CM Chandrababu : 4 నెలలు.. 3 హామీలు
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:07 AM
ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, వీలైనంత త్వరగా అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయించారు. జూలై నాటికి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయడంతో పాటు డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి చేసే దిశగా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

నాలుగు నెలలు 3 హామీలు
అమలుకు కార్యాచరణ.. కేబినెట్ కీలక నిర్ణయం
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం
జూలైకి డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి
మేలో రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ
విద్యుత్తు చార్జీలు తగ్గించడంపై దృష్టి
రెవెన్యూ సమస్యలపై ఆర్డీవోకే అప్పీల్ అధికారం
నీరు-చెట్టు పెండింగ్ బిల్లులు 900 కోట్లకు మోక్షం
హాస్టళ్లు, మధ్యాహ్న భోజనానికి నాణ్యమైన బియ్యం
జీఎ్‌సడీపీ పెంపునకు నియోజకవర్గానికో బృందం
అధికారుల శిక్షణకు అత్యాధునిక కేంద్రం ఏర్పాటు
రూ.6,78,345 కోట్ల పెట్టుబడులు!
ఒప్పందాలు జరిగిన 34 ప్రాజెక్టుల
ప్రతిపాదనలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం
బడుగు, మహిళా పారిశ్రామికవేత్తలు,
దివ్యాంగులకు 45% పెట్టుబడి రాయితీ
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకం అమలు చేయాలి. ఎంతమంది పిల్లలున్నా ఇస్తాం. మేలోనే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేస్తాం. అధికారులు ఈ దిశగా చర్యలు వేగవంతం చేయాలి.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి. పాఠశాలలు ప్రారంభం కావడానికి ముందే నియామక ప్రక్రియను పూర్తి చేయాలి.
- కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు
అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, వీలైనంత త్వరగా అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయించారు. జూలై నాటికి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయడంతో పాటు డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి చేసే దిశగా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, జనాభా నిర్వహణకు ఉపయోగపడుతుందని చంద్రబాబు అన్నారు. చాలామంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి తల్లిదండ్రులు పిల్లలను చదివించలేక ఒకరు లేదా ఇద్దరికే పరిమితమవుతున్నారని, ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వం చదివిస్తుందన్న భరోసా వారికి తల్లికి వందనం ఇస్తుందన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన బియ్యం
సంక్షేమ వసతి గృహాలకు, మధ్యాహ్న భోజన పథకానికి ఇస్తున్న బియ్యం నాసిరకంగా ఉందని మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ కేబినెట్‌లో ప్రస్తావించారు. దీన్ని మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో నాణ్యమైన బీపీటీ బియ్యాన్ని అందిస్తామని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
మళ్లీ ఆర్డీవోలకే అధికారం
రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి ఏం చేయాలన్న దానిపై కేబినెట్‌లో చర్చ జరిగింది. గతంలో ఆర్డీవో స్థాయిలోనే అప్పీల్ చేసుకునే అధికారం ఉండేదని, వైసీపీ హయాంలో ఆర్డీవోను పక్కన పెట్టి డీఆర్వోకు ఆ బాధ్యతలు అప్పగించారని, డీఆర్వోలపై పనిఒత్తిడి కారణంగా రెవెన్యూ ఫైళ్లు భారీగా పేరుకుపోతున్నాయని అభిప్రాయపడ్డారు. గతంలో మాదిరి ఆర్డీవోకే అప్పీల్ చేసుకునే అధికారాన్ని కట్టబెట్టాలని నిర్ణయించారు.
జీఎస్‌డీపీ పర్యవేక్షణకు ప్రత్యేక బృందం
రాష్ట్రం ప్రస్తుతమున్న పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి(జీఎ్‌సడీపీ) పెంచుకోవడం ఒక్కటే మార్గమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ దిశగా అడుగులు వేసేందుకు నియోజకవర్గ స్థాయిలో ఉన్న అన్ని సచివాలయాల నుంచి అత్యుత్తమమైన ఐదుగురు ఉద్యోగులను ఎంపిక చేసి వారితో పాటు ఒక ఆర్థిక, సామాజిక వృత్తినిపుణుడిని, ప్రభుత్వ అధికారిని ఒక బృందంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. నియోజకవర్గ స్థాయిలో జీఎ్‌సడీపీ పెంపుదలపై నిరంతరాయంగా పర్యవేక్షణ చేయాలన్నారు. నియోజకవర్గంలోని కుటుంబాల నుంచి వనరుల వరకు అన్నింటినీ నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ జీఎ్‌సడీపీ పెరుగుదలకు ఏం చర్యలు తీసుకోవాలో ఈ బృందం అధ్యయనం చేసి స్థానిక ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని సీఎం తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ప్రతినెలా సమావేశాలు పెట్టుకుని పర్యవేక్షించాలని ఆర్థిక మంత్రి కేశవ్‌కు సూచించారు.
వాట్సాప్ గవర్నెన్స్‌కు స్పందన భేష్
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్‌పై కేబినెట్‌లో చర్చ జరిగింది. దీనికి మంచి స్పందన వస్తోందని, దీన్ని జనంలోకి మరింతగా తీసుకెళితే ప్రజలకు కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తగ్గడంతోపాటు ఇటు అధికారుల పని సులభతరం అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలుపై నిరంతరం సర్వేలు చేయిస్తున్నామని, అన్ని పథకాల మీద పాజిటివ్ స్పం దన వస్తోందన్నారు. దీనిని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉందని మంత్రులకు సీఎం సూచించారు.
ఆప్కాస్ రద్దుకు సూచన
ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ సర్వీసెస్ (ఆప్కా్‌స)ను రద్దు చేయాలన్న అంశంపై చర్చించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆప్కాస్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని పలువురు మంత్రులు పేర్కొన్నారు. ఏ శాఖకు ఆ శాఖ వారి అవసరాలకు తగ్గట్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకోవడం ద్వారా ఉద్యోగులపై ఆ శాఖ అధికారులకు పట్టు ఉంటుందని, మంచి పనితీరు రాబట్టుకునేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆప్కాస్ రద్దు చేస్తేనే మంచిదని కేబినెట్ అభిప్రాయపడింది.
నీరు-చెట్టు బిల్లులు చెల్లించాలి
టీడీపీ హయాంలో 2014-19 మధ్య నీరు-చెట్టు పనులు చేసిన టీడీపీ సానుభూతిపరుల బిల్లులు సుమారు రూ.900 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని చెల్లించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కేబినెట్‌లో చర్చ జరిగింది. అప్పులు చేసి పనులు చేసిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు బకాయిల కోసం తమ చుట్టూ తిరుగుతున్నారని, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని మంత్రులు వ్యాఖ్యానించారు. ఇన్‌చార్జి మంత్రులు జిల్లాలకు వెళ్లినప్పుడు ఆయా జిల్లాల్లో ఉన్న బకాయిలపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. 2019 నాటికి ఉన్న ఇళ్ల బకాయిలు కూడా క్లియర్ చేయాలని నిర్ణయించారు.
ఉద్యోగాల కల్పనపై దృష్టి
రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీలో చాలా ఎంవోయూలు చేసుకున్నామని, వాటిని గ్రౌండ్ చేయడంపై దృష్టి సారించాలని మంత్రులకు సీఎం సూచించారు. సుమారు రూ.10 లక్షల కోట్ల ఎంవోయూలు జరిగాయని ఇవన్నీ గ్రౌండ్ చేయించగలిగితే సుమారు 7 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు.
సౌర విద్యుత్తులో టాప్‌లో నిలవాలి
సూర్యఘర్, కుసుమ పథకాల అమలుపై దృష్టి సారించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ పథకాల కింద 7 లక్షల యూనిట్లు గ్రౌండ్ చేశారని, రాష్ట్రంలో ఏడాది కాలంలో 10 లక్షల యూనిట్లు గ్రౌండ్ చేయడం ద్వారా దేశంలోనే రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపాలని సీఎం కోరారు. సౌర విద్యుత్తు వినియోగం పెరిగితే వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం తగ్గడంతో పాటు ప్రభుత్వంపై విద్యు త్తు కొనుగోలు భారం కూడా తగ్గుతుందన్నారు. వీలైనంత వరకు విద్యుత్తు చార్జీలు తగ్గించడంపైనే అధికారులు దృష్టి పెట్టాలన్నారు. సూర్యఘర్, కుసుమ పథకాల అమలుపై ఇన్‌చార్జి మంత్రులు దృష్టి సారించాలన్నారు.
ఇసుక, మద్యం సమస్యలపై చర్చించండి
జిల్లా సమీక్షా సమావేశాలు(డీఆర్సీ) క్రమం తప్పకుండా పెట్టాలని ఇన్‌చార్జి మంత్రులకు సీఎం సూచించారు. డీఆర్సీ సమావేశాలకు వెళ్లినప్పుడు ఇన్‌చార్జి మంత్రులు ఆ జిల్లాలో ఏ మేరకు ప్రభుత్వ భూములు ఉన్నాయన్న అంశంపై దృష్టి పెట్టాలన్నారు. అధికారులతో మాట్లాడి, వాటిలో పరిశ్రమలు పెట్టేందుకు అనువైన భూములు ఉన్నాయా అన్న అంశాన్ని గుర్తించాలని సూచించారు. మద్యం, ఇసుక పాలసీల్లో సమస్యలనూ చర్చించాలని కోరారు. ఇది నిరంతరాయంగా జరగాలన్నారు.
2028 నాటికి బనకచర్ల
బనకచర్లపై 3-4 నెలల్లో స్పష్టత తీసుకొచ్చి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం సూచించారు. 2028 నాటికి ఎట్టి పరిస్థితుల్లో బనకచర్ల ప్రాజెక్టు పూర్తవ్వాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపుతున్న అంశంపైనా చర్చ జరిగింది. దీనిపై సీఎం స్పందిస్తూ ట్రంప్ నిర్ణయం వల్ల తెలుగువాళ్లకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.