Share News

Focus on Green Energy: వ్యవసాయానికి స్మార్ట్‌ మీటర్లు వద్దు

ABN , Publish Date - Aug 14 , 2025 | 03:56 AM

రాష్ట్రంలో వ్యవసాయ పంప్‌ సెట్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు డిస్కమ్‌లను ఆదేశించారు....

Focus on Green Energy: వ్యవసాయానికి స్మార్ట్‌ మీటర్లు వద్దు

భవిష్యత్తు అంతా గ్రీన్‌ ఎనర్జీదే

  • ఏపీని గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌గా తీర్చిదిద్దాలి

  • ఇంధన రంగంపై స్వల్ప, మధ్య, దీర్ఘకాల ప్రణాళికలు

  • పునరుత్పాదక ఎనర్జీలో ఖర్చు తగ్గించడం కీలకం

  • విద్యుత్‌ చార్జీల భారం వేయడానికి వీల్లేదు

  • విద్యుత్‌ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు

అమరావతి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయ పంప్‌ సెట్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు డిస్కమ్‌లను ఆదేశించారు. ఏపీని గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంధన శాఖకు సూచించారు. బుధవారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యుత్‌ సరఫరా, విద్యుత్‌ ప్రాజెక్టులు, పెట్టుబడులు, వినియోగదారులపై విద్యుత్‌ చార్జీల భారం తగ్గింపు.. తదితర అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం పునరుత్పాదక విద్యుత్‌ వేగంగా విస్తరించి జనజీవనంలోకి వచ్చేసిందని, భవిష్యత్‌ అంతా గ్రీన్‌ ఎనర్జీదేనని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంలో వేగంగా మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. ఇంధన రంగంలో స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ను ఆదేశించారు. పునరుద్పాదక ఇంధన ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే అంశంపై అధ్యయనం చేయాలన్నారు. వచ్చే రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం మరో 8.9 శాతం మేర పెరిగే వీలుందని అన్నారు. విద్యుత్‌ ఉత్పత్తి ధర యూనిట్‌కు రూ.5-6 వరకూ తగ్గేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీలో 65 గిగావాట్ల పవన విద్యుత్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే వీలుందని సీఎం తెలిపారు. ఇంధనోత్పత్తిలో కృత్రిమ మేధ (ఏఐ) సేవలను వినియోగించుకోవాలని సూచించారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో ఖర్చు తగ్గించడం కీలకమని చెప్పారు. మరోవైపు వినియోగదారులపై విద్యుత్‌ చార్జీల భారం వేసేందుకు వీల్లేదని సీఎస్‌ విజయానంద్‌కు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్‌కో వేసిన ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌ను లీజుకివ్వడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందాలని చెప్పారు. ఈ మార్గం ద్వారా ఏటా దాదాపు రూ.7 వేల కోట్ల దాకా ఆదాయం వచ్చే వీలుందని సీఎం అంచనా వేశారు. సమీక్షలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ కీర్తి చేకూరి, జెన్కో, ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ కొనుగోళ్లు తగ్గించండి

రాష్ట్రంలో 9 శాతంగా ఉన్న విద్యుత్‌ పంపిణీ నష్టాలు గణనీయంగా తగ్గించాలని సీఎం ఆదేశించారు. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోళ్లను తగ్గించాలన్నారు. వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను సాధ్యమైనంతవరకూ స్థానికంగానే వినియోగిస్తే ప్రవాహ నష్టాలు తగ్గుతాయని చెప్పారు. యూనిట్‌ కొనుగోలు వ్యయాన్ని రూ.4.89కు తగ్గించేలా లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలన్నారు. మరోవైపు సెన్సర్లు, డ్రోన్లు ఇతర సాంకేతిక సహకారంతో ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసి తదనుగుణంగా విద్యుత్‌ సరఫరాపై చర్యలు చేపట్టాలన్నారు. సెప్టెంబరు నుంచి వచ్చే ఏడాది మార్చి దాకా 12,700 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంటుందని అంచనా వేశామని అదికారులు చెప్పగా.. డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తిని పెం చేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.

సోలార్‌పై దృష్టి పెట్టాలి..: సోలార్‌ రూఫ్‌టాప్‌ ప్రాజెక్టును వేగవంతం చేయాలని డిస్కమ్‌లను సీఎం ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఇతర వర్గాలకూ సోలార్‌ రూఫ్‌టాప్‌ కింద ఎన్ని యూనిట్లు మంజూరు చేశారని ఆరా తీశారు. ఈ ప్రాజెక్టుపై ప్రతినెలా సమీక్షిస్తానని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పదివేల ఇళ్లకు తగ్గకుండా సోలార్‌ రూఫ్‌ టాప్‌ను బిగించాలని ఆదేశించారు. వాట్సాప్‌ మన మిత్ర యాప్‌ ద్వారా డిస్కమ్‌లు సేవలందించాలని తెలిపారు. రాష్ట్రంలో లో వోల్టేజీ సమస్యను పరిష్కరించాలన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 08:01 AM