయాంలో ఇచ్చిన అమ్మఒడి పథకం కూడా కేవలం ఒక్క విద్యార్థికే ఇవ్వడం వల్ల ఆ డబ్బు స్కూలు ఖర్చులకు కూడా సరిపోయేది కాదు.


జీఎస్టీ వృద్ధి పైపైకి..

ఆగస్టులో నికర జీఎస్టీ రూ.2,977 కోట్లు రాగా.. అంతకుముందు నెలలో రూ.2,930 కోట్లు వచ్చింది. జూన్‌ 12 నుంచి ప్రభుత్వం తల్లికి వందనం పథకం డబ్బు తల్లుల ఖాతాల్లో వేయడం మొదలు పెట్టింది. జూన్‌లో నికర జీఎస్టీ 7.1 శాతం పెరిగి.. రూ.2,591 కోట్లు వసూలైంది. జూలైలో ఆ పెరుగుదల 12.12 శాతానికి, ఆగస్టులో రూ.14.38 శాతానికి పెరిగింది. లబ్ధిదారులు తమ పిల్లల స్కూలు ఖర్చులకు పోను మిగిలిన డబ్బుతో ఇంట్లోకి అవసరమైన వస్తువులు, వస్త్రాలు, గృహోపకరణాలు కొనడంతో.. దాని ప్రభావం నికర జీఎస్టీ పెరుగుదలలో కనిపిస్తోంది. రూ.10 వేల కోట్లకుపైగా ఖర్చుచేసిన ఈ భారీ సంక్షేమ పథకం ప్రజలకు సంతృప్తినివ్వడంతోపాటు ఖజానాకు ఆదాయం కూడా తెచ్చిపెట్టడం విశేషం. జీఎస్టీ పెరగడం అంటే రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలు ఊపందుకున్నట్లే లెక్క. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వల్ల వస్తువులకు డిమాండ్‌ పెరుగుతుంది. దీంతో ఉత్పాదక రంగం మరింత మెరుగుపడుతుంది. కొత్త ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తాయి. జీఎస్టీ వసూళ్లలో నమోదవుతున్న వృద్ధి దీనినే స్పష్టం చేస్తోంది. దీనికి తోడు ఇప్పుడు జీఎస్టీ 2.0 సంస్కరణలతో పలు వస్తువులపై పన్ను తగ్గడమో, తీసివేయడమో జరిగేటప్పటికి.. వాహనాలు, గృహోపకరణాల అమ్మకాలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా పెరిగాయి. నిత్యావసరాలు, ఔషధాలపై చాలా వరకు పన్ను పూర్తిగా ఎత్తేశారు. పైగా పండుగల సీజన్‌ కావడంతో సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కూడా రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లలో వృద్ధి కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు.

సొమ్ము సద్వినియోగం..

తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం జమచేసిన సొమ్మును సద్వినియోగం చేసుకుంటున్న తల్లిదండ్రులు అధికంగానే ఉన్నారు. పిల్లల పుస్తకాలు, బట్టలతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నారు. కొందరు కొంత సొమ్ము బాకీల కింద చెల్లించారు. జీవనోపాధి కోసం ఆటోలు, గొర్రెలు, గేదెలు కొనుక్కున్నవారూ ఉన్నారు. పిల్లలకోసం చాలా మంది సైకిళ్లు కొన్నారు. ఇంకొందరు పిల్లలకు వైద్యం నిమిత్తం ఖర్చుచేశారు. మరికొందరు పోస్టాఫీసుల్లో పొదుపునకు శ్రీకారం చుట్టారు. సుకన్య యోజనలో పిల్లలకు డిపాజిట్‌ చేశారు. కొంత మంది బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. ఈ ఏడాది సొంత అవసరాల కోసం ఖర్చుచేసినవారిలో ఎక్కువ మంది.. వచ్చే ఏడాది అందే మొత్తాన్ని పిల్లల పేరిటే డిపాజిట్‌ చేస్తామని చెప్పడం గమనార్హం.


1.jpg

పాత ఆటో కొనుక్కున్నాం

మా ముగ్గురు పిల్లలకూ తల్లికి వందనం డబ్బులు జమయ్యాయి. ఆ సొమ్ముతో కుటుంబ జీవనోపాధి కోసం ఒక పాత ఆటో కొనుక్కున్నాం. దాని ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. తల్లికి వందనం మాలాంటి కుటుంబాల్లో వెలుగులు నింపింది.

- వెలకపాటి రవికుమార్‌, రాచర్ల ఫారం, ప్రకాశం జిల్లా


గృహోపకరణాలు కొనుక్కున్నాం

మాది నిరుపేద కుటుంబం. తల్లికి వందనం పథకం ద్వారా అందిన డబ్బులతో పిల్లల చదువుకు అవసరమైన వాటితో పాటు కొన్ని చిన్నచిన్న సామాన్లు కొనుక్కోగలిగాం. నాకు మాధవి(5వ తరగతి), లోకేశ్‌(4వ తరగతి), కల్యాణ్‌(3వ తరగతి) ముగ్గురు పిల్లలు. ముగ్గురికీ కలిపి రూ.39 వేలు ఖాతాలో జమయ్యాయి. ఆ నగదుతో పిల్లలకు దుస్తులు, నోట్‌ పుస్తకాలు కొన్నాం. మరికొంత నగదుతో ఇంటికి అవసరమైన గృహోపకరణాలనూ కొనుక్కున్నాం.

- బాడితమాని గౌరి, గృహిణి, భోగాపురం, విజయనగరం జిల్లా

బాబుకు సైకిల్‌ కొనిచ్చా

నాకు ఇద్దరు పిల్లలు. కూటమి ప్రభుత్వం తల్లికివందనం పథకం కింద ఇద్దరికీ డబ్బు బ్యాంకులో పడింది. ఈ డబ్బును ముందుగా పిల్లల చదువుకు అవసరమైన పుస్తకాలు, బట్టలు, ఇంట్లోకి అవసరమైన సరుకులు కొనుగోలు చేశాం. మా బాబు స్కూలుకు వెళ్లేందుకు సైకిల్‌ కొనిచ్చా. ఒకేసారి ఇద్దరు పిల్లల పేరున వచ్చిన డబ్బును ఆయా అవసరాల కోసం ఖర్చుచేశాను. వచ్చే ఏడాది అందే సొమ్మును వృథా చేయకుండా.. వారి పేరున ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నాం.

- ఉమ్మలరాజు సుబ్బరాజు, ఓబులవారిపల్లె, అన్నమయ్య జిల్లా

Updated Date - Oct 06 , 2025 | 03:37 AM