Resolutions : మంచి మాట.. మంచి బాట
ABN , Publish Date - Jan 01 , 2025 | 06:11 AM
మెరుపులు కొన్ని... మరకలు కొన్ని! తీపి జ్ఞాపకాలు కొన్ని... చేదు గుణపాఠాలు కొన్ని! ఏడాదిలోని రోజుల లెక్క అందరికీ ఒకటే! కానీ... ఏడాది గడిచిన తీరు మాత్రం అందరికీ ఒకటిగా ఉండదు! అయినప్పటికీ...
హ్యాపీ న్యూ ఇయర్‌లో ఏం చేద్దాం?
నేటి యువతకు ఎవరు ఆదర్శం?
కష్టాలకు ఎదురొడ్డి గెలవడం ఎలా?
హ్యాపీ న్యూ ఇయర్!
అర్ధరాత్రి కేక్ కోసి... హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టిగా అరవగానే జీవిత చిత్రం మొత్తం మారిపోదు! ఇప్పుడు మారేది క్యాలెండర్ మాత్రమే! నిజంగా జీవితం ‘హ్యాపీ’గా ఉండాలంటే... కొన్ని పద్ధతులు మార్చుకోవాలి! కొన్ని విడిచిపెట్టాలి! దీనికోసం ఘోర తపస్సులు చేయక్కర్లేదు! అప్రమత్తత, జాగ్రత్తతో ఆర్థికంగా, ఆరోగ్యంగా ‘హ్యాపీ’...
మెరుపులు కొన్ని... మరకలు కొన్ని! తీపి జ్ఞాపకాలు కొన్ని... చేదు గుణపాఠాలు కొన్ని! ఏడాదిలోని రోజుల లెక్క అందరికీ ఒకటే! కానీ... ఏడాది గడిచిన తీరు మాత్రం అందరికీ ఒకటిగా ఉండదు! అయినప్పటికీ... కొందరుంటారు! కాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా... మంచిని చూస్తారు! మాటలకే పరిమితం కాకుండా మంచి చేతలూ చేస్తారు. సొంతలాభం కొంత మానుకోవడమే కాదు... సొంత సొమ్ములు ఖర్చు పెట్టి మరీ మానవ సేవలో నిమగ్నమవుతారు. సాటి మనుషులు కష్టాల కన్నీళ్లను తుడిచేందుకు ముందుంటారు. కొత్త ఏడాదిని సరికొత్తగా ప్రారంభిస్తున్న ఈ తరుణంలో... కొన్ని మంచి మాటలు, కొందరు మంచి వాళ్ల ఊసులు! మీకోసం!
వనమే.. ప్రాణం
నల్లమలలో పచ్చదనం... అంకారావు అందరికీ ఆదర్శం
దినసరి కూలీగా జీవవం సాగిస్తున్న అంకారావు.. ప్రకృతిపైన ప్రేమతో వనాలను పెంచడానికి తన సర్వస్వాన్ని ధారపోస్తున్నారు. నిరక్షరాస్యుడైనా చదువుకున్న వాళ్ల కంటే ఎక్కువగా ప్రకృతిని అధ్యయనం చేశారు. వనాల సంరక్షణకు నిర్విరామకృషి చేస్తున్న అంకారావును నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి. ఎవరికి వారు మనకెందుకులే అని ఊరుకుంటే భవిష్యత్తులో ప్రాణవాయువును కొనుక్కునే పరిస్థితి వస్తుంది. సొంత పనులు కోసం సమయం కేటాయిస్తూనే.. కనీసం వారంలో ఒక్కరోజైనా పర్యావరణం, అడవులు పెంపొందించడంపై శ్రద్ధ చూపితే ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. కొత్త సంవత్సరంలో అయినా వన సంరక్షణకు ప్రజలంతా నడుంకడితే.. భవిష్యత్తుకు భరోసా ఉంటుంది.
విచ్చలవిడిగా అడవుల నరికివేత ప్రాణికోటికి ప్రమాదం అని 45 ఏళ్ల కొమ్మెర అంకారావు.. అలియాస్ జాజి గుర్తించారు. మొక్కలు పెంచడాన్ని, పక్షులను కాపాడడాన్ని తన వృత్తిగా ఎంచుకున్నారు. 30 ఏళ్లుగా నల్లమల ప్రాంతంలో అడవులను కాపాడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా కారంపూడి సమీపంలోని నల్లమల ప్రాంతానికి చెందిన ఆయన.. స్థానిక గిరిజనులతో కలిసి అడవిలో చెట్లు పెంచేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. చెట్లు నరికివేత కారణంగా కారంపూడి సరిహద్దుల్లో అడవి అంతరించిపోతుంది. అంకారావు ప్రయత్నాల వల్ల తిరిగి పచ్చదనం సంతరించుకుంటోంది. నాం, నల్లవేప, చింత విత్తనాలను నాటుతున్నారు. వాటి ద్వారా భవిష్యత్‌లో కలప, చింతపండు వంటి ఉత్పత్తులతో గిరిజనులకు ఆదాయం రానుంది.
తనకున్న ఎకరం పక్షుల కోసమే...
తనకున్న ఎకరం పొలంలో అంకారావు జొన్న, సజ్జ వంటివి పండిస్తూ పక్షులకు ఆహారాన్ని అందిస్తున్నారు. ఇక్కడికి రోజూ రామ చిలుకలు, పావురాళ్లు, పిచ్చుకలు, గోరింకలు వంటివి వచ్చి సందడి చేస్తాయి. నిజానికి అంకారావుకి సరైౖన ఆదాయం లేదు. నెలలో కొన్ని రోజులు దినసరి కూలీగా పనిచేస్తారు. దాంతో పాటు అడవుల్లో లభించే వనమూలికలు అమ్మి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కుటుంబసభ్యుల సహకారంతో తన ఆదర్శవంతమైన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

అనారోగ్యానికి అడవే మందు...
చిన్నతనంలో అంకారావు అనారోగ్యంతో బాధపడుతుండేవారు. వ్యవసాయ కూలీలైన తల్లిదండ్రులు దూరప్రాంతాలకు తీసుకెళ్లి వైద్యం చేయించలేని పరిస్థితి. సమీపంలోని అడవిలో దొరికే వనమూలికలతోనే వైద్యం చేసేవారు. ఈ క్రమంలో వనమూలికలు, వాటి ఉపయోగాల గురించి అంకారావు తెలుసుకున్నారు. అలా ఆయనకు అడవులపై మమకారం పెరిగింది. అడవుల్లో తిరగడం వల్లే తన ఆరోగ్యం మెరుగుపడిందని ఆయన చెబుతుంటారు. ఓ రోజు అడవిలో విష సర్పం కాటేస్తే వనమూలికలతోనే బయటపడ్డానని వివరించారు. తన జీవితంలో నల్లమల అడవులను విస్తరింపజేయాలనేది ఆయన కల. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని ఆయన నమ్మకం. అందుకే పాఠశాలలకు వెళ్లి పర్యావరణంపై విద్యార్థులకు ఉపన్యాసాలు ఇస్తారు. విద్యార్థులతో సీడ్ బాల్స్ తయారు చేయించి అడవుల్లో చల్లుతున్నారు. అంతేగాక పర్యాటకులు వదిలి వెళుతున్న వ్యర్థాలతో అడవి జంతువుల ప్రాణాలు పోతున్నాయని గుర్తించిన ఆయన.. ఆ వ్యర్థాలను ఏరివేయడంలోనూ తనవంతు కృషి చేస్తున్నారు. పర్యాటకులు వదిలివెళ్లిన మందు బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు, కవర్లు ప్రతిరోజు ఏరివేసి అడవికి దూరంగా తరలిస్తున్నారు.
-మాచర్లటౌన్, ఆంధ్రజ్యోతి
పుడమి పులకింత..
వృక్షో రక్షతి..
విత్తన బంతులతో విశాఖలో పచ్చదనం
ఓ పక్క సాగర తీరం.. మరోపక్క వన హారం.. ఇవి విశాఖకు ప్రత్యేకం. నగరం మధ్యలో నల్లతాచులా ఉండే జాతీయ రహదారిపై వెళుతుంటే.. పక్కనే ఏపుగా పెరిగిన చెట్లు స్వాగతం పలుకుతుంటే.. ఆ ప్రయాణమే ఆహ్లాదం. అయితే పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతున్న నగరాన్ని కాలుష్యం కమ్మేస్తోంది. ‘మొక్కలు నాటాలి...పచ్చదనం పెంచాలి’ అనే నినాదం కొంతకాలం క్రితం ఊపందుకుంది. అప్పుడే గ్రీన్ క్లైమేట్ బృందం రంగంలో దిగింది. అంతకు ముందే ఆ సంస్థ విత్తన బంతులు తయారుచేసి, మొక్కలు పెరగడానికి అనువైన ప్రాంతాల్లో వెదజల్లేది. ఎప్పుడైతే ప్రభుత్వం మొక్కలు పెద్ద సంఖ్యలో పెంచాలని నిర్ణయించిందో.. దానికి విత్తన బంతులే సరైన మార్గమని గ్రీన్ క్లైమేట్ ఎన్‌జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం.. అధికారులను కలిసి వివరించారు. వారికి అది నచ్చడంతో కార్యాచరణ సిద్ధం చేశారు. మహా విశాఖ నగర పాలక సంస్థ, తూర్పు నౌకాదళం, విశాఖ మహా నగర అభివృద్ధి సంస్థ, విజయ నిర్మాణ్, రోటరీ క్లబ్ ఇలా అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సాయం చేశాయి. దాంతో లక్షల సంఖ్యలో విత్తన బంతులు తయారుచేసి నగరం నలుమూలలా, కొండలపైనా వెదజల్లారు. దాని ఫలితంగా ఇప్పుడు నగరంలో ఏ కొండ చూసినా పచ్చదనంతో కళకళలాడుతోంది.
- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి
ఒక్కో విద్యార్థికి ఒక్కో మొక్క
ఆ బడిలో పచ్చగా పెరుగుతున్న బాల్యం
శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం తగరకుంట జిల్లా పరిషత్ పాఠశాలలో 203 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ బడిలో పుట్టిన రోజు వేడుకలకు కేక్ కట్ చేయడం, స్వీట్లను పంచడం వంటివి ఉండవు. పుట్టిన రోజున పాఠశాల ఆవరణలో ఆ విద్యార్థితో మొక్కను నాటిస్తారు. దాని సంరక్షణ బాధ్యతను ఆ విద్యార్థికే అప్పగిస్తారు. ఇలా ఒక్కొక్క మొక్క పెరిగి.. పాఠశాల ఆవరణ ఇప్పుడు వనాన్ని తలపిస్తోంది. ఈ బడి ఆవరణలోని ఖాళీ స్థలంలో కూరగాయలను సాగు చేస్తున్నారు. వాటిని పాఠశాల మధ్యాహ్న భోజనం తయారీలో వినియోగిస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి వారానికి రెండు రోజులు పాఠశాలలో మొక్కలకు నీరు పోస్తారు. చెట్ల కింద రాలిపోయిన ఆకులను తొలగించి.. శుభ్రపరుస్తారు. ఇలాంటి బడి ఆవరణలో పిల్లలు పచ్చగా ఎదగడంలో ఆశ్చర్యం ఏముంది!
ఆరోగ్యంతో ఆనందం!
ఆరోగ్యమే మహా భాగ్యం! దానిని కాపాడుకుంటేనే ఆనందం! నిత్యం వ్యాయామం, మంచి ఆహారం, సరైన నిద్ర... ఈ మూడూ పాటిస్తే జీవన శైలికి సంబంధించిన వ్యాధులను చాలావరకు దూరంగా పెట్టొచ్చు. అనుకోకుండా అనారోగ్యంతో ఆస్పత్రి పాలైతే... బిల్లులతో గుండె గుభేల్‌మంటుంది. అనారోగ్యానికి చికిత్స చేయించుకునే క్రమంలో ఆర్థిక ఆరోగ్యం కోలుకోలేనంతగా దెబ్బతినే ప్రమాదముంది. అందుకే... కుటుంబం మొత్తానికి తగిన మొత్తంలో ఆరోగ్య బీమా ఉండేలా చూసుకోవాలి. ఆనందంగా ఉండండి... ఆరోగ్యంగా ఉండండి!

‘డిజిటల్ వల’లో పడొద్దు!
ఇది ‘స్మార్ట్’లోకం! కనిపించకుండానే ‘స్మార్ట్’గా మాటేసే కాలం! మీ చేతిలోని స్మార్ట్ ఫోన్‌తోనే మిమ్మల్ని బురిడీ కొట్టిస్తారు! డిజిటల్ అరెస్టులు, తప్పుడు లింకులపై క్లిక్‌లు, ఓటీపీతో వేట... ఇలా ఒకటా, రెండా! రోజుకో మార్గంలో డిజిటల్ మోసాలు జరుగుతున్నాయి ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఖాతాలు ఖాళీ అయిపోతాయి! 2024లో మన రాష్ట్రంలో ఏకంగా 1229 కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. ఇందులో కేవలం రూ.225 కోట్లను మాత్రమే పోలీసులు ‘ఫ్రీజ్’ చేయగలిగారు. మిగిలిన మొత్తమంతా గోడకు కొట్టిన సున్నమే! అనుమానాస్పద కాల్స్‌తో జాగ్రత్తగా ఉండండి! డిజిటల్ అరెస్టు అనగానే భయపడిపోకండి! మీ సిమ్ కార్డును బ్లాక్ చేసేస్తాం, డెబిట్ కార్డును రద్దు చేస్తాం, క్రెడిట్ పాయింట్లకు కాలం చెల్లుతోంది... అని ఎవరైనా ఫోన్ చేశారంటే! అది ఫేక్! డిజిటల్ అరెస్టు మోసాలపై ప్రధాని మోదీ కూడా జాగ్రత్తలు చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు! మీ అప్రమత్తతే మీ సొమ్ములకు శ్రీరామ రక్ష!

విష్ యు హ్యాపీ జర్నీ!
అడ్డదిడ్డంగా బండి నడిపేవాళ్లు... రోడ్ల పక్కన ప్రమాదకరమైన రీతిలో లారీలు, ట్రక్కులు ఆపేవాళ్లు... నిర్లక్ష్యంగా, అతివేగంతో డ్రైవింగ్ చేసేవాళ్లు... నిద్ర ముంచుకొస్తున్నా స్టీరింగ్ వదలని వాళ్లు! వీళ్లే... ‘రోడ్ ఇడియట్స్’! ఒకటి... ఈ జాబితాలో ఉండకండి! రెండు... ఈ జాబితాలో ఉన్న వాళ్లతో జాగ్రత్తగా ఉండండి! హెల్మెట్, సీట్ బెల్టు, ఇతర రహదారి నిబందనలన్నీ పాటిస్తేనే జర్నీ హ్యాపీగా జరుగుతుంది! 2024 సంవత్సరంలో రాష్ట్రంలో 7315 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 7863 మంది రోడ్లకు బలైపోయారు! అంటే... సగటున రోజుకు 21 మంది! అన్యాయమైన, అకారణమైన చావులు ఇవి! ‘విజయవాడలో వాహనదారులకు క్రమ శిక్షణ లేదు’ అని స్వయంగా హైకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘మన దేశ పౌరులకు చట్టాలంటే గౌరవం లేదు’ అని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వాపోయారు! ఎవరో చెప్పారని కాదు... మన కోసం, మన కుటుంబం కోసం రహదారులపై భద్రంగా ప్రయాణిద్దాం! విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ!

డిజిటల్ డిటాచ్‌మెంట్!
మనసు విప్పి మాట్లాడుకుంటే బంధాలు బలపడతాయి! కానీ... కుటుంబంలో ఒకరికొకరు మాట్లాడుకునే సమయాన్ని స్మార్ట్ ఫోన్లు, టీవీలు మింగేస్తున్నాయి. ఇన్‌స్టా రీల్స్, ఫేస్‌బుక్ స్టోరీస్, వాట్సాప్ స్టేటస్, యూట్యూబ్ షార్ట్స్ చూడటంలో ఇంటిల్లిపాదీ బిజీ! చేతిలో స్మార్ట్ ఫోన్ పెడితేగానీ నోట్లో ముద్ద పెట్టుకోని చిన్నారులు! అన్నీ పక్కన పెట్టేసి... ఫోన్‌లో తలదూర్చేసే పెద్దలు! ఇదో ‘డిజిటల్’ వల! ఇది మానవ సంబంధాలనే కాదు... మానసిక ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తోంది! దీనికి మందు... ‘డిజిటల్ డిటాచ్‌మెంట్’! అంటే... అవసరమైనప్పుడు, అవసరమైన మేరకే ఫోన్‌ను చూడటం! నిర్దిష్టంగా కొన్ని సమయాల్లో ఫోన్‌ను చూడొద్దు అని తీర్మానం చేసుకోవాలి. అంటే... భోజనం చేస్తున్నప్పుడు, బాత్ రూమ్‌లో, బెడ్ రూమ్‌లో, సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నప్పుడు, మిత్రులను కలిసినప్పుడు ఫోన్ అస్సలు చూడొద్దు! ఇలా ప్రయత్నించి చూడండి! ‘హ్యాపీ’గాఉంటుంది!
