Share News

స్మార్ట్‌ సిటీపై ప్రతిపాదనలు ఏవీ..!

ABN , Publish Date - Jan 30 , 2025 | 12:08 AM

కర్నూలు నగరాన్ని స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చేస్తాం.

స్మార్ట్‌ సిటీపై ప్రతిపాదనలు ఏవీ..!

అమలులోకి రాని సీఎం చంద్రబాబు హామీ

పార్కుల కబ్జాపై విచారణ అంతేనా..?

పార్కుల కబ్జాలపై గత సమావేశంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఆరా

వైసీపీ హయాంలో జరిగిన పనులపై విజిలెన్స విచారణకు మంత్రి టీజీ భరత హామీ

నెలలు గడిచినా చర్యలు శూన్యం

నేడు రూ.201.22 కోట్లతో కర్నూలు నగరపాలక సంస్థ బడ్జెట్‌ సమావేశం

కర్నూలు న్యూసిటీ/కర్నూలు, జనవరి 29 (ఆంధ్రజ్యోతి):

ఫ కర్నూలు నగరాన్ని స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చేస్తాం. నగరవాసులకు మెరుగైన వసతులు, రహదారులు, తాగునీరు, ఉద్యానవనాలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ముందుకు వెళ్తాం.

- 2024 అక్టోబరు 1న పత్తికొండ మండలం పుచ్చకాయలమడ సభలో సీఎం చంద్రబాబు స్పష్టమైన హామీ

ఈ విషయంపై తక్షణం ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి నగరపాలక సంస్థకు ఆదేశాలు కూడా వచ్చాయి. అక్టోబరు 8న జరిగిన కౌన్సిల్‌ సమావేశంలోనూ చర్చకు వచ్చింది. నెలలు గడుస్తున్నాయే తప్ప ప్రతిపాదనలు పంపలేదని తెలుస్తున్నది. వైసీపీ హయాంలో జరిగిన పనులుపై విజిలెన్స విచారణ చేయిస్తామని పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత కౌన్సిల్‌ వేదికగా హామీ ఇచ్చారు. పాణ్యం నియోజకవర్గం పరిధిలో ఉండే నగర పాలక వార్డుల్లో పార్కులు కబ్జాకు గురయ్యాయని, విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. నెలలు గడుస్తున్నా ఆ దిశగా చర్యలు శూన్యం. కౌన్సిల్‌లో తీర్మానాలకే దిక్కు లేకపోతే వార్డుల్లో ఇచ్చే హామీలు అమలవుతాయా..? అని పలువురు కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. నగరంలో ప్రధాన రహదారులు, ట్రాఫిక్‌, శివారు కాలనీల్లో తాగు నీరు, సీపీ రోడ్లు, పారిశుద్ధ్యం, వీధిదీపాలు వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. నేడు కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో రూ.201.22 కోట్ల బడ్టెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. బడ్జెట్‌తో పాటు స్మార్ట్‌సిటీ, పార్కుల కబ్జా, గతంలో జరిగిన పనుల్లో అక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకోవాలని కార్పొరేటర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

కర్నూలు కార్పొరేషన మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించింది. 52 వార్డులు ఉంటే.. కర్నూలు నియోజకవర్గంలో 32 వార్డులు, పాణ్యం నియోజకవర్గంలో 16 వార్డులు, కోడుమూరు నియోజకవర్గంలో 4 వార్డులు ఉన్నాయి. జనాభా దాదాపుగా 6 లక్షలు మైలురాయి దాటుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2024-25 కార్పొరేషన చివరి బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు. వివిధ పన్నులు, అద్దెలు, వివిధ ప్రభుత్వ గ్రాంట్లు ద్వారా రూ.285.74 కోట్ల అంచనాతో బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు. సవరించిన బడ్జెట్‌ రూ.180.37 కోట్లు. అంటే.. అంకెల్లో చూపిన బడ్జెట్‌కు వాస్తవ బడ్జెట్‌కు మధ్య రూ.105.37 కోట్లు తేడా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని 2025-26 కార్పొరేషన బడ్జెట్‌ను వాస్తవాలకు దగ్గర రూ.201.22 కోట్లతో ప్రవేశ పెడుతున్నట్లు తెలుస్తున్నది. బడ్జెట్‌లో పాటు గత ఏడాది అక్టోబరు 8న జరిగిన సమావేశంలో తీర్మానాలు అమలు చేసే దిశగా నేటి సమావేశంలో పక్కాగా చర్చించాలని పలువురు కోరుతున్నారు.

ఫ పార్కుల కబ్జాపై చర్యలు శూన్యమేనా..?:

పాణ్యం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కార్పొరేషన వార్డుల్లో 16 పార్కులు ఉన్నాయి. పలు పార్కులు కబ్జాకు గురయ్యాయి. ఎన్ని పార్కులు అక్రమణకు గురయ్యాయి..? ఎవరు ఆక్రమించిందీ నిగ్గు తేల్చండి..? అంటూ అక్టోబరు 8న జరిగిన కార్పొరేషన సర్వసభ్య సమావేశంలో పాణ్యం ఎమ్మెల్యే అన్నారు. అంతేకాదు.. పనులు చేయకుండానే రూ.కోట్ల ప్రజాధనం స్వాహా చేశారని, వాటర్స్‌ వర్క్స్‌ విభాగంలో శివారు కాలనీలకు వాటర్‌ ట్యాంకులు పంపుతామని చెబుతున్నారే తప్ప పంపకుండానే పంపినట్లు బిల్లులు స్వాహా చేస్తున్నారని ఎమ్మెల్యే గౌరు చరిత తీవ్రంగా అన్నారు. పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై నిగ్గు తేల్చేందుకు నిజనిర్ధారణ కమిటీ వేస్తామని, వచ్చే సమావేశం నాటికి ఆ కమిటీ నివేదిక సిద్ధం చేయాలని తీర్మానం చేశారు. నెలలు గడిచిపోయానే తప్ప.. కమిటీ మాత్రం వేయలేదు. గతంలో నగరంలో జరిగిన వివిధ పనులుపై విజిలెన్స అండ్‌ ఎనఫోర్స్‌మెంట్‌ విచారణ చేయిస్తామని మంత్రి టీజీ భరత కౌన్సిల్‌ సమావేశంలో పేర్కొన్నారు. ఆ దిశగా చర్యలు శూన్యం.

ఫ అటకెక్కిన పైపుల కుంభకోణం:

2020 నవంబరు 20న తుంగభద్ర పుష్కరాల సందర్భంగా పుష్కర పుణ్య స్నానాల కోసం ఘాట్ల వద్ద తాత్కాలిక మురుగునీరు మళ్లింపు కోసం రూ.4.20-4.50 కోట్లతో కొనుగోలు చేసిన హెచడీ పైపుల వివాదం ఎటూ తేలలేదు. పుష్కరాలు అనంతరం వీకర్స్‌ సెక్షన కాలనీ పార్కులో ఆ పైపులను భద్ర పరిస్తే.. అగ్ని ప్రమాదంలో కాలిపోయాని ఇంజనీర్లు చెబుతున్నారు. పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేస్తే.. రూ.28 లక్షల విలువైన పైపులే కాలిపోయాని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మిగిలిన రూ.4 కోట్లు విలువైన పైపులు ఏమయ్యాయి? దీనిపై గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన విచారణ కమిటీ రికార్డులకే పరిమితమైంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ విచారణ అంశం తెరపైకి వచ్చినా.. ఆ తరువాత చర్యలు శూన్యం. టీడీఆర్‌ బాండ్ల జారీ అక్రమాలపై చర్చ జరగాలి.

ఫ వీటిపై దృష్టి సారించాలి:

ఫ నగరం విస్తరిస్తోంది. ప్రస్తుత జనాభా 6 లక్షలకు పైమాటే అని అంటున్నారు. జనాభాతో పాటుగా కాలనీలు, వాహనాలు, మైటర్‌బైకులు సంఖ్య కూడా మూడింతలకు పైగా పెరిగాయని అంచనా. ఆ స్థాయిలో నగర ప్రధాన రహదారులు విస్తరించడం లేదు. దీంతో ట్రాఫిక్‌ సమస్యపై వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా బళ్లారి చౌరస్తా, రాజ్‌వివాహర్‌, ఆర్టీసీ బస్టాండ్‌, ఐదు రోడ్ల కూడలి, సీ క్యాంప్‌, చెక్‌పోస్ట్‌ ఏరియా, గాయత్రీ ఎస్టేట్‌, కలెక్టరేట్‌ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. వీటిపై దృష్టి సారించాలి.

ఫ శివారు కాలనీల్లో తాగునీటి సమస్యతో జనం పడుతున్న అవస్థలు ఎన్నో. స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చేస్తామని స్వయాన సీఎం చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ దిశగా ప్రతిపాదనలు పంపాలంటూ సీఎంవో ఆఫీసు నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. ఆలస్యం చేయకుండా రహదారులు, తాగునీటి పనులపై తక్షణం ప్రతిపాదనలు తయారు చేయాలి. నేటి సమవేశంలో దీనిపై చర్చ జరగాలి.

ఫ ఆర్టీసీ బస్టాండ్‌ దొంగలకు అడ్డాగా మారింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు, రైతులు లక్ష్యంగా దొంగలు తమ చేతులకు పని చెబుతున్నారు. బాధితులు సంబంధిత పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేస్తే.. రికరీ చేశాక మీ సొమ్ము ఇస్తామని చెప్పి పంపుతున్నారే తప్ప కేసులు నమోదు చేయడం లేదు. ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతంలో ప్రత్యేక పోలీస్‌ అవుట్‌ పోస్టు ఏర్పాటు చేసి 24 గంటలు పోలీసు నిఘా ఉంచాలి.

ఫ పాణ్యం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే 16 వార్డులు సహా నగరంలోని 52 వార్డులకు గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి అమృత-0.2 పథకం కింద తాగునీటి సరఫరాకు ప్రతిపాదనలు పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీర్లు రూ.375-400 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. దీనిపై కూడా చర్చించాలి.

ఫ వేసవి రాబోతుంది. నగర శివారు కాలనీల్లో తాగునీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించాలి. అవసరమైన నిధులు కూడా ఇవ్వాలి. రాబోయే నీటి ముప్పును అధిగమించే లక్ష్యంగా దాదాపు రూ.100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం 80 ఎంఎల్‌డీ నీరు సరఫరా చేస్తున్నారు. 120 ఎంఎల్‌డీ నీరు అవసరం ఉంది. అందుకు అనుగుణంగా ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మించాల్సి ఉంది.

ఫ మెజార్టీ కాలనీల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. నెలలు గడిచినా మురుగు కాలువలు శుభ్రం చేయడం లేదు. ముఖ్యంగా శివారు కాలనీల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. అదే క్రమంలో సీసీ రోడ్లు లేక వర్షాకాలంలో పడుతున్న అవస్థలు ఎన్నో. స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమం ద్వారా పారిశుధ్యం మెరుగుకు, వీధిదీపాలు ఏర్పాటుపై కూడా ఈ సమావేశంలో కార్పొరేటర్ల గళం విప్పాలి.

Updated Date - Jan 30 , 2025 | 12:08 AM