New Details Emerge in Liquor Scam: లిక్కర్ కేసులో నలుగురు వైసీపీ కీలక నేతలు!
ABN , Publish Date - Sep 08 , 2025 | 04:58 AM
తిన్నోళ్లకు తిన్నంత దోచుకున్నోళ్లకు దోచుకున్నంత తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా... గత జగన్ ప్రభుత్వంలో రూ.3,500 కోట్ల లిక్కర్ స్కామ్‌లో ఎందరో వైసీపీ నేతలు దోపిడీ చేశారు....
లిక్కర్ స్కామ్‌లో వైసీపీ నేతల అడ్డగోలు దోపిడీ
లిక్కర్ స్కామ్‌లో సిట్ తవ్వే కొద్దీ కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. కుట్రదారులు, లబ్ధిదారులు, పాత్రధారుల జాబితా అమాంతం పెరిగిపోతోంది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ఈ పాపకు సొమ్ములో ఎందరికో వాటా ఉంది. కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తుండటంతో కేసు విచారణ ‘అంతులేని కథ’లా సాగుతోంది.
మరో నలుగురు కీలక వైసీపీ నేతలకు లిక్కర్ ముడుపులు అందినట్టు సిట్ తాజా విచారణలో ఆధారాలు లభించినట్టు తెలిసింది. ఉత్తరాంధ్రలో వైసీపీ కీలకనేత మేనల్లుడు, గోదావరి జిల్లాల్లో టీడీఆర్ బాండ్లంటే గుర్తొచ్చే మాజీ మంత్రి, గుంటూరు జిల్లాలో మాటకారి నాయకుడిగా పేరున్న మాజీ మంత్రి, ఉమ్మడి అనంతలో ‘మార్నింగ్ స్టార్’ మాజీ ఎమ్మెల్యే భారీగా లిక్కర్ సొమ్ములు దండుకున్నట్టు సమాచారం.
మరి కొంతమంది వైసీపీ నేతలూ అందినకాడికి దోచుకున్నారు. మద్యం సరఫరా చేసే ట్రాన్స్‌పోర్టర్లతో పాటు హాలో గ్రామ్ కాంట్రాక్టర్ నుంచి సెక్యూరిటీ, మ్యాన్ పవర్ ఏజెన్సీల నుంచి సొమ్ములు పిండుకున్నారు. ప్రతి నెలా కనీసం పది లక్షలకు తగ్గకుండా పాతిక లక్షల వరకూ వసూలు చేసినట్లు తెలిసింది.
సిట్ విచారణలో కొత్త కొత్త పేర్లు తెరపైకి
ఉత్తరాంధ్ర కీలకనేత మేనల్లుడికి కోట్లలో సొమ్ము
‘గోదావరి’లో మాజీ మంత్రికీ భారీగానే
గుంటూరు జిల్లాలో మాజీ మంత్రికి వాటాలు
ఉమ్మడి అనంత పురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేకూ
విజయానంద రెడ్డి విచారణలో కీలక ఆధారాలు
మద్యం సరఫరా నుంచి అట్ట పెట్టెల వరకూ
హాలో గ్రామ్‌లోనూ కమీషన్లు
వీరితో పాటు మరికొందరు నేతలూ దందాలు
త్వరలో వైసీపీ నేతలకు నోటీసులిచ్చే అవకాశం
(అమరావతి-ఆంధ్రజ్యోతి): తిన్నోళ్లకు తిన్నంత! దోచుకున్నోళ్లకు దోచుకున్నంత! తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా... గత జగన్ ప్రభుత్వంలో రూ.3,500 కోట్ల లిక్కర్ స్కామ్‌లో ఎందరో వైసీపీ నేతలు దోపిడీ చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో వైసీపీ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. లిక్కర్ స్కామ్‌లో కీలక నిందితుడుగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాపార భాగస్వామి విజయానంద రెడ్డి(ఎర్రచందనం స్మగ్లర్)ని ఇటీవల సిట్ అధికారులు విచారించారు. వైసీపీ తరఫున విజయానంద రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన చిత్తూరులోని ఆయన కాంప్లెక్స్‌లో సోదాలు చేపట్టినప్పుడు అత్యంత కీలకమైన డేటా అధికారులకు లభించింది. అందులో ఎవరెవరికి ఎంత ముడుపులు ఇచ్చారనే వివరాలు ఉన్నాయి. మరింత లోతుగా ఆరా తీసిన సిట్ అధికారులు పలువురి పేర్లు గుర్తించారు.
అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీ కీలక నేత మేనల్లుడికి భారీగా ముడుపులు అందినట్లు తెలుస్తోంది. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మను పార్టీ నుంచి జగన్ శాశ్వతంగా సాగనంపిన రోజున గుంటూరు జిల్లాలో జరిగిన ఆ పార్టీ ప్లీనరీకి చేసిన ఖర్చుకు ప్రతిఫలంగా ఈ ముడుపులు ఇచ్చినట్లు సమాచారం. మద్యం సరఫరాదారుల నుంచి కోట్లాది రూపాయలు ఇప్పించినట్లు తెలిసింది. గోదావరి జిల్లాల్లోఒక మాజీ మంత్రికి కూడా భారీగా ముడుపులు చేరినట్లు సిట్ వర్గాలు గుర్తించాయి. రెండేళ్లకు పైగా మంత్రిగా పనిచేసిన ఆ నేత లిక్కర్ సొమ్ములు తీసుకున్నట్లు పూర్తిస్థాయిలో ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో ఓ మాజీ మంత్రికి కూడా లిక్కర్ ముడుపులు చేరినట్లు సమాచారం. ఎప్పుడూ వివాదాల్లో ఉండే ఆ మాజీ మంత్రిపై ఇప్పటికే అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు కూడా భారీగానే లిక్కర్ సొమ్ములు చేరినట్లు దర్యాప్తు బృందాలు ఆధారాలు సేకరించాయి. ఆ నాయకుడు లిక్కర్ ముడుపులు పేకాట డెన్‌లో తీసుకున్నట్లు తెలిసింది. ఇలా కూడా తీసుకుంటారా అంటూ అధికారులు ఆశ్చర్యపోతున్నారు.
దేన్నీ వదల్లేదు
మద్యం ఉత్పత్తిదారుల నుంచి ముఖ్యనేత వేల కోట్లు తీసుకుంటే.. ఆ మద్యాన్ని వైన్ షాపులకు తరలించిన ట్రాన్స్‌పోర్టర్ల నుంచి కింది స్థాయి నేతలు దండుకున్నారు. సీసా మూతలపై వేసే హాలో గ్రామ్ నుంచి ఖాళీ సీసాల విక్రయం వరకూ దేన్నీ వదల్లేదు. ఆఖరికి అట్టపెట్టెలు సైతం విక్రయించుకుని సొమ్ము చేసుకున్నారు. ఇంకా కొంతమంది వైసీపీ నేతలూ ప్రతి నెలా ముడుపులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఎవరెవరి నుంచి ఎవరెవరు ఎంత మేరకు తీసుకున్నారనే దానిపై సిట్ అధికారులు పూర్తి వివరాలు రాబడుతున్నారు. పూర్తి ఆధారాలు లభించాక ఆయా నాయకులకు నోటీసులిచ్చి విచారించే అవకాశముంది. ముడుపులు చెల్లించుకున్న ప్రతి ఏజెన్సీ నిర్వాహకులు వాసుదేవ రెడ్డి(ఏ-2) సూచన, సిఫారసు మేరకే ఇచ్చినట్లు చెప్పడంతో ఆయన్ను కూడా పిలిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లిక్కర్ స్కామ్‌లో తాడేపల్లి ప్యాలె్‌సతో పాటు కొందరు వైసీపీ ముఖ్యనేతలు, వారి అనుచరులు, అధికారుల పాత్ర ఉన్నట్టు సిట్ విచారణలో ఇప్పటికే గుర్తించారు. లిక్కర్ ముడుపులు దాచిన డెన్‌లు గుర్తించడంతో పాటు కోట్లాది రూపాయల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలకమైన నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో వైసీపీ నేతలు, మాజీ అధికారులు ఉన్నారు.
మాజీ మంత్రికి ప్రతి నెలా 50 లక్షలు
మద్యం వ్యవహారాలతో సంబంధం ఉన్న ఒక మాజీ మంత్రి ప్రతి నెలా రూ.50 లక్షలు లిక్కర్ మాఫియా నుంచి తీసుకున్నట్లు ఇప్పటికే సిట్ విచారణలో తేలింది. పేరుకే మంత్రి అయినా తాను ఏమీ మాట్లాడకుండా ఉండేందుకు ఒక పెద్దరెడ్డి అలా ఇప్పించినట్లు సమాచారం. ఇటీవల ఆయన్ను విచారించిన సిట్ అధికారులు ఈ విషయాన్ని కూపీ లాగినట్లు తెలుస్తోంది. ఆయన్ను సాక్షిగా పరిగణిస్తారా? లేక నిందితుల జాబితాలో చేరుస్తారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
వైసీపీ అభ్యర్థులకు లిక్కర్ సొమ్ము
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఓట్లు కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలువురు వైసీపీ అభ్యర్థులకు లిక్కర్ ముడుపులు అందజేశారు. ఎక్కువగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని అభ్యర్థులకు పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా సుమారు 200 కోట్ల రూపాయల వరకూ చేరిందని సిట్ అనుమానిస్తోంది. చిల్లకల్లు పోలీసులకు పట్టుబడిన రూ.8.37 కోట్ల సొమ్ముతో పాటు సుమారు 40 మందికి పైగా అభ్యర్థుల వివరాలు సిట్ సేకరించింది. వారిలో కొందరిని ఇప్పటికే ప్రశ్నించగా... ‘అన్ని రాజకీయ పార్టీల్లానే మాకు కూడా పార్టీ ఎన్నికల ఫండ్ పంపిందనుకున్నాం. అది లిక్కర్ సొమ్ము అని మాకెలా తెలుస్తుంది’ అంటూ నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఎదురు ప్రశ్నిస్తూనే అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఆ పార్టీ నేతలకు ముడుపులు ఇప్పించడంలో చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. రాయలసీమతో పాటు గోదావరి జిల్లాల్లోనూ పార్టీపై పట్టున్న మిథున్ రెడ్డి అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల సమయంలోనే ఆయన పొరుగు రాష్ట్రం తెలంగాణలో కీలక నేత నుంచి భారీగా డబ్బులు తీసుకొచ్చి రాయలసీమలో వైసీపీ అభ్యర్థులకు పంచినట్లు ఆరోపణలున్నాయి. 2024 ఎన్నికల సమయంలోనూ మద్యం ముడుపుల సొమ్మును గోదావరి జిల్లాల్లోని కొందరు అభ్యర్థులతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ మరికొందరికి అందజేసినట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన ఐదు రోజుల మధ్యంతర బెయిల్ పొందారు.