Nara Lokesh: జగన్ సర్కారు ఫీజు బకాయిలు
ABN , Publish Date - Mar 13 , 2025 | 03:56 AM
గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చెల్లించాల్సిన రూ.4,271 కోట్లు బకాయిలు పెట్టి పోతే.. తమ ప్రభుత్వం వాటిని చెల్లిస్తోందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

దశలవారీగా వాటిని చెల్లిస్తున్నాం : లోకేశ్
విద్యా రంగంలో సంస్కరణలపై మండలిలో చర్చ
అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చెల్లించాల్సిన రూ.4,271 కోట్లు బకాయిలు పెట్టి పోతే.. తమ ప్రభుత్వం వాటిని చెల్లిస్తోందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. దశలవారీగా బకాయిలు చెల్లిస్తున్నామని, ఇది నిరంతరం సాగే ప్రక్రియ అని పేర్కొన్నారు. కొత్త రీయింబర్స్‌మెంట్ విధానంలో ఏప్రిల్ 24 తర్వాత నేరుగా కాలేజీల అకౌంట్లలోనే మిగిలిన నిధులు జమ చేస్తామని తెలిపారు. కొన్ని కాలేజీల యాజమాన్యాలు కావాలనే విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యారంగంలో సంస్కరణలపై బుధవారం శాసనమండలిలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరిస్తామని చెప్పారు. విద్యా శాఖ తనకు భారం కాదని, తానే కావాలని బాధ్యతగా తీసుకున్నానని తెలిపారు. ‘‘సమాజంలో అసమానతలు పోవాలంటే విద్యతోనే సాధ్యం. గత వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో వాస్తవాలకు దూరంగా పని చేసి విద్యా ప్రమాణాలను దిగజార్చింది. సీబీఎ్‌సఈ విధానంపై ఎలాంటి కసరత్తు చేయలేదు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకుండా, విద్యార్థులను సన్నద్ధం చేయకుండానే రాష్ట్రవ్యాప్తంగా 1000 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎ్‌సఈ సిలబ్‌సను ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాఠశాలల్లోని విద్యార్థులకు మాక్ టెస్ట్ నిర్వహిస్తే 90 శాతం మంది ఒక సబ్జెక్ట్‌లో ఫెయిలయ్యారు. అందుకే సీబీఎ్‌సఈని తాత్కాలికంగా వాయిదా వేశాం. విద్యారంగంలో దశల వారీగా సంస్కరణలు అమలుచేస్తాం. గత ప్రభుత్వంలో మాదిరిగా రాజకీయ పార్టీల రంగులు, ఫొటోలు లేకుండా విద్యార్థులకు ఇచ్చే స్కూల్ కిట్లను సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో అందజేస్తున్నాం. ప్రచార పిచ్చితో ఫొటోలు, రంగులకు గత ప్రభుత్వం చేసిన వృథా ఖర్చులు రూ.1000కోట్ల వరకు తగ్గించాం’’ అని లోకేశ్ అన్నారు.
ఒక్క స్కూలూ మూతపడదు
‘‘జగన్ తమ కుటుంబ సభ్యులు, వైసీపీ కార్యకర్తలను యూనివర్సిటీలకు వీసీలుగా నియమించుకున్నారు. మా ప్రభుత్వం వచ్చాక ఐఐటీ ఖరగ్‌పూర్, ఎన్‌ఐటీ వరంగల్ లాంటి ప్రఖ్యాత విద్యాసంస్థలలో పనిచేసిన వారిని తీసుకువచ్చి వీసీలుగా నియమించాం. వాళ్లెవరూ మాకు బంధువులు కాదు.. మిత్రులూ కాదు. విశ్వవిద్యాలయాలకు పూర్వవైభవం తీసుకురావడం కోసం వీసీల నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తిచేశాం. వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో ఐటీఐ, పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలు 69శాతానికి పడిపోయాయి. ప్రజాప్రతినిధుల సహకారంతో ఐటీఐ, పాలిటెక్నిక్‌లకు భవనాలు నిర్మించి, సిబ్బందిని సమకూరుస్తాం. ఇండస్త్రీ కనెక్టివిటీ కరిక్యులమ్ తీసుకువస్తాం. రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా మూసివేయకూడదనేది మా లక్ష్యం. అందుకోసం స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలను బలోపేతం చేస్తాం. కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులాన్ని పటిష్ఠం చేస్తాం. బాగా పనిచేసే ఉపాధ్యాయులను విదేశాలకు పంపించి శిక్షణ ఇప్పిస్తాం. టీచర్ల కోసం అమరావతిలో వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను పారదర్శకంగా రూపొందిస్తున్నాం. బదిలీలు, ప్రమోషన్ల కోసం టీచర్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్‌ను అమలులోకి తెస్తాం. గంజాయి, డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు విద్యాసంస్థల్లో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేస్తాం. ప్రతి స్కూల్‌లో మొక్కలు పెంచేందుకు గ్రీన్ క్లబ్‌లను ఏర్పాటు చేస్తాం. సైన్స్ ఫెయిర్, కల్చరల్ ఫెస్ట్, వార్షికోత్సవాలను నిర్వహిస్తాం. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం 125 భవిత సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం’’ అని లోకేశ్ వివరించారు. అంతకుముందు టీడీపీ ఎమ్మెల్సీలు వేపాటి చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ కె.ఎ్‌స.లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై సూచనలు చేశారు.