Nadiendla Manohar : భిన్నాభిప్రాయాలున్నా కలిసికట్టుగా సాగాలి
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:08 AM
‘కూటమిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయినా దేశం, రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని వెళ్లాలి. కూటమి నేతలతో కలిసికట్టుగా, సమన్వయంతో సాగాలి’ అని మంత్రి

ఏలూరు రూరల్, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ‘కూటమిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయినా దేశం, రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని వెళ్లాలి. కూటమి నేతలతో కలిసికట్టుగా, సమన్వయంతో సాగాలి’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన సభ్యత్వం కలిగి వివిధ కారణాలతో మృతి చెందిన 19 మంది కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ కార్యక్రమం గురువారం ఏలూరు టుబాకో మర్చంట్స్ కల్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘నామినేటెడ్ పోస్టులు రావడం లేదని ఎవరూ అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ వస్తాయి. జనసేన నాయకులు, కార్యకర్తలు ఓపిక, సహనంతో ఉండి పవన్ కల్యాణ్ ఆదేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. త్వరలో కొత్త రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు అందజేస్తాం. ఎవరికైనా అన్యాయం జరిగితే నా దృష్టికి తీసుకురండి’ అని అన్నారు. సమావేశంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, పత్సమట్ల ధర్మరాజు, ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల జనసేన నాయకులు పాల్గొన్నారు.