Share News

Political Journey: నారా చంద్రబాబు నాయుడు అనే నేను..

ABN , Publish Date - Sep 01 , 2025 | 04:21 AM

చంద్రబాబు తొలిసారి సీఎం పగ్గాలు చేపట్టి సోమవారానికి సరిగ్గా 30 ఏళ్లవుతుంది. పార్టీనే ప్రాణంగా నమ్ముకుని సాగుతున్న ప్రస్థానానికి ఒక్కసారిగా విఘాతం కలిగితే.. పార్టీని రక్షించుకునే దిశగా చేసిన పోరాట ఫలితంగానే ఆయనకీ పీఠం దక్కింది.

Political Journey: నారా చంద్రబాబు నాయుడు అనే నేను..
CM Chandrababu Naidu

  • తొలిసారి ముఖ్యమంత్రి అయి నేటికి ముప్పై ఏళ్లు

  • పలుమార్లు పడిలేచిన కెరటంగా సంచలనం

  • సంక్షోభాల నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన వైనం

  • పాతాళానికి పడినా.. ఆకాశమే హద్దుగా ఎదిగే తత్వం

  • విద్యార్థి దశ నుంచే రాటుదేలిన నాయకుడు

  • ఎక్కడున్నా కింగ్‌ మేకర్‌ పాత్ర.. సీఎంగా టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించిన ఘనత

  • ఫ్యూచర్‌ విజన్‌తో ఎన్నెన్నో వినూత్న పథకాలు

  • నాటి హైటెక్‌ సిటీ నుంచి నేటి క్వాంటమ్‌ వ్యాలీ దాకా

  • నేడు విధ్వంస ఏపీని గాడినపెట్టేందుకు కృషి

  • అదే సమయంలో సంక్షేమానికి పెద్దపీట

అన్నీ అనుకూలిస్తే అధికార పీఠంపై కూర్చోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలచుకుంటూ అధికార పీఠాన్ని అధిష్ఠించగలగడమే అసలైన విజయం. ఓటములను, అవమానాలను ఎదుర్కొంటూ అధికార మంత్రదండాన్ని అందుకోవడం ఆషామాషీ కాదు. అన్నింటినీ అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్నవాడే అసలైన విజేత. అలా లక్ష్య ఛేదన చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఆయన మొదటిసారి 1995 సెప్టెంబరు 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా పదవీప్రమాణం చేశారు. అది జరిగి నేటికి ముచ్చటగా మూడు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు.. మరెన్నో సంచలనాలు. నాటి హైటెక్‌ సిటీ నుంచి నేటి ‘స్వర్ణాంధ్ర విజన్‌ -2047’ వరకు చేపట్టే ప్రతి ప్రాజెక్టూ ఆయన ముందుచూపునకు దర్పణాలే. సంక్షోభాలకు ఎదురీది.. అవకాశాలను అందిపుచ్చుకుని రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగడం ఆయన నైజం. ఓటములెదురైనా మొక్కవోని ధైర్యంతో, ప్రతిసారీ మరింతగా బలాన్ని కూడగట్టుకొని పైకి లేవడం ఆయనకే చెల్లింది!!

చంద్రబాబు తొలిసారి సీఎం పగ్గాలు చేపట్టి సోమవారానికి సరిగ్గా 30 ఏళ్లవుతుంది. పార్టీనే ప్రాణంగా నమ్ముకుని సాగుతున్న ప్రస్థానానికి ఒక్కసారిగా విఘాతం కలిగితే.. పార్టీని రక్షించుకునే దిశగా చేసిన పోరాట ఫలితంగానే ఆయనకీ పీఠం దక్కింది. సానుకూల దృక్పథం ఉన్నవారెవరూ విఫలమైనట్లు చరిత్రలో లేదు. చంద్రబాబుకు ఉన్న మంచి లక్షణాల్లో సానుకూల దృక్పథం ఒకటి. అదే ఆయనకు 1999 ఎన్నికల్లో విజయం చేకూర్చి పెట్టింది.


అసలైన ఎన్టీఆర్‌ వారసులెవరో ప్రజలు తమ ఓటుతో తేల్చిచెప్పిన ఎన్నికలవి. ఆ ఎన్నికల్లో చంద్రబాబు 44.14 శాతం ఓట్లతో 181 సీట్లను కైవసం చేసుకుని ఉమ్మడి రాష్ట్ర సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత 2004, 09ల్లో వరుస ఓటముల తర్వాత 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి సీఎంగా.. మొత్తంగా మూడోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో ఓటమి పాలై జగన్‌ ఐదేళ్ల ఏలుబడిలో ఎన్నో అవమానాల పాలైనా అన్నిటినీ అధిగమించి తిరిగి 2024లో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

గతంలో ముఖ్యమంత్రులుగా చేసినవారిది ఒక తీరయితే.. చంద్రబాబుది మరో తీరు. ఆయన పరిపాలన మిగిలినవారికంటే భిన్నం. తొలిసారి సీఎం అయ్యాక ఎన్నో విప్లవాత్మక పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అప్పటి వరకు కార్యాలయాలకే పరిమితమైన అధికారులను ప్రజల వద్దకు పంపి.. వారి సమస్యలను తెలుసుకోవడం, వివిధ పథకాల కింద లబ్ధిదారులను గుర్తించడం కోసం చేపట్టిన ‘ప్రజల వద్దకు పాలన’ విశేష జనాదరణ పొందింది. ప్రతి ఒక్కరూ జన్మభూమి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో 1997 జనవరి 1న ఆయన ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ కార్యక్రమం ఎన్నో పల్లెల్లో వెలుగులు తీసుకొచ్చింది. ప్రవాసాంధ్రులను సైతం కదలించి జన్మభూమివైపు చూసేలా చేసింది. పేదరికం లేని సమాజ స్థాపన దిశగా విజన్‌-2020కి రూపకల్పన చేశారు. జలసంరక్షణ కోసం నీరు-మీరు ప్రారంభించారు. చెట్ల పెంపకాన్ని పెంచేందుకు పచ్చదనం- పరిశుభ్రత కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వ వ్యవస్థలను సరళీకృతం చేయడం, పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈ-గవర్నెన్స్‌(సుపరిపాలన) తీసుకురావడం కీలకం. 1997 ఏప్రిల్లో ‘ప్రజలతో ముఖ్యమంత్రి’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. దూరదర్శన్‌ ద్వారా ప్రతి సోమవారం నేరుగా జనంతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునేవారు. పరిష్కరించేవారు. తొలి విడత పాలనలో చంద్రబాబు సీఎంగా కాక ఆంధ్రప్రదేశ్‌ సీఈవోగా పేరుపొందడం విశేషం.


హైదరాబాద్‌ దిశను మార్చేసిన హైటెక్‌ సిటీ

చంద్రబాబు విజన్‌కు నిదర్శనం హైటెక్‌ సిటీ(హైదరాబాద్‌ ఇన్ఫరేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెన్సీ- హెచ్‌ఐటీఈసీ). ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే హైటెక్‌ సిటీ నిర్మాణానికి బీజం పడింది. కొండలు, గుట్టలతో నిండి ఉన్న ప్రాంతంలో కేవలం 14 నెలల్లో దాని నిర్మాణం పూర్తి చేసి.. 1998 నవంబరు 22న నాటి ప్రధాని వాజపేయితో ప్రారంభింపజేశారు. బిల్‌ గేట్స్‌ను ఒప్పించి మెప్పించి మైక్రోసా్‌ఫ్టను భాగ్యనగరానికి తీసుకొచ్చారు.

Babu-30.jpg


మహిళల కోసం డ్వాక్రా..

పేదల కోసం వెలుగు

ప్రభుత్వాలు ఎన్ని పథకాలను ప్రవేశపెట్టినా వాటి ద్వారా సమాజంలో అందరినీ ఆర్థికంగా ఆదుకోవడం అసాధ్యం. స్వయంపోషకత్వమే దానికి పరిష్కారం. ఈ ఆలోచనతోనే చంద్రబాబు ‘డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌ ఇన్‌ రూరల్‌ ఏరియాస్‌ (డ్వాక్రా)’ పేరుతో మహిళా స్వయంసహాయక సంఘాలను ప్రవేశపెట్టారు. ఇవి అత్యుత్తమ ఫలితాలను ఇచ్చాయి.. నేటికీ ఇస్తూనే ఉన్నాయి. పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన కార్యక్రమాల్లో మంచి ఫలితాలు ఇచ్చిన పథకాల్లో ‘వెలుగు’ మరొకటి. ఈ పథకం వల్ల చంద్రబాబు తొలిదశ పాలనలో గ్రామీణ పేదరిక నిష్పత్తి జాతీయ స్థాయి కన్నా.. అనేక రాష్ట్రాల కన్నా.. ఏపీలో చాలా తక్కువగా నమోదైంది.


ముచ్చటగా మూడోసారి..

2014లో ముచ్చటగా మూడోసారి చంద్రబాబు సీఎం అయ్యారు. అయితే ఈసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కాదు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు. రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన తొలి ప్రాధాన్యం.. దేశంలో ఏ రాష్ట్రానికీ లేని విధంగా రాజధాని నిర్మాణం చేయడం. ఆ ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదే అమరావతి. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించారు. సముద్రంలోకి వృథాగా పోయే నీటిని ఒడిసిపట్టేందుకు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. గోదావరి జలాలను కృష్ణా నదిలోకి ఎత్తిపోసేందుకు ప్రారంభించిన పట్టిసీమ ప్రాజెక్టును శంకుస్థాపన చేసిన ఆరు నెలల్లోనే అందుబాటులోకి తెచ్చారు. ఇన్ని చేసినా 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యక్తిగతంగా ఆయనకు ఎన్నో నిర్బంధాలు.. అవమానాలు. అన్నింటినీ తట్టుకుని నిలబడి రాజకీయ వ్యూహంతో, చాతుర్యంతో జనసేన, బీజేపీలను కలుపుకొని 2024 ఎన్నికల్లో అఖండ ప్రజాదరణతో నాలుగోసారి సీఎం బాధ్యతలు చేపట్టారు. ఈసారి వైసీపీ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యతను తలకెత్తుకుని ముందుకు సాగుతున్నారు. ఇంకోవైపు.. పెద్దఎత్తున సంక్షేమమూ అమలు చేస్తున్నారు.


ప్రతికూలతలను అధిగమించి సుపరిపాలన..

చంద్రబాబు 1999లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా మూడేళ్లు రాష్ట్రాన్ని కరువు వెంటాడింది. మరోవైపు విద్యుత్‌ సంస్కరణల కారణంగా కరెంటు చార్జీల పెంపుతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు వెల్లువెత్తాయి. ఈ ప్రతికూలతల నడుమే సుపరిపాలన దిశగా చంద్రబాబు అడుగులు వేశారు. గతంలో ఎవరూ చేయని విధంగా రైతుల శ్రమకు తగిన గుర్తింపు తేవడానికి ప్రయత్నించిన తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ ప్రయత్న ఫలితమే రైతు బజార్లు. దళారుల ప్రమేయానికి అడ్డుకట్ట వేసి.. రైతులు తాము పండించిన కూరగాయలను ప్రజలకు నేరుగా విక్రయించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ఈ ఆలోచన, అమలు విజయవంతమయ్యాయి. ఇప్పటికీ రైతు బజార్లు అటు రైతులకు.. ఇటు ప్రజలకు సేవలందిస్తూనే ఉన్నాయి. సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల్లో హైలెట్‌ కోటి వరాల ప్రకటన. 2003లో తిరుపతి మహానాడులో ఈ ప్రకటన చేసి అమలుకు శ్రీకారం చుట్టారు. బలహీన వర్గాలకు ఇళ్లు, ఇళ్లపట్టాలు, రేషన్‌ కార్డులు, దీపం పథకం కింద గ్యాస్‌ కనెక్షన్లు, మైనారిటీలకు దుకాన్‌ ఔర్‌ మకాన్‌, సౌకర్యం పథకం కింద గ్రామీణ పేద ఆడపిల్లలకు సైకిళ్లు వంటి ఎన్నో వరాలు ఇందులో ఉన్నాయి. అయినా 2004, 2009 ఎన్నికల్లో వరుస పరాజయాలే చంద్రబాబుకి దక్కాయి.


1995.. బెంచ్‌ మార్క్‌ పాలన

చంద్రబాబు తొలిసారి సీఎం అయ్యేనాటికి ఆయన వయసు 45 ఏళ్లు. తెలుగు నేలపై అతిపిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రెండో వ్యక్తిగా పేరుగాంచారు. ఆ సమయంలో ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు వ్యక్తిగతంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఓ వైపు పార్టీని పటిష్ఠం చేసుకుంటూనే పాలనపై పట్టుబిగించి ప్రభుత్వాన్ని నడిపించారు. ఇప్పటికీ పలు సమావేశాల్లో ఆయనే స్వయంగా ‘95 సీఎం’ను చూస్తారని చెబుతుంటారు. కానీ మూడు విడతలతో పోలిస్తే ఈసారి తనదైన మార్కును చూపించలేకపోతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. అటు పార్టీపై గానీ, ఇటు ప్రభుత్వంపై గానీ పూర్తిస్థాయిలో పట్టు సాధించడంలో విఫలమవుతున్నారన్న వ్యాఖ్యలు తరచూ వినవస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ ప్రశస్తి తెచ్చిన చంద్రబాబు.. విభజిత ఆంధ్రప్రదేశ్‌కూ అదే గౌరవాన్ని తీసుకొస్తారన్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరోసారి 95నాటి సీఎంగా తనదైన ముద్రతో అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని గాడినపెడతారని టీడీపీ శ్రేణులు.. రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు.

5,442 రోజులు సీఎంగా

1995 సెప్టెంబరు 1న చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇది జరిగి సోమవారానికి 30 ఏళ్లు పూర్తవుతుంది. ఆయన ఇప్పటికి 5,442 రోజుల పాటు సీఎంగా పనిచేసి నేడు 5,443వ రోజుకు అడుగుపెడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Gold and Silver Rates Today: బంగారం ధరలకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Agri Director Dilli Rao: ఖరీఫ్‌ అవసరాలకు సరిపడా యూరియా

Updated Date - Sep 01 , 2025 | 12:53 PM