Liquor Business Regulation: వేలమా లాటరీయా
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:10 AM
ప్రభుత్వం కొత్త బార్ పాలసీపై కసరత్తు చేస్తోంది. 2022లో వైసీపీ ప్రభుత్వం ఆడిన వేలంలో సాదించిన లైసెన్సుల గడువు ఆగస్టులో ముగుస్తుంది. కొత్త లైసెన్సుల కేటాయింపు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, లాటరీ లేదా వేలం విధానం ద్వారా కేటాయించాలా అని ఆలోచన చేస్తోంది.
లేదంటే మొత్తం బార్లన్నీ రెన్యువల్ చేద్దామా?
కొత్త పాలసీపై ప్రభుత్వం కసరత్తు
వైసీపీ హయాంలో వేలంలో కేటాయింపు
గొప్ప కోసం ఎక్కువకు పాడి నష్టాలపాలు
ఆగస్టుతో ముగియనున్న లైసెన్సుల గడువు
ఈ సారి ఫీజులు తగ్గించే యోచన
ఆదాయ నష్టం, అక్రమాల్లేని పాలసీ దిశగా కార్యాచరణ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
నూతన బార్ పాలసీపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జగన్ జమానాలో తీసుకొచ్చిన విధానం గందరగోళంగా మారడంతో ఈసారి పొరపాట్లు లేకుండా పక్కాగా అమలు చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా ఎలాంటి పాలసీ అయితే వివాదాలు లేకుండా ఉంటుందనే కోణంలో పలు ప్రతిపాదనలపై అధ్యయనం చేస్తోంది. జగన్ ప్రభుత్వం 2022లో వేలం నిర్వహించి బార్లు కేటాయించే విధానం తీసుకొచ్చింది. దాని గడువు ఈ ఏడాది ఆగస్టుతో ముగుస్తుంది. అప్పట్లో రూ.50 లక్షలు, రూ.35 లక్షలు, రూ.15 లక్షలతో మూడు శ్లాబులతో బార్ పాలసీ ప్రకటించి.. వేలం నిర్వహించి అత్యధిక ధరకు పాడిన వారికి కేటాయించారు. అంతకుముందు దాదాపు రెండు దశాబ్దాలుగా బార్లను రెన్యువల్ చేస్తూ వచ్చారు. దీంతో ప్రభుత్వాలు మారినా లైసెన్సీలు వారే ఉంటూ వచ్చారు. అయితే వారందరినీ తీసేసి తమకు అనుకూలంగా ఉండే లైసెన్సీలు రావాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం మొత్తం బార్ లైసెన్సులు రద్దు చేసింది. 2022లో వేలం ద్వారా కొత్త లైసెన్సీలను ఎంపిక చేసింది. అయితే వారిలో పలువురు అతి భారీ ధరకు వేలం పాడి బార్లు దక్కించుకున్నారు. రూ.15 లక్షల కనీస ధర ఉన్న బార్‌ను రూ.70 లక్షల వరకు.. రూ.35 లక్షల బార్‌ను రూ.కోటికి పైగా పాడి వేలంలో దక్కించుకున్నారు. కానీ అంతంత ఎక్కువ ఫీజులతో వ్యాపారంలో నష్టం రావడంతో అనేక మంది మధ్యలోనే లైసెన్సులు వదిలేసుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలో ప్రస్తుతం 53 బార్లు ఖాళీగా మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఈసారి గందరగోళం లేకుండా సాఫీగా పాలసీ ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రధానంగా బార్లకు కొత్తగా లైసెన్సులు జారీచేయాలా.. ఇప్పుడున్న వారికే రెన్యువల్ చేయాలా అనేదానిపై ఆలోచన చేస్తోంది.
కొత్తగా అంటే ముందుకొస్తారా?
బార్లకు మళ్లీ కొత్తగా లైసెన్సుల కేటాయింపు అంటే వ్యాపారులు ఎక్కువ మంది ముందుకు రాకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే మద్యం షాపు అయితే.. ఒక షాపు తీసుకుని వెంటనే ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. లైసెన్స్ గడువు ముగిశాక వెంటనే ఖాళీ చేస్తారు. కానీ బార్ ఏర్పాటు చేయాలంటే రెస్టారెంట్ కచ్చితంగా ఉండాలి. నిర్దేశిత స్థలంలో బార్, అందులో కిచెన్ ఏర్పాటుచేయాలి. దీనికి ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. ప్రతి మూడేళ్లకు కొత్తగా లైసెన్సీలను ఎంపిక చేస్తే.. అంత పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ మంది ముందుకు రారు. అందుకే గతంలో బార్ లైసెన్సులు రెన్యువల్ చేసేవారు. అయితే వారంతా టీడీపీకి అనుకూలంగా ఉన్నారని, తమ అనుకూలురు ఉండాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం మొత్తం లైసెన్సులు రద్దు చేసి.. మూడేళ్లకు అంటే ఈ ఏడాది ఆగస్టు వరకు కొత్త లైసెన్సులు మంజూరుచేసింది. ఇప్పుడు వాటిని రద్దు చేసి నూతనంగా లైసెన్సులు ఇస్తామంటే వ్యాపారులు వెనక్కి తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం అనుకుంటోంది. ఒకవేళ కొత్త లైసెన్సులు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంటే.. ఈసారి ఎక్కువ కాలానికి లైసెన్సులు మంజూరు చేయాలనే ప్రతిపాదన కూడా వచ్చినట్లు తెలిసింది. రెన్యువల్ కాకుండా కొత్త లైసెన్సులు జారీచేయాలనుకుంటే లాటరీ లేదా వేలంలో కేటాయించాలి. గత ప్రభుత్వంలో షాపులు సర్కారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడంతో బార్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కానీ ఇప్పుడు ప్రైవేటు షాపులు రావడంతో వ్యాపారం ఎక్కువ లాభసాటిగా ఉండకపోవచ్చనే అభిప్రాయం బార్ల వ్యాపారుల్లో ఉంది. అందుకే ఈసారి లైసెన్సు ఫీజులు కూడా తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్టార్ హోటళ్లలోని బార్లకు కూడా భారీగా తగ్గించింది.
ధరలపైనా పునరాలోచన
మద్యం షాపులు, బార్లకు ఎక్సైజ్ శాఖే మద్యం సరఫరా చేస్తుంది. అయితే షాపులతో పోలిస్తే బార్లకు 10 శాతం అదనపు ధరకు విక్రయిస్తుంది. బార్లు, షాపులకు ఒకే ధరకు మద్యం అమ్మాలని మద్యం వ్యాపారులు చాలాకాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల బార్ వ్యాపారులు షాపుల నుంచి మద్యం తీసుకొచ్చి అక్రమంగా విక్రయిస్తున్నారు. వీటిని అరికట్టాలంటే షాపులు, బార్లకు సరఫరా చేసే మద్యం ధరలు ఒకేలా ఉంచడం మేలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మొత్తంగా ఆదాయం నష్టపోకుండా, వ్యాపారంలో అక్రమాలు లేని పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది.