Share News

NHRC: సాయి శ్రేయాస్‌ ప్రమాదంపై సుమోటోగా కేసు

ABN , Publish Date - Jun 25 , 2025 | 02:45 AM

అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో గల రాంకీ ఫార్మా సిటీలోని సాయి శ్రేయాస్‌ కంపెనీలో ఈ నెల 12వ తేదీన జరిగిన ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు మరణించిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పందించింది.

NHRC: సాయి శ్రేయాస్‌ ప్రమాదంపై సుమోటోగా కేసు

  • సీఎస్‌, అనకాపల్లి ఎస్పీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

  • ఈ నెల 12న విషవాయువు పీల్చి ఇద్దరు మృతి

  • ఈ ఘటనపై రెండు వారాల్లోగా నివేదికకు ఆదేశం

న్యూఢిల్లీ/విశాఖపట్నం, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో గల రాంకీ ఫార్మా సిటీలోని సాయి శ్రేయాస్‌ కంపెనీలో ఈ నెల 12వ తేదీన జరిగిన ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు మరణించిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పందించింది. విష వాయువులు పీల్చి ఇద్దరు ఉద్యోగులు మరణించారని, మరొకరిని ఆస్పత్రిలో చేర్చారని వార్తలు వచ్చిన నేపథ్యంలో దీనిపై సుమోటోగా కేసు విచారణ చేపడుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. దీనికి సంబంధించిన అంశాలపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, అనకాపల్లి జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఇందులో మానవ హక్కులు ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తోందని, అందుకే దీనిపై వివరణ కోరుతున్నామని వెల్లడించింది. గాయపడి ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్న మూడో వ్యక్తి పరిస్థితి ఏమిటో తెలియజేయాలని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఏమి ఇచ్చారో తెలపాలని కోరింది. ఈ మేరకు రెండు వారాల్లో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని కోరింది. కాగా.. సాయి శ్రేయా్‌సలో ప్రమాదంపై అధికారులు సరైన రీతిలో విచారణ చేపట్టలేదు. వ్యర్థాల ట్రీట్‌మెంట్‌ ప్లాంటులో ఏయే రసాయనాలు ఉన్నాయో ఇప్పటివరకూ బహిర్గతం చేయలేదు. వాటి శాంపిల్స్‌ సేకరించలేదు.


రెండు వారాల తరువాత కమిటీ ఏర్పాటుకు యత్నం

ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఈ కేసును సుమోటోగా స్వీకరించడంతో ఇప్పుడు ఈ ఘటనపై విచారణకు కమిటీని వేయాలని జిల్లా అధికారులు యత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆధారాలు, నమూనాలు సేకరిస్తే అది ఎలా జరిగిందో, ఏమి జరిగిందో శాస్త్రీయంగా విశ్లేషించడానికి అవకాశం ఉంటుంది. రెండు వారాల తరువాత కమిటీని వేసి, వారు ఇంకో నాలుగు రోజుల తరువాత అక్కడకు వెళితే ఏమి చూసి విచారణ చేస్తారో అధికారులే చెప్పాలి.

Updated Date - Jun 25 , 2025 | 02:45 AM