Nirmala Sitharaman : దానికి ఓ లెక్క ఉంది!
ABN , Publish Date - Mar 07 , 2025 | 07:12 AM
జీఎస్టీ, ఇతర ట్యాక్సులు విధిస్తున్నామంటే, దానికి కారణముందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు

ప్రజలకు ఏ సదుపాయమూ ఊరకనే రాదు
జీఎస్టీ, ఇతర ట్యాక్స్‌ల విధింపుపై నిర్మల వ్యాఖ్య
విశాఖ మెట్రో రైల్ డీపీఆర్ ఇస్తే నిధులిస్తామని వెల్లడి
విశాఖలో పర్యటనలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
విశాఖపట్నం, మార్చి 6(ఆంధ్రజ్యోతి): జీఎస్టీ, ఇతర ట్యాక్సులు విధిస్తున్నామంటే, దానికి కారణముందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. ఏ సదుపాయమూ ఊరకనే రాదని ప్రజలు గ్రహించాలని వ్యాఖ్యానించారు. విశాఖపట్నం నోవాటెల్‌లో గురువారం వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, చార్టెడ్ అకౌంటెంట్లతో ఆమె సమావేశం అయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత దానిని పార్లమెంటులో చర్చకు పెట్టి ఆమోదించే ముందుగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని నిర్మల తెలిపారు. ‘‘బడ్జెట్ సూచనల కోసం తొలుత ముంబైలో సమావేశం నిర్వహించాం. ఇప్పుడు విశాఖలో రెండో సమావేశం ఏర్పాటు చేశాం’’ అన్నారు.
పన్నులు కడుతోంది మూడు కోట్లమందే..
ఒక కారును రూ.12 లక్షలు పెట్టి కొంటే జీఎ్‌సటీ, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ ట్యాక్స్...ఇలా సుమారు మరో రూ.10 లక్షలు అదనంగా పన్నుల రూపంలో చెల్లించాల్సి వస్తోందని, ఇది న్యాయమా?...అని ఒకరు ప్రశ్నించగా మంత్రి సవివరంగా సమాధానమిచ్చారు. ‘‘సాధారణ పౌరుల దృష్టిలో ఇది పన్నుల భారంగానే కనిపిస్తుంది. కానీ అవన్నీ వేర్వేరు అవసరాల కోసం చెల్లిస్తున్నారు. తయారు చేసిన కారు కొన్నందుకు జీఎ్‌సటీ కడతారు. రహదారిపై ఆ వాహనం నడుపుతున్నందుకు ఆ రోడ్డు నిర్మాణానికి అయిన ఖర్చు కోసం పన్ను కట్టాల్సి ఉంటుంది. పెట్రోల్ పోయించుకుంటే, దానిని దిగుమతి చేసుకున్నందుకు పన్ను చెల్లించాలి. ఇలా అన్ని వేర్వేరు ప్రయోజనాల కోసం చెల్లించాల్సి ఉంటుంది. దేశంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు తొమ్మిది కోట్ల మంది ఉంటే...వారిలో కేవలం మూడు కోట్ల మంది మాత్రమే పన్ను చెల్లింపుదారులు ఉన్నారు’’ అని మంత్రి వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మత్స్యపురి గ్రామానికి చాలాకాలం క్రితం వరకు తాగునీరు ఉండేది కాదని, ఇప్పుడు ఆ గ్రామం సహా దేశంలోని ప్రతి ఇంటికీ జల జీవన్ మిషన్ ద్వారా నీటి కొళాయి ఇస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు ఉన్న రుణాలను చాలావరకు చెల్లించడం వల్ల బ్యాంకులు ఇప్పుడు ఆర్థిక సాయం అందించడానికి చర్యలు చేపడుతున్నాయన్నారు.
పోలవరం జాతీయ ప్రాజెక్టుగానే పూర్తిచేస్తాం
పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, దానిని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని నిర్మల అన్నారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు డీపీఆర్ సమర్పిస్తే...దానికీ నిధులిస్తామని హామీ ఇచ్చారు.
ఎగుమతిదారుల ప్రయోజనాలు కాపాడతాం
దీనికోసమే వాణిజ్యమంత్రి అమెరికా వెళ్లారు
సుంకాల పైనే చర్చలు జరుపుతున్నారు
ట్రంప్ ‘ప్రతీకార’ సుంకాల హెచ్చరిక నేపథ్యంలో.. నిర్మల వ్యాఖ్యలు
భారత ఎగుమతిదారుల ప్రయోజనాలను కాపాడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై పెద్దఎత్తున సుంకాలు విధిస్తామని హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో నిర్మల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విలేకరుల సమావేశంలో ట్రంప్ విధిస్తానంటున్న ప్రతీకార సుంకాల ప్రస్తావన రాగా, ఆమె వివరంగా స్పందించారు. ‘‘దేశంలోని ఎగుమతిదారుల ప్రయోజనాలే మా ప్రభుత్వానికి ప్రధానం. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ అమెరికా వెళ్లారు. సుంకాల అంశం కేంద్రంగానే ఆయన అక్కడి అధికారులతో చర్చలు జరుపుతున్నారు’’ అని నిర్మల తెలిపారు. కాగా, భారత్‌పై ఏప్రిల్ రెండో తేదీ నుంచి ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. ఈ నిర్ణయం వల్ల భారత్ ఏటా 700 కోట్ల డాలర్ల (దాదాపు రూ.61 వేల కోట్లు) ఆదాయం కోల్పోతుందని అంచనా వేస్తున్నారు.