CM Chandrababu Naidu: నెలాఖరులోగా పదవుల భర్తీ
ABN , Publish Date - Mar 01 , 2025 | 05:03 AM
నామినేటెడ్ పదవులకు తమ పక్కన తిరిగే వారిని కాకుండా పార్టీ కోసం కష్టపడే వారిని ఎంపిక చేయాలని శాసనసభ్యులకు సూచించారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశం రెండు గంటలపాటు జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..
ఆలయ కమిటీలు, ఏఎంసీల్లో నియామకాలు: చంద్రబాబు
పక్కన తిరిగేవారిని కాదు..
పనిచేసేవారిని సిఫారసు చేయండి
కేడర్‌తో అంతరం పెరుగుతోంది
కార్యకర్తలను కాపాడుకోవాలి
ఐదేళ్లు ఎన్ని హింసలు పెట్టినా,
ప్రాణాలు తీసినా పార్టీతోనే ఉన్నారు
మహానాడుకల్లా పార్టీ కమిటీలు
సమస్యలుంటే అంతర్గతంగానే చర్చించాలి.. వీధినపడకూడదు
బడ్జెట్‌ను జనంలోకి తీసుకెళ్లాలి
వివేకా హత్య రాజకీయాలకు కేస్ స్టడీ
క్రిమినల్స్‌తో అప్రమత్తంగా ఉండాలి
ఇక ఎమ్మెల్యేలతో ముఖాముఖి: సీఎం
అమరావతి, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): నామినేటెడ్ పదవులను మార్చి నెలాఖరులోగా భర్తీచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియ మే నెలలో జరిగే మహానాడు నాటికి పూర్తవుతుందన్నారు. నామినేటెడ్ పదవులకు తమ పక్కన తిరిగే వారిని కాకుండా పార్టీ కోసం కష్టపడే వారిని ఎంపిక చేయాలని శాసనసభ్యులకు సూచించారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశం రెండు గంటలపాటు జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆలయ కమిటీ చైర్మన్లు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల (ఏఎంసీలు) పదవులను మార్చిలోగానే భర్తీ చేస్తామన్నారు. సమర్థులకే సహకార అధ్యక్ష పదవులు ఇస్తామని తెలిపారు.

నామినేటెడ్ పదవుల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు నామినేటెడ్ పదవుల కోసం తమ ప్రతిపాదనలను వెంటనే పోర్టల్‌లో పెట్టాలని సూచించారు. మీరు ఇవ్వాల్సిన డేటా ఇవ్వకుండా పదవులు భర్తీ చేయాలంటే ఎలా కుదురుతుందని వారిని ప్రశ్నించారు. పార్టీలో ఏ స్థాయిలో ఉన్నవారైనా కుటుంబ సాధికార సారథి(కేఎ్‌సఎస్) బాధ్యత చేపట్టాల్సిందేనని స్పష్టం చేశారు. వారికే పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. కేఎ్‌సఎ్‌సల నియామకం మార్చి 30 నాటికి పూర్తికావాలని, మార్చి 31 నుంచి ఏప్రిల్ నెలాఖరుకల్లా క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే..
కార్యకర్తలకు రుణపడి ఉంటా
పార్టీ కార్యకర్తలకు రుణపడి ఉంటా. జగన్ జమానాలో ఐదేళ్లు ఎన్ని హింసలు పెట్టినా, ప్రాణాలు తీసినా పార్టీతోనే ఉన్నారు. కేడర్‌ను కాపాడుకోవడం మన బాధ్యత. నియోజకవర్గ స్థాయి మొదలు గ్రామస్థాయి వరకు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించండి. వారిని కలుపుకొని వెళ్తే నాయకులకు తిరుగుండదు. ఇన్‌చార్జి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయాలి. ఇన్‌చార్జి మంత్రి నేతృత్వంలో తరచూ ఆ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశమవుతుండాలి. విందు భేటీలు పెట్టుకోండి. మళ్లీ మనమే అధికారంలోకి రావాలనే స్పృహతో పనిచేయాలి. దానికి నిత్యం ప్రజల్లో ఉండడమే మార్గం. కేంద్ర మంత్రులు నెలకు 2-3 సార్లు జిల్లాలకు వెళ్లి అభివృద్ధి, సంక్షేమాలను ప్రజలకు వివరించాలి. ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించి, అందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులు.. అందరూ భాగస్వాములు కావాలి. చెత్త తీయడం, వీధులు శుభ్రపరచడం వంటి వాటిపైనే కాకుండా ప్రజల్లో మమేకమై సమాజాన్ని చైతన్యపరిచే కార్యక్రమాలూ నిర్వహించాలి.
బడ్జెట్‌పై చర్చ జరగాలి..
కేంద్ర బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్డీయే ప్రభుత్వం వినూత్న రీతిలో కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించింది. అదే తరహాలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రజల్లో చర్చకు పెట్టాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు దీనిపై చొరవ తీసుకోవాలి. బడ్జెట్‌పైన, ప్రభుత్వంపైన ప్రజల ఫీడ్ బ్యాక్ తీసుకోండి. అన్న క్యాంటీన్‌కు వెళ్లి అక్కడ ఉన్నవారితో కలిసి భోజనం చేసి ఫీడ్ బ్యాక్ అడగండి. బడ్జెట్ రూపకల్పనపై ఎంతో కసరత్తు చేశాం.
సూపర్-6 హామీల అమలుకు ప్రాధాన్యం ఇచ్చాం. అన్నదాత, తల్లికి వందనం పథకాలకు నిధులు కేటాయించాం. మే నుంచి వాటిని అమలు చేస్తాం. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కూడా అమలు చేస్తాం. గృహనిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీలకే అదనంగా నిధులిస్తోంది. ఇకపై బీసీలకూ రూ.50వేలు అదనంగా ఇస్తాం. 2029నాటికి ప్రతి కుటుంబానికి ఇల్లు, నీరు, విద్యుత్, పీఎం సూర్యఘర్ ద్వారా సౌర విద్యుత్, గ్యాస్ సరఫరా, మరుగుదొడ్డి, ఇంటర్నెట్ అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. వాట్సాప్ గవర్నెన్స్‌లో ప్రస్తుతం 161 సేవలు ఇస్తున్నాం. వీటిని త్వరలోనే 500కు పెంచుతాం. దీనిపై ఎమ్మెల్యేలు ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. వేసవికాలంలో నీటి సమస్య లేకుండా చూసేందుకు ఓ యాప్ కూడా తీసుకొస్తున్నాం. ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే వారి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ప్రణాళికాపత్రం తయారు చేసుకోవాలి. త్వరలో ఎమ్మెల్యేలతో ముఖాముఖి నిర్వహిస్తాం. అసెంబ్లీలో ఏ ఎమ్మెల్యే ఎంతసేపు ఉన్నారో కూడా త్వరలో స్ర్కీన్‌పై చూ పిస్తాం. ప్రతి సభ్యుడూ సభ జరిగే సమయం లో అసెంబ్లీలో ఉండాల్సిందే.
2 నెలల్లో గుంతల్లేని రోడ్లు
వైసీపీ మిగిల్చి వెళ్లిన గుంతల రోడ్లను చాలావరకు పూడ్చి మంచిగా చేశామని.. ఇంకా ఎక్కడైనా ఇబ్బందులుంటే మంత్రి జనార్దన్‌రెడ్డి చొరవ తీసుకుని 2 నెలల్లో గుంతలు లేని రా ష్ట్రంగా మార్చడంపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. మంత్రి స్పందిస్తూ.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ డబ్బులివ్వడం లేదని సరదాగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు బదులిస్తూ.. ‘కేశవ్‌కు కూడా చెబుతున్నా.. రోడ్లను ప్రాధాన్యంగా తీసుకుని జనార్దన్‌రెడ్డికి డబ్బులివ్వాలి’ అని చెప్పడంతో సమావేశంలో నవ్వులు విరిశాయి.
ప్రజలకు, పార్టీ కేడర్‌కు.. అలాగే పార్టీ కేడర్‌కు, లీడర్లకు నడుమ దూరం పెరుగుతోంది. ఇది మంచిది కాదు. తరచూ జనంలోకి వెళ్తుండాలి. శ్రేణులతో సమావేశమవుతూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ఉండాలి.
కొత్తగా వచ్చినవారు టీడీపీ విధివిధానాలు.. పార్టీ ఆలోచనలను ఇంకా వంటబట్టించులేకపోతున్నారు. ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా చర్చించి పరిష్కరించుకోవాలే తప్ప వీధినపడకూడదు.
అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేయడం వైసీపీకి, ఆ పార్టీ నాయకులకు అలవాటు. ఇప్పటికీ వారిది అదే తీరు. దానిని వ్యూహాత్మకంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం.
- సీఎం చంద్రబాబు