Share News

క్రీ(నీ)డలు

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:22 AM

ఎక్కడకు వెళ్లినా నూజివీడుకు చెందిన క్రీడాకారులు ఏదో ఒక స్థాయిలో కనిపిస్తూనే ఉంటారు. క్రీడలపై మక్కువతో కళాశాలల్లో క్రీడల్లో పాల్గొని ప్రతిభ చూపి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొంది, స్థిరపడిన వారు అనేకమంది ఉన్నారు.

క్రీ(నీ)డలు
అసంపూర్తిగా ఇండోర్‌ స్టేడియం

కలగానే మిగిలిన ఇండోర్‌ స్టేడియం

కదలిక లేని క్రీడా ప్రాంగణం, క్రికెట్‌ స్టేడియం

కీడలకు దూరమవుతున్న నూజివీడు క్రీడాకారులు

మంత్రి హామీతో ఆశలు సజీవం

నూజివీడు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) : ఎక్కడకు వెళ్లినా నూజివీడుకు చెందిన క్రీడాకారులు ఏదో ఒక స్థాయిలో కనిపిస్తూనే ఉంటారు. క్రీడలపై మక్కువతో కళాశాలల్లో క్రీడల్లో పాల్గొని ప్రతిభ చూపి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొంది, స్థిరపడిన వారు అనేకమంది ఉన్నారు. అయితే క్రీడా ప్రాంగ ణాల కొరతతో నవతరం క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా నూజివీడులో క్రీడాప్రాంగణాల ఏర్పాటుకు వేసిన శిలాఫలకాలు వెక్కరిస్తూనే ఉన్నాయి. నిన్న, మొన్నటివరకు అడవులను తలపిస్తూ ముళ్లకంచెలతో దర్శనమిచ్చాయి. గత ఎన్నికలకు ముందు ప్రస్తుత నూజివీడు ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థసారథి క్రీడాప్రాంగణాల్లో జంగిల్‌ క్లియరెన్స్‌ చేయించారు. పట్టణంలో ఎన్‌ఎస్‌పీ క్వార్టర్స్‌ వద్ద దివంగత మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పాలడుగు వెంకట్రావు తలపెట్టిన ఇండోర్‌ స్టేడియంతో పాటు అన్నవరం రహదారిపై గల క్రికెట్‌ స్టేడియం, ఆర్డీవో కార్యాలయం వద్ద గల క్రీడాప్రాంగణాలు క్రీడాకారులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. ప్రైవేట్‌ కళాశాల ప్రాంగణాల్లో వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌ కోర్టులను వినియోగించుకుంటున్నారు.

ఫ మూడు దశాబ్దాలుగా క్రీడాకారులకు ఇండోర్‌ స్టేడియం కలగానే మిగిలిపోయింది. అప్పట్లో నూజివీడు నుంచి మంత్రిగా ఉన్న పాలడుగు వెంకట్రావు ఇండోర్‌స్టేడియం నిర్మాణానికి ఎన్‌ఎస్‌పీ క్వార్టర్స్‌ వద్ద నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయిం చారు. అది ఇప్పటికీ సాకారం కాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఇండోర్‌ స్టేడియం నిర్మాణం ప్రారంభమవ్వగా గతంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వహయాంలో దాదాపు 50 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఫ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా నూజివీడు–అన్నవరం వెళ్లేదారిలో క్రికెట్‌ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. ఈ స్టేడియం తిరిగి వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికలకు కొద్దికాలం ముందు మరల శంకుస్థాపన చేసుకుంది. చుట్టూ ఫెన్షింగ్‌ ఏర్పాటు చేసి స్టేడియం ఏర్పాటుకు ల్యాండ్‌ లెవెలింగ్‌ తదితర కార్యక్రమాలను పూర్తి చేసినా ప్రభుత్వం మారిన తర్వాత ఈ స్టేడియం నిర్మాణం ఒక్క అడుగు ముందుకు పడలేదు. నూజివీడు ఆర్డీవో కార్యాలయం సమీపంలో క్రీడాభివృద్ధికి జమిందారి ఎం.వి.కె.ఎన్‌ అప్పారావు వంశీయులు దాదాపు ఆరు ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. ఈ భూమిలో క్రీడాప్రాంగణం ఏర్పాటు దశాబ్దాలు గడిచినా ఇప్పటికి సాకారం కాలేదు.

రెండు క్రీడా ప్రాంగణాలను

పూర్తి చేస్తాం : మంత్రి

నూజివీడు ఇండోర్‌ స్టేడియం నిర్మాణంతో పాటు క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్టు గృహ నిర్మాణ పౌర సంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. క్రీడాప్రాంగణాల అంశమై ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఈ రెండు స్టేడియంల నిర్మాణానికి నిధుల సమీక రణకు చర్యలు చేపడుతున్నామని, అతిత్వరలో క్రీడాప్రాంగణాలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

Updated Date - Feb 03 , 2025 | 12:22 AM