Share News

Nara Lokesh : ‘జగన్‌ 2.0’.. చాన్సే లేదు!

ABN , Publish Date - Feb 07 , 2025 | 04:35 AM

ఒకవైపు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు, రాష్ట్రం కోసం విన్నపాలు... మరోవైపు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యలకు అక్కడికక్కడే కౌంటర్‌లు! ఇదీ... టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేశ్‌ ఢిల్లీ పర్యటన జరిగిన తీరు! ఆయన మంగళవారం, బుధవారం వరుసగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

 Nara Lokesh : ‘జగన్‌ 2.0’.. చాన్సే లేదు!

ఆయనను ఒక్కసారే భరించలేకపోయారు

నాటి పరిస్థితులను జనం మరిచిపోలేరు

ఢిల్లీ వేదికగా విరుచుకు పడ్డ మంత్రి లోకేశ్‌

కేంద్రమంత్రులతో వరుస భేటీలు...

అదే సమయలో జగన్‌కు కౌంటర్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఒకవైపు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు, రాష్ట్రం కోసం విన్నపాలు... మరోవైపు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యలకు అక్కడికక్కడే కౌంటర్‌లు! ఇదీ... టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేశ్‌ ఢిల్లీ పర్యటన జరిగిన తీరు! ఆయన మంగళవారం, బుధవారం వరుసగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కారు వినూత్నంగా తీసుకొచ్చిన ‘వాట్సాప్‌ గవర్నెన్స్‌’తో డేటా చౌర్యం జరుగుతుందంటూ జగన్‌ పత్రిక చేసిన ప్రచారంపై విరుచుకుపడ్డారు. డేటా చౌర్యాన్ని నిరూపిస్తే రూ.10 కోట్లు స్వయంగా తానే కానుకగా ఇస్తానని సవాల్‌ విసిరారు. ఇక... ‘జగన్‌ 2.0... మళ్లీ అధికారంలోకి వస్తాం.. 30 ఏళ్లు నేనే సీఎం’ అని బుధవారం జగన్‌ చేసిన ప్రకటనపై లోకేశ్‌ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ‘‘జగన్‌ 1.0నే జనం భరించలేకపోయారు. ఇక ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కడుంది? ఆయన హయాంలో మైనారిటీలు, దళితులు, బలహీనవర్గాలు హింసకు గురయ్యారు. అప్పుడు ప్రజలకు స్వేచ్ఛ ఎక్కడ ఉండేది? నాటి పరిస్థితులను ఎప్పటికీ మరిచిపోలేరు’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. జగన్‌ హయాంలో అక్రమ మద్యం అమ్మకాలు, భూకుంభకోణాలు, అవినీతి కార్యకలాపాలు అనేకం జరిగాయని... వాటిపై చట్టాన్ని అనుసరించి చర్యలు తీసుకుని తీరుతామని లోకేశ్‌ తెలిపారు. తన రెడ్‌బుక్‌లో ఎన్ని అధ్యాయాలు అమలయ్యాయన్నదీ రహస్యంగా ఉంచుతామని తెలిపారు.


అవన్నీ మరిచిపోయారా?

ఇప్పుడు జగన్‌ నుంచి పెద్దిరెడ్డి వరకూ స్వేచ్ఛగా తిరుగుతున్నారని... జగన్‌కు జెడ్‌ ప్లస్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ భద్రతతోపాటు ఎస్కార్ట్‌లు, రోప్‌పార్టీలు ఇస్తున్నామని లోకేశ్‌ గుర్తు చేశారు. గతంలో జగన్‌ ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు. చంద్రబాబు ఆత్మకూరుకు బయలుదేరితే గేటుకు తాళం వేశారని, తనపై 23 కేసులు... నేతలు, కార్యకర్తలపై వందలాది కేసులు పెట్టారని చెప్పారు. ‘అవన్నీ మరిచిపోయారా? అన్నింటిపై చర్యలుంటాయి’ అని స్పష్టం చేశారు. దావో్‌సకు వెళ్లి దారి ఖర్చులు వృథా చేశామని జగన్‌ అనడంపై లోకేశ్‌ మండిపడ్డారు. జగన్‌ గత ఐదేళ్ల పాలనలో ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారో? ఈ 8 నెలలలో తాము ఎన్ని తీసుకొచ్చామో? బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. రాబోయే 12 నెలలలో ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయో మీరే చూస్తారని ఆయన చెప్పారు. జగన్‌ హయాంలో 13 లక్షల మంది విద్యార్థులు ఎలా తగ్గిపోయారో బొత్స సత్యనారాయణ జవాబివ్వాలని డిమాండ్‌ చేశారు.

ఫీడ్‌ బ్యాక్‌ కోసమే పీకేతో భేటీ

ఫీడ్‌బ్యాక్‌ తీసుకునేందుకే ప్రశాంత్‌ కిశోర్‌తో చర్చలు జరిపానని, తాను అందరు వ్యూహకర్తలతో కలుస్తూనే ఉంటానని లోకేశ్‌ చెప్పారు. తమ 8 నెలల పాలనపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నానని, భవిష్యత్తులో కూడా తీసుకుంటానని చెప్పారు. తెలంగాణలో తాము పార్టీని బలోపేతం చేస్తామని, త్వరలో కమిటీలను, రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తామని ఆయన చెప్పారు. పార్టీలో పదవులపైనా లోకేశ్‌ స్పందించారు. తాను, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ఇప్పటికే మూడుసార్లు బాధ్యతలు చేపట్టామని... వచ్చేసారైనా తమకు పార్టీ పదవులకు సంబంధించి ప్రమోషనో, డిమోషనో ఇవ్వాలని వ్యాఖ్యానించారు.

Updated Date - Feb 07 , 2025 | 04:36 AM