Domestic Dispute: నాటు తుపాకితో ప్రియురాలు, ఆమె భర్తపై కాల్పులు
ABN , Publish Date - Aug 05 , 2025 | 06:34 AM
కాకినాడ జిల్లా శంఖవరం మండలం శృంగధారలో ఆదివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి ఇద్దరిని నాటు తుపాకితో కాల్చి పరారయ్యాడు
ఆస్పత్రికి తరలింపు.. పరారైన ప్రియుడు
శంఖవరం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా శంఖవరం మండలం శృంగధారలో ఆదివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి ఇద్దరిని నాటు తుపాకితో కాల్చి పరారయ్యాడు. అన్నవరం పోలీసుల కథనం మేరకు.. కాకినాడ జిల్లా పెద మల్లాపురం పంచాయతీ పరిధి శృంగధారకు చెందిన కాకురు చంద్రరావుకు, అదే గ్రామానికి చెందిన కుమారికి ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు. అయితే కుమారికి అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలం వంతంగి గ్రామానికి చెందిన సరమండ మణికుమార్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొంతకాలం వారిద్దరూ సహజీవనం కూడా చేశారు. ఈ క్రమంలో 4 రోజుల క్రితం తనకు పిల్లలు, భర్త కావాలనుకుని కుమారి ప్రియుడిని వదిలి శృంగధార వచ్చేసింది. తనతో మూడేళ్లు సహజీవనం చేసి వదిలేసిందనే కోపంతో మణికుమార్ ఆదివారం అర్ధరాత్రి నాటు తుపాకితో కుమారి, ఆమె భర్త చంద్రరావుపై కాల్పులు జరిపాడు. దీంతో వారికి గాయాలయ్యాయి. తుపాకి శబ్ధంతో ఉలిక్కిపడ్డ గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే మణికుమార్ పరారయ్యాడు. క్షతగాత్రులను ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని అన్నవరం ఎస్‌ఐ శ్రీహరిబాబు తెలిపారు.