Notorious Maoist Leader Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:13 AM
మావోయిస్టు పార్టీ ‘మోస్ట్ వాంటెడ్ అగ్రనేత, గురితప్పని దాడుల వ్యూహకర్త, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పీఎల్‌జీఏ కమాండర్ హిడ్మా 43 శకం ముగిసింది. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో..
ముగిసిన ‘మోస్ట్ వాంటెడ్’ నేత శకం
అతనంటేనే...
మెరుపు దాడులకు మారు పేరు!
భద్రతా దళాలకు చిక్కడు...
ఎంత గాలించినా దొరకడు!
కూంబింగ్‌కు వెళ్లిన ప్రతిసారీ,
‘అతను దొరకాలి’ అని ఒకవైపు...
‘అతని ఎరకు దొరకొద్దు’ అని
ఇంకోవైపు సాయుధ బలగాలు
గట్టిగా కోరుకునే మావోయిస్టు నాయకుడు!
మావోయిస్టు పార్టీకార్యదర్శి స్థాయి నేతలు, కేంద్ర కమిటీ సభ్యులు, కమాండర్లు... ఎందరు దొరుకుతున్నా...
ఎందరు ఎన్‌కౌంటర్లలో తలవాలుస్తున్నా... ‘అతడు కావాలి.
అతడు దొరికితే చాలు’ అని పోలీసులు పదేపదే పలవరించారు!
ఛత్తీ్‌సగఢ్, ఒడిశా, తెలంగాణ.... ఇలా అనేక రాష్ట్రాల పోలీసులకు ‘మోస్ట్ వాంటెడ్’... ఎట్టకేలకు, ఇన్నేళ్లకు ఆంధ్రప్రదేశ్ బలగాల చేతిలో ఎన్‌కౌంటర్ అయ్యాడు! ఆయనే... హిడ్మా! మావోయిస్టు పార్టీలో అతడే ఒక సైన్యం... పార్టీ అగ్రశ్రేణి సాయుధ దళానికి అతడే సారథి. ‘2025 నవంబరు 30లోపు హిడ్మాను మట్టుపెట్టాలి’ అని కేంద్రం పెట్టుకున్న డెడ్‌లైన్‌కు ముందుగానే.. ఏపీ బలగాలు ఆ పని చేసేశాయి!
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా, ఆయన సహచరి మడకం రాజే అలియాస్ రాజక్కతోపాటు మరో నలుగురు మరణించారు! ‘ఆపరేషన్ కగార్’లో ఇదో కీలక మలుపు! ఆదివాసీ కుటుంబంలో పుట్టి... బాలుడిగానే ఆయుధం పట్టి... మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరిగా ఎదిగిన మాడ్వి హిడ్మా మరణం మావోయిస్టు పార్టీకే పెద్ద దెబ్బగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్
మాడ్వి హిడ్మా, ఆయన భార్య సహా ఆరుగురి మృతి
‘సేఫ్ జోన్’ కోసం దండకారణ్యం దాటిన దళం
మారేడుమిల్లి మీదుగా ఒడిసా వెళ్లాలనే వ్యూహం
హిడ్మా ఉనికిపై ఏపీ పోలీసులకు పక్కా సమాచారం
నాలుగు రోజులుగా బలగాలతో కూంబింగ్
తెల్లవారుజామున ఎన్‌కౌంటర్.. ఆరుగురి మృతి
తప్పించుకున్న మరికొందరు మావోయిస్టులు
ఆయుధాలు, పేలుడు సామగ్రి స్వాధీనం
కాకినాడ/రంపచోడవరం/మారేడుమిల్లి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ ‘మోస్ట్ వాంటెడ్’ అగ్రనేత, గురితప్పని దాడుల వ్యూహకర్త, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) కమాండర్ హిడ్మా (43) శకం ముగిసింది. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో... ఏపీ పోలీసుల చేతిలో హిడ్మా మరణించాడు.
ఆయన జీవన సహచరితోపాటు మరో నలుగురు నక్సల్స్ ఇదే ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. పోలీసు వర్గాలు అందించిన సమాచారం ప్రకారం... ‘ఆపరేషన్ కగార్’ పేరుతో కేంద్రం వేట... ఛత్తీ్‌సగఢ్ అడవుల్లో వేలమంది బలగాలతో భారీ కూంబింగ్... అగ్రనేతల లొంగుబాటు, ఎన్‌కౌంటర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు... దట్టమైన దండకారణ్యం దాటారు. పోలీసు బలగాలు పెద్దగా దృష్టిసారించని మారేడుమిల్లి అడవుల్లో తలదాచుకోవాలని భావించారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా మరికొందరితో కలిసి ఏపీ సరిహద్దుల్లోకి ప్రవేశించాడు. అయితే... హిడ్మా మారేడుమిల్లి అడవుల్లో తలదాచుకున్నాడన్న సమాచారంతో... పోలీసులు 4 రోజులుగా కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో గుజ్జిమామిడివలస పంచాయతీలోని నెల్లూరు శివార్లలో పోలీసు బలగాలకు హిడ్మా దళం తారసపడింది. వెంటనే పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అటువైపు నుంచి కాల్పులు ఆగిపోవడంతో... పోలీసులు గాలింపు జరిపారు. అక్కడ ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. వారి మృతదేహాల చిత్రాలను ఛత్తీ్‌సగఢ్ పోలీసులకు పంపించి... వారిలో హిడ్మా ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. దీనిపై ప్రకటన వెలువడగానే... ఏపీ, తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇదే ఎన్‌కౌంటర్‌లో హిడ్మా భార్య, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రాజే అలియాస్ మడకం రాజక్క... సాయుధ మావోయిస్టులు దేవే, లక్మల్ అలియాస్ చేతు, మల్ల ఎలియాస్ మల్లలు, కమ్లు ఎలియాస్ కమ్లేశ్ ఉన్నారు. ఎన్‌కౌంటర్ సమయంలో ఘటనా స్థలం నుంచి మరికొందరు మావోయిస్టులు పరారయ్యారు. వీరికోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. పరారైన వారిలో ఎవరికైనా గాయాలయ్యాయా, లేక ఎక్కడైనా మృతి చెంది ఉంటారా అనేది తేలాల్సి ఉంది. సంఘటనా స్థలం నుంచి రెండు ఏకే 47 రైఫిళ్లు, ఒక పిస్టల్, ఒక రివాల్వర్, ఒక సింగిల్ బోర్ తుపాకీ, పలు ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 150 వరకూ నాన్‌ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 25 మీటర్ల ఫ్యూజ్ వైరు, ఒక విద్యుత్ వైర్ బండిల్, ఏడు కిట్ బ్యాగులు, 28 ఎకె 47 రౌండ్లు, ఐదు పిస్టల్ రౌండ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న వారి కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. మావోయిస్టుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతి చెందినవారి బంధువులకు ఛత్తీ్‌సగఢ్ పోలీసుల ద్వారా సమాచారం ఇచ్చామని, గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశామని ఇంటెలిజెన్స్ ఐజీ లడ్డా తెలిపారు.
అక్కడ కష్టమని ఇటువైపు...
ఛత్తీ్‌సగఢ్ దండకారణ్యంలో పోలీసు బలగాలు ఇటీవలకాలంలో ఆపరేషన్ కగార్ పేరుతో భారీగా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న పలు ఎన్‌కౌంటర్లలో పలువురు మావోయిస్టు అగ్ర నేతలు మరణించారు. ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మావోయిస్టులు ప్రణాళిక రచించారు. ఇందులో హిడ్మాతోపాటు ఆయన దళం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మారేడుమిల్లి అడవుల మీదుగా ఒడిసా వైపు వెళ్లాలని ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో... మారేడుమిల్లి అడవుల్లో అడుగుపెట్టగానే హిడ్మా ఆచూకీని నిఘా వర్గాలు కనిపెట్టాయి.