Y.S. Vivekananda Reddy: వివేకా హత్యకు నేటితో ఆరేళ్లు
ABN , Publish Date - Mar 15 , 2025 | 03:29 AM
వివేకా వాచ్‌మెన్, ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న మరణం తాజాగా కలకలం రేపింది. ఇలా.. వివేకా హత్య నుంచి రంగన్న అనుమానాస్పద మరణం దాకా.. ఈ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మార్చి 14వ తేదీ రాత్రి కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో ప్రచారం నిర్వహించిన వైఎస్ వివేకానందరెడ్డి రాత్రి పొద్దుపోయాక పులివెందులలోని ఇంటికి వచ్చారు.
సాక్షులు, కీలక వ్యక్తుల అనుమానాస్పద మృతి
కలకలం రేపిన రంగన్న మరణం
వివేకా కేసులో ఇంకా పూర్తికాని సీబీఐ దర్యాప్తు
248 మంది విచారణ..ఎనిమిది మందిపై చార్జిషీట్
దర్యాప్తును నాడు ముందుకెళ్లనివ్వని జగన్ అండ్ కో
ఊహించని మలుపులు, ట్విస్ట్‌లు ఎన్నో
(కడప-ఆంరఽధజ్యోతి)
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నేటికి (శనివారం) సరిగ్గా ఆరేళ్లు. ఈ కేసులో సాక్షులు, కీలక వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్నారు. వివేకా వాచ్‌మెన్, ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న మరణం తాజాగా కలకలం రేపింది. ఇలా.. వివేకా హత్య నుంచి రంగన్న అనుమానాస్పద మరణం దాకా.. ఈ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మార్చి 14వ తేదీ రాత్రి కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో ప్రచారం నిర్వహించిన వైఎస్ వివేకానందరెడ్డి రాత్రి పొద్దుపోయాక పులివెందులలోని ఇంటికి వచ్చారు. మరుసటి రోజు (15వ తేదీ) తెల్లవారే సరికి తన ఇంటిలోనే హత్యకు గురై కనిపించారు. అయితే ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ అప్పటి సీఎం చంద్రబాబును ఉద్దేశించి జగన్ మీడియాలో కట్టుకథలు వండి వార్చారు. తన బాబాయి వివేకా హత్యను ఆ ఎన్నికల్లో జగన్ ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. ఇది సానుభూతి అస్త్రంగా మారి జగన్ గెలుపునకు బాటలు వేసింది. వివేకా హత్య జరిగినప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. వివేకా పీఏ ఎం.వెంకటకృష్ణారెడ్డి ఫిర్యాదుతో పులివెందులలో క్రైం నెంబరు 24/2019 గా కేసు నమోదు అయింది. వివేకా హత్యకు గురికాగా.. మొదట గుండె పోటుగా చిత్రీకరించారు.
తర్వాత రక్తపు వాంతులు చేసుకున్నారని ప్రచారం చేశారు. బెడ్‌రూం, బాత్‌రూమ్‌లోని రక్తాన్ని ఆనవాళ్లు లేకుండా కనుమరుగు చేశారు. అదే ఏడాది మే 30న జగన్ సీఎంగా ప్రమాణం చేశారు. సీఎం కాకముందు సీబీఐ విచారణ అంటూ కోర్టులో పిటిషన్ వేసిన జగన్.. ఆ తరువాత దానిని ఉపసంహరించుకున్నారు. కేసు విషయంలో జగన్ వైఖరిలో తేడా కనిపించడంతో వివేకా కుమార్తె డాక్టర్ సునీత సీబీఐ విచారణకు కోరారు. అందుకు హైకోర్టు అంగీకరించడంతో సీబీఐ విచారణ ప్రారంభించింది. 2023 ఫిబ్రవరి 20 నాటికే సుమారు 248 మందిని విచారించింది.
ఆ ఐదేళ్లూ బెదిరింపులు, వేధింపులు
వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డితోపాటు వైసీపీ కీలక నేత దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి.. మొత్తం ఎనిమిది మందిపై సీబీఐ చార్జిషీట్ నమోదు చేసింది. వీరిలో డ్రైవరు దస్తగిరి అప్రూవర్‌గా మారారు. సీబీఐ అధికారులను అప్పట్లో బెదిరించారు. సీబీఐ విచారణ అధికారి రాంసింగ్‌పై కేసు నమోదు చేయించారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడంతో హత్య వెనుక ఎవరరెవరు ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చింది.
అనుమానాస్పదంగా...
వివేకా కేసుతో సంబంధం ఉన్న చాలామంది గత ఆరేళ్లలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ ఏడాది జనవరి 10న జగన్‌కు వరసకు సోదరుడు వరుస అయ్యే వైఎస్ అభిషేక్‌రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనను సీబీఐ 2021లో విచారించగా, వివేకా చనిపోయినట్లు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి నుంచి ఫోన్ కాల్ వచ్చిందని వాంగ్మూలం ఇచ్చారు. కల్లూరు గంగాధర్‌రెడ్డి 2022 జూన్‌లో అనారోగ్యంతో మృతి చెందినట్లు ప్రచారంచేశారు. ‘నేరాన్ని నీపై వేసుకుంటే కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి రూ.10కోట్లు ఇస్తారు. నీ జీవితం సెటిల్ చేస్తారం’టూ దేవిరెడ్డి శంకర్‌రెడ్డి ఆఫర్ ఇచ్చారని, అయితే దానిని తాను తిరస్కరించానని గంగాధర్‌రెడ్డి 2021 అక్టోబరులో సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఆ తరువాత సీబీఐనే తనను బలవంతం చేసి అలా చెప్పించిందని మాట మార్చారు. సింహాద్రిపురం మండలం కసుమూరుకు చెందిన కె.శ్రీనివాసులరెడ్డి 2019 సెప్టెంబరు 3న అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శ్రీనివాసులరెడ్డి బావ పరమేశ్వర్‌రెడ్డిపై వివేకా హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి. జగన్ డ్రైవరుగా పనిచేసిన నారాయణయాదవ్ 2019 డిసెంబరు 6న మృతి చెందారు. వివేకా హత్య జరిగిన సమయంలో హైదారబాద్‌లో ఉన్న జగన్, భారతి వాహనంలో రోడ్డు మార్గాన పులివెందులకు వచ్చారు. ఆ సమయంలో వారికి నారాయణయాదవ్ డ్రైవర్‌గా ఉన్నారు. ఇక జగన్ మామ ఈసీ గంగిరెడ్డి 2020 అక్టోబరు 3న అనారోగ్యంతో మృతి చెందారు. వివేకా మృతదేహానికి గంగిరెడ్డి ఆస్పత్రిలోనే కుట్లు, బ్యాండేజీ వేశారు. తాజాగా ఈ నెల ఐదోతేదీన రంగన్న అనుమానాస్పద స్థితిలో మరణించారు.
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..
Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
Read Latest AP News And Telugu News