Nara Brahmani: చీదేశవిదేశాల్లో మంగళగిరి చేనేత మార్మోగాలి
ABN , Publish Date - Aug 14 , 2025 | 05:34 AM
మంగళగిరి చేనేత వస్త్రాలు ఇంకా పెద్దఎత్తున మార్కెటింగ్ కావాలని.., దేశ, విదేశాల్లో మంగళగిరి చేనేత బ్రాండ్ మార్మోగిపోవాలని..
మంగళగిరిలో విస్తృత పర్యటన.. చేనేతల సమస్యలపై ఆరా
మంగళగిరి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): మంగళగిరి చేనేత వస్త్రాలు ఇంకా పెద్దఎత్తున మార్కెటింగ్ కావాలని.., దేశ, విదేశాల్లో మంగళగిరి చేనేత బ్రాండ్ మార్మోగిపోవాలని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి ఆకాంక్షించారు. మంగళగిరి చేనేతకు ఓ సమున్నతమైన గౌరవాన్ని తీసుకొచ్చేందుకు మంత్రి లోకేశ్ చిత్తశుద్ధితో గట్టిగా పోరాడుతున్నారని చెప్పారు. కచ్చితంగా చేనేతకు పూర్వవైభవాన్ని లోకేశ్ తీసుకొస్తారన్నారు. బ్రాహ్మణి బుధవారం మంగళగిరిలో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె స్వయంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఓ ప్రైవేటు చేనేత వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన బ్రాహ్మణి...అనంతరం పలురకాల చేనేత వస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ డిజైన్‌లను గురించి ఆసక్తిగా వాకబు చేస్తూ చేనేతలకు మజూరీలు ఏయేవిధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిన్నమొన్నటివరకు కునారిల్లుతూ ఉన్న చేనేతను మనందరం కలిసి కాపాడుకుందామంటూ చేనేతలకు పిలుపునిచ్చారు. అనంతరం కాజలో బీసీ ఫైన్సాన్స్ కార్పొరేషన్-ఈడబ్ల్యూఎస్ సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత కుట్టుశిక్షణ కేంద్రాన్ని బ్రాహ్మణి సందర్శించారు.