Jagananna Colonies: అస్తవ్యస్తంగా జగనన్న కాలనీలు.. మౌలిక వసతుల లేమితో ఇబ్బందులు
ABN , Publish Date - Oct 31 , 2025 | 09:25 PM
ఇళ్లు కాదు గ్రామాలనే నిర్మిస్తున్నాం.. అంటూ గత ప్రభుత్వం ఆర్భాటంగా జగనన్న కాలనీలను ఇచ్చినా మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబడటంతో కాలనీల్లో ఆవాసానికి వచ్చిన లబ్దిదారుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. మరోవైపు కాలనీలను ఊరి చివర దాదాపు 2.3 కి.మీ దూరంలో ఇవ్వడంతో అక్కడికి వెళ్లి నివాసం ఉండేందుకు లబ్దిదారులు వెనుకడుగు వేస్తున్నారు.
నూజివీడు టౌన్, ఆంధ్రజ్యోతి: ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో అన్నవరం, పోతిరెడ్డిపల్లి రహదారి పక్కనే రెండు కాలనీ ఇళ్లను, ట్రిపుల్ ఐటీ సమీపంలో కొండగట్టును అనుకుని మరో కాలనీని ఏర్పాటు చేయగా ప్రస్తుతం ఆ కాలనీలు పాడుపడిన ఇళ్లతో దర్శనమిస్తున్నాయి. కనీసం డ్రైనేజి, రహదారులు నిర్మాణం లేకుండా కాంట్రాక్టర్లతో ఇళ్లు నిర్మింప చేసి ఒక్క రూపాయికి ఆడపడుచులకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని గత ప్రభుత్వంలో వాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో నూజివీడు, ఆగిరిపల్లి మండలాల్లో తొలివిడతగా జగనన్న కాలనీలను ప్రారంబించగా మునునూరు, చాట్రాయి మండలాల్లో రెండో విడతలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు.
నూజివీడు పట్టణంలోని నాలుగు కాలనీల్లో ఇళ్లను మంజూరు చేయగా, ఎమ్మార్ అప్పారావు కాలనీకి అనుబంధంగా ఉన్న జగనన్న కాలనీలో మాత్రం ఎంతోకొంత నిర్మాణాలు సాగాయి. మిగిలిన మూడు చోట్ల కాంట్రాక్టర్లచే నిర్మాణాలు చేపట్టినా మౌలిక వసతుల కల్పన మరవడంతో మొండిగోడలతో నిలిచిన ఆ ఇళ్లలోకి వెళ్లేందుకు లబ్దిదారులు వెనుకంజ వేస్తున్నారు. మౌలిక వసతులు కల్పించాలని ఇటీవల అన్నవరం సమీపంలోని జగనన్నకాలనీ వాసులు సీపీఐ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. నూజివీడులో అద్దెలు కట్టలేక అప్పులు చేసి జగనన్నకాలనీల్లో ఇళ్లు కట్టుకున్నా ప్రభుత్వం కనీసం సౌకర్యాలు కల్పించకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నామంటూ వాపోతున్నారు. మున్సిపల్ అధికారులకు నూజివీడు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా నేటికీ పరిస్థితి మారలేదని వాపోతున్నారు. తాజాగా తుఫాన్ కారణంగా భారీవర్షాలకు ఆయా కాలనీల్లో కనీసం నడిచే వెళ్లే పరిస్థితి లేదని వాపోతున్నారు.
జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని, అసంపూర్తి ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని నూజివీడు నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ కోరారు. అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్నా డ్రెయినేజీ, రోడ్డు సౌకర్యం లేని మాజివీడులోని జగనన్న కాలనీవారు ఇటు కాలనీల్లో ఆవాసం ఉండలేక ఆటు అప్పులకు వడ్డీలు కడుతూ మరోవైపు ఇంటి అద్దెలు చెల్లిస్తూ అగచాట్లు పడుతున్నారని, మంత్రి కొలుసు దృష్టి సారించి లబ్దిదారుల వెతలు తీర్చాలని కోరారు.
ఇవి కూడా చదవండి:
CM Chandrababu: పార్టీ లైన్ ఎవరూ దాటినా సహించేది లేదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్
Kandula Durgesh: నవంబరు 4 నుంచి 6 వరకు మంత్రి కందుల దుర్గేష్ లండన్ పర్యటన