సారాపై..కన్నెర్ర!
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:38 AM
నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసు కొచ్చిన కూటమి సర్కారు సారా రక్కసిపై ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధం చేసింది.

నవోదయం 2.0కు శ్రీకారం.. 16 మండలాల్లో గ్రామసభలు
ఎన్నికల కోడ్ ముగిశాక కార్యాచరణ
సారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధికి చర్యలు
ఏలూరు, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసు కొచ్చిన కూటమి సర్కారు సారా రక్కసిపై ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. సారా రహిత గ్రామాలే లక్ష్యంగా నవోదయం 2.0 అమలుకు శ్రీకారం చుట్టిం ది. ఇప్పటికే ఈ కార్యక్రమం ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ మండలి ఎన్నికల కోడ్ కారణంగా కొంత జాప్యం జరిగింది. కోడ్ ముగిసిన వెంటనే ఎక్సైజ్‌శాఖ ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది, జిల్లాలో ఏడు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్లు ఉండగా, ఇందులో ఐదు స్టేషన్లు పరిధి లోని భీమడోలు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు, చింతలపూడిల్లోని 16 మండలాల్లో 140 గ్రామాల్లో సారా ఆనవాళ్లను గుర్తించారు. వివిధ దాడుల్లో ఈ ప్రాంతాల్లో 70 శాతం వరకు సారా రక్కసిని అడ్డుకున్నారు. ఇంకా మిగిలిన 30 శాతం సారా నిర్మూలన దిశగా 16 చోట్ల గ్రామ సభలతో ముందడగు వేయాలని నిర్ణయించారు. ఇటీవలే ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ జిల్లా స్థాయిలో సమా వేశం నిర్వహించి సారా ఆనవాళ్లు లేకుండా అడ్డుకోవాలని, తయారీదారులకు ఉపాధి మార్గాలు అన్వేషించాలని సూచించారు.
అక్టోబరు నుంచి ఇప్పటి వరకు సారా బట్టీలపై దాడులు నిర్వహించి 360 కేసులు నమోదు చేసి 239 మందిని అరెస్టు చేశారు. 2,438 లీటర్ల సారా, 160 కేజీల నల్లబెల్లంను సీజ్ చేసి, 1,48,480 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీదారులకు నల్లబెల్లం విక్రయిస్తున్న పోలవరంలో ఇద్దరి ని, చింతలపూడిలో నలుగురిని, నూజివీడులో ఒకరిని అరెస్టు చేశారు. ద్విచక్ర వాహనాలపై సారా విక్రయిస్తూ 28 మంది చిక్కారు. మొత్తంగా 453 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. రెండోసారి పట్టుబడిన నలుగురిని అరెస్టు చేసి వారికి రూ.1.20 లక్షలు జరిమానా విధించారు.
మూడు కేటగిరీలుగా విభజన
140 గ్రామాల్లో సారా తయారీ చేసే వారిని మూడు కేటగిరిలుగా విభజించారు. సారా తయారు చేసి ఇతర గ్రామాలకు సరఫరా చేస్తున్న 29 గ్రామాలను అఽధికారులు గుర్తించి ‘ఏ’ కేటగిరిలో నమోదు చేశారు. ద్వారకా తిరుమల మండలంలో ఐఎస్ జగన్నాథపురం, నూజివీడులో సిద్ధార్థనగర్ తండా, సుంకొల్లు, ఆగిరిపల్లిలో ఎస్‌ఏపేట, చాట్రాయిలో చీపురుగూడెం, పోలవరం మండలంలో ఎల్‌ఎన్‌డీపేట, కొమ్ముగూడెం, నేతప్పకోట, ముద్దప్పగూడెం, కొవ్వాడ, టి.సత్తుపల్లి, గొల్లాయగూడెం, గుజ్జులవారిగూడెం, మారేడుబాక, శ్రీధరవేలేరు, వసంతవాడ, బడ్లబోరు, చింతల పూడి మండలంలో నాగిరెడ్డిగూడెం, తల్లార్లపల్లి, కంచనగూడెం, నామవరం, బంజరు గూడెం, వేలేరుపాడులో యడ్లబోరు, జీలుగుమిల్లి మండలంలో ములగలంపల్లి, కామయ్యపాలెం తదితర గ్రామాలను సారా తయారీ గ్రామాలుగా గుర్తించారు. ‘బీ’ కేటగిరిలో సారా కొని ఇతర గ్రామాల్లో 37 గ్రామాల వారు అమ్ముతున్నారని గుర్తించారు. ‘సీ’ కేటగిరి కింద 74 గ్రామాల్లో కేవలం అమ్మకాలు జరుగుతున్నట్టు గుర్తించారు. హర్యానా నుంచి సారా తయారీకి బెల్లం పొడి సరఫరా అవుతున్నట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.
సారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి
సారా తయారీ నిర్మూలనకు నవోదయం 2.0 కార్యక్రమంతో పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్‌శాఖలతో పాటు సర్పంచి, ఎంపీపీలతో కలిసి త్వరలో గ్రామసభలను పెట్టాలని నిర్ణయించాం. వరుస దాడులతో చాలా వరకు సారా కాయడం తగ్గింది. వారిలో మరింత అవగాన తీసుకొచ్చేందుకు సారా వల్ల కలిగే దుష్ప్రరిణామాలు వివరించి చైతన్యం తీసుకొస్తాం. డ్వామా ద్వారా ఉపాధి పనులు, డీఆర్‌డీఏ, పశుసంవర్థకశాఖల ద్వారా ఉపాఽధి యూనిట్ల స్థాపనకు చర్యలు తీసుకుంటాం.
– ఆవులయ్య, ఏలూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్