Narayana: ప్రతి ఇంటికి 135 లీటర్ల తాగునీరు
ABN , Publish Date - Mar 13 , 2025 | 04:06 AM
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ 135 లీటర్ల తాగునీరు అందిస్తామని, దీనిని మూడేళ్లలో పూర్తిచేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. బుధవారం అసెంబ్లీలో మున్సిపల్ బడ్జెట్ ఆమోదానికి జరిగిన చర్చ అనంతరం ఆయన సమాధానం ఇచ్చారు.

అమృత్ 2.0 కింద 8,500 కోట్లకు ఆమోదం
అసెంబ్లీలో మున్సిపల్ మంత్రి నారాయణ
అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ 135 లీటర్ల తాగునీరు అందిస్తామని, దీనిని మూడేళ్లలో పూర్తిచేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. బుధవారం అసెంబ్లీలో మున్సిపల్ బడ్జెట్ ఆమోదానికి జరిగిన చర్చ అనంతరం ఆయన సమాధానం ఇచ్చారు. గ్రామాల నుంచి ప్రజలు వలస రావడం వల్లే పట్టణాల్లో జనాభా పెరుగుతోందని, మున్సిపాలిటీల్లో 1.50కోట్ల మంది ప్రజలు ఉన్నారని వివరించారు. గత ప్రభుత్వం సీఎ్‌ఫఎంఎ్‌సలో మున్సిపాలిటీలకు చెందిన నిధులు తిరిగి వాటికి ఇవ్వలేదని తెలిపారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, ఏప్రిల్ 1నుంచి మున్సిపాలిటీల నిధులు వారే ఖర్చు చేసుకునేందుకు ఆమోదించారని చెప్పారు. మున్సిపల్ శాఖకు బడ్జెట్‌లో రూ.13,862 కోట్లు కేటాయించారని తెలిపారు. అమృత్ 2.0 పథకానికి కేంద్రం దాదాపు రూ.8,500 కోట్లకు అనుమతిచ్చిందని, అందులో 36.7 శాతం నిధులు కేంద్రమే ఇస్తుందని వివరించారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వపోవడం వల్ల ఆ ప్రాజెక్టు నిలిచిపోయిందని మంత్రి ఆరోపించారు. దాన్ని పూర్తి చేయడానికి బడ్జెట్‌లో రూ.756 కోట్లు కేటాయించారని తెలిపారు. 360, 430 చదరపు అడుగుల గృహాలను జూన్ నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. 2014-19మధ్యకాలంలో ప్రారంభించిన 204 అన్నక్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసేసిందన్నారు. ప్రస్తుతం మళ్లీ 199అన్నక్యాంటీన్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రూరల్ ప్రాంతాల్లో 63 క్యాంటీన్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించామని, వంద రోజుల్లో వాటిని ప్రారంభిస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, గణబాబు మాట్లాడుతూ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు. అమృత్ 2.0 పథకం కింద నీటి సరఫరా నిలిచిపోయిందని, త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే పుల్లరావు కోరారు. జీవీఎంసీలో కమిషనర్‌ను నియమించాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోరారు.
సేఫ్టీ ఆడిట్ చేయనందుకే ప్రమాదాలు: వాసంశెట్టి
గత వైసీపీ ప్రభుత్వం పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేయకపోవడంతో పరిశ్రమల్లో ప్రమాదాలో జరుగుతున్నాయని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. కార్మిక శాఖ బడ్జెట్ ఆమోదం కోసం జరిగిన చర్చలో భాగంగా అసెంబ్లీలో ఆయన బుధవారం మాట్లాడారు. 2019-24 మధ్యలో రాష్ట్రంలో దాదాపు 363 ప్రమాదాల్లో 445 మంది మరణించారని తెలిపారు. ఈఎ్‌సఐ ఆస్పత్రుల్లో కార్మికుల భద్రత, ఆరోగ్యం విషయంలో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకండా వ్యవహరించిందని ఆరోపించారు.
5 శాఖలకు నిధుల మంజూరుకు ఆమోదం
మున్సిపల్ శాఖకు రూ.13,862 కోట్లు, ప్రణాళిక, సర్వే విభాగానికి రూ.36,414 కోట్లు, వాణిజ్య పన్నుల శాఖకు రూ.472 కోట్లు, కార్మిక శాఖకు రూ.732 కోట్లు, ఇంధన శాఖకు రూ.13,609 కోట్లకు ఆమోదం కోసం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సభ ముందు ఉంచారు. ఈ కేటాయింపులకు సభ్యులంతా ఆమోదం తెలపడంతో ఆయా శాఖలకు నిధులు మంజూరు చేసేందుకు సభ ఆంగీకరించింది.
మాట్లాడొద్దంటే వెళ్లిపోతా: విష్ణు
వివిధ శాఖల గ్రాంట్ల అమోదం కోసం అసెంబ్లీలో జరిగిన చర్చలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, బీజేపీ ప్లోర్‌లీడర్ విష్ణుకుమార్ రాజు మధ్య కొంత మాటల యుద్ధం నడిచింది. కార్మికులు, పరిశ్రమల తీరుపై విష్ణు మాట్లాడుతున్న సమయంలో కాలవ శ్రీనివాసులు కొంచెం త్వరగా ముగించాలని కోరారు. సమయం సాయంత్రం 4.50 కావస్తోందని, 5గంటలకు సభ ముగించాల్సి ఉండటంతో సమయాన్ని కూడా చూడాలని, రోజూ మాట్లాడుతున్నారు కదా అని కాలవ సూచించారు. 2 నిమిషాల్లో ముగించాలని డిప్యూటీ స్పీకర్ కూడా కోరినా విష్ణుకుమార్ రాజు సుదీర్ఘంగా వివరించే ప్రయత్నం చేయడంతో త్వరగా ముగించాలని కాలవ మరోసారి అన్నారు. దీనిపై విష్ణుకుమార్ రాజు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ హోదాలో తాను మాట్లాడుతున్నానని, ఎంతసేపు మాట్లాడాలో మీరే చెప్పాలన్నారు. మాట్లాడొద్దంటే వెళ్లిపోతానని గట్టిగా చెప్పారు. స్పీకర్ కల్పించుకుని సభ్యులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని సూచించడంతో ఇద్దరూ శాంతించారు.