Agri Director Dilli Rao: ఖరీఫ్ అవసరాలకు సరిపడా యూరియా
ABN , Publish Date - Sep 01 , 2025 | 06:40 AM
రాష్ట్ర రైతుల అవసరాలకు సరిపడా కేంద్రం యూరియా కేటాయిస్తోందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావు అన్నారు. ఖరీఫ్ అవసరాలకు 6.22 లక్షల టన్నుల యూరియాను కేటాయించిందని...
అగ్రి డైరెక్టర్ డిల్లీరావు వెల్లడి
అమరావతి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రైతుల అవసరాలకు సరిపడా కేంద్రం యూరియా కేటాయిస్తోందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావు అన్నారు. ఖరీఫ్ అవసరాలకు 6.22 లక్షల టన్నుల యూరియాను కేటాయించిందని, ప్రారంభ నిల్వతో కలిపి 6.57 లక్షల టన్నులను వ్యవసాయశాఖ ఈ సీజన్ కోసం అందుబాటులో ఉంచిందని ఆదివారం పేర్కొన్నారు. ఇప్పటి వరకు 5.48 లక్షల టన్నుల యూరియా అమ్ముడుపోగా, ఇంకా 1.09 లక్షల టన్నులు అందుబాటులో ఉందని తెలిపారు. సెప్టెంబరు నెలకు 1.55 లక్షల టన్నులు అవసరమైతే, 1.59 లక్షల టన్నులు కేటాయించారన్నారు. కాకినాడ, గంగవరం, న్యూ మంగళూరు, విశాఖపట్నం, రాయగర్ పోర్టు నుంచి వచ్చే యూరియాలో కొంత రాష్ట్రానికి కేటాయించాలని సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. నిర్ణీత కేటాయింపు ప్రకారం యూరియా వస్తుందని, ఈ మేరకు ఖరీఫ్ అవసరాలకు ఏమాత్రం ఇబ్బంది ఉండదన్నారు. రబీ సీజన్‌కు సరిపడా యూరియా కేటాయింపులు జరిగినట్లు చెప్పారు. రబీ పంటలకు యూరియా దొరకదనే అపోహ పెట్టుకోవద్దని రైతులకు సూచించారు.