Share News

Konaseema: డజను పెళ్లిళ్లు తప్పుడు ప్రచారం

ABN , Publish Date - Jun 25 , 2025 | 02:38 AM

నేను నిత్య పెళ్లికూతురిని కాదు.. 12 మందిని వివాహం చేసుకుని మోసగించలేదు’ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన బేతి వీరదుర్గా నీలిమ పేర్కొన్నారు.

Konaseema: డజను పెళ్లిళ్లు తప్పుడు ప్రచారం

  • నేను నిత్య పెళ్లి కూతురిని కాదు..

  • మోసగించి పెళ్లి చేసుకున్న పాస్టర్‌, ఆయన కుటుంబీకులే ఇలా చేస్తున్నారు.

  • మిగతా 11 మంది ఎవరో నిరూపించండి

  • విలేకరులతో బేతి వీరదుర్గా నీలిమ

రామచంద్రపురం(ద్రాక్షారామ), జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ‘నేను నిత్య పెళ్లికూతురిని కాదు.. 12 మందిని వివాహం చేసుకుని మోసగించలేదు’ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన బేతి వీరదుర్గా నీలిమ పేర్కొన్నారు. విడాకులు తీసుకున్నానని చెప్పి మోసగించి, తనను పెళ్లి చేసుకున్న పాలకొల్లుకు చెందిన పాస్టర్‌, అతని కుటుంబసభ్యులే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను పెళ్లి చేసుకుని మోసగించానంటున్న మిగతా 11 మందిని తీసుకువచ్చి ఆధారాలతో నిరూపించాలని సవాల్‌ చేశారు. నీలిమ తన తల్లి, తమ్ముడితో కలిసి మంగళవారం రామచంద్రపురం పోలీ్‌సస్టేషన్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. 2023లో తాను బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతుండగా..పెళ్లి సంబంధం వచ్చిందని, నిశ్చితార్థం చేసుకున్న, మర్నాడే పెళ్లి చేద్దామని చెప్పగా తన తల్లి అంగీకరించలేదని తెలిపారు.


సెప్టెంబరు 6న అన్నవరంలో పెళ్లికి ముహూర్తాలు పెట్టామని చెప్పారు. ఆగస్టు 26న తన పుట్టినరోజున పాస్టరు, కుటుంబీకులు తమ ఇంటికి వచ్చారని, ఆ రోజు పాస్టర్‌.. బొందు వేసి తాళి కట్టాడని తెలిపారు. సెప్టెంబరు 6న మీ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుందామని చెప్పి ఖర్చుల కోసం తన తల్లికి రూ.10 లక్షల చెక్కు ఇచ్చారని పేర్కొంది. ఈ క్రమంలో సెప్టెంబరు 2న పాస్టర్‌ మొదటి భార్య ఫోన్‌ చేసి, ఆయన తనకు విడాకులు ఇవ్వలేదని, ఇద్దరు పిల్లలున్నారని తెలిపిందని నీలిమ చెప్పారు. దీనిపై రామచంద్రపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారని, కేసు కోర్టు విచారణలో ఉందని, ఈలోగా తన తమ్ముడికి ఫోన్‌ చేసి బెదిరించారని నీలిమ ఆరోపించింది. కాగా, వీరదుర్గ నీలిమ చాలా మందిని మోసగించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని సీఐ వెంకటనారాయణ తెలిపారు. నీలిమ 12 మందిని పెళ్లి చేసుకుని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నట్లు పాలకొల్లుకు చెందిన గుర్రం రాజేశ్వరి సోమవారం అమలాపురం పీజీఆర్‌ఎ్‌సలో ఫిర్యాదు చేసిందన్నారు. దీనిపై విచారణ జరపగా నీలిమ కుటుంబానికి, రాజేశ్వరికి పాత గొడవలు ఉన్నాయని పరస్పరం కేసులు పెట్టుకోగా, కోర్టులో విచారణలో ఉన్నట్లు తెలిసిందన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 02:38 AM