Officials Suspended Over Disability Certificate: జగన్ ఫొటోతో సదరం సర్టిఫికెట్
ABN , Publish Date - Sep 04 , 2025 | 03:11 AM
గుంటూరులో సచివాలయ ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 14 నెలలు దాటినా ఇంకా జగనే ముఖ్యమంత్రిగా భావిస్తున్నారు...
ఇద్దరు సచివాలయ ఉద్యోగుల సస్పెన్షన్
మరో ఇద్దరికి షోకాజు నోటీసులు జారీ
గుంటూరు కార్పొరేషన్, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): గుంటూరులో సచివాలయ ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 14 నెలలు దాటినా ఇంకా జగనే ముఖ్యమంత్రిగా భావిస్తున్నారు. జగన్ ఫొటోతో ఉన్న సదరం సర్టిఫికెట్లను ఇటీవల జారీ చేశారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. వివరాలు.. గుంటూరు బ్రాడీపేటకు చెందిన ఓ దివ్యాంగ బాలిక సదరం సరిఫికెట్ కోసం ఆన్‌లైన్‌లో ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకుంది. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఆ బాలికను పరీక్షించిన వైద్య బృందం 100 శాతం వైకల్యం ఉన్నట్లు నిర్ధారించింది. సమీపంలోని సచివాలయం ద్వారా సదరం సర్టిఫికెట్ తీసుకోవాలని సూచించింది. బ్రాడీపేటకు చెందిన 127వ సచివాలయ ఉద్యోగులు ఆరు నెలల తర్వాత తీరిగ్గా ఆమెకు సదరం ధ్రువపత్రాన్ని ఇచ్చారు. దానిపై జగన్ ఫొటో ఉండటంతో దాన్నిమార్చి మరొకటి ఇవ్వాలని ఆమె బంధువులు కోరారు. వారితో సచివాలయ ఉద్యోగులు దురుసుగా మాట్లాడటంతో కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన జగన్ ఫొటోతో ముద్రించి ఇచ్చిన సర్టిఫికెట్‌ను రద్దుచేసి, కొత్త ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. దీనికి బాధ్యులైన 127వ సచివాలయ ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి రామబిల్వకాదేవి, వెల్ఫేర్ కార్యదర్శి రవికుమార్‌ను సస్పెండ్ చేశారు. నోడల్ అధికారి సాంబశివరావు, అడ్మిన్ కార్యదర్శి నాగమణికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.