Share News

ముస్తాబైన ఉరుకుంద క్షేత్రం

ABN , Publish Date - Jan 30 , 2025 | 12:05 AM

మండలంలోని ఉరకుంద ఈరన్న స్వామి దేవాలయంలో ఫిబ్రవరి 1, 2, 3వ తేదీలలో జరిగే మహాకుంభాభిషేక ఉత్సవాలకు ఏర్పాటు చేస్తున్నారు.

   ముస్తాబైన ఉరుకుంద క్షేత్రం
వివిధ రంగులతో సుందరంగా ముస్తాభైన దేవాలయం ముఖ ద్వారం

మహా కుంభాభిషేక ఉత్సవాలకు ఏర్పాట్లు

భక్తులకు సౌకర్యాల కల్పనలో ఆలయ అధికారులు

కౌతాళం, జనవరి 29(ఆంధ్రజ్యోతి)

మండలంలోని ఉరకుంద ఈరన్న స్వామి దేవాలయంలో ఫిబ్రవరి 1, 2, 3వ తేదీలలో జరిగే మహాకుంభాభిషేక ఉత్సవాలకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఏడాది శ్రావణ మాసం, కార్తీక మాసంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభోత్సవాలు జరపడం విశేషం. ఈ ప్రాధాన్యత రీత్యా భక్తులు పెద్ద ఎత్తున కౌతాళం రానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్‌ విజయరాజు తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణకు ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది ఆలయ ఈఓతో పనుల్లో నిమగ్నమయ్యారు.

ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు:

రాజగోపురంతో పాటు నూతనంగా నిర్మించిన 4 గోపురాలకు రంగులు వేశారు. ఈ గోపురాలపై దాతల సహకారంతో కలశాలను తయారు చేయించి ప్రతిష్టిస్తున్నట్లు ఈవో తెలిపారు. ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తులకు విడిది కోసం కర్ణాటకకు చెందిన ఓ భక్తుడు 50లక్షలతో షెడ్లను నిర్మించారు. రాత్రి సమయాలలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఐమాక్స్‌ లైట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. స్వామి వారి అన్నదాన సత్రంలో వేల సంఖ్యలో భక్తులు భోజనం చేసే అవకాశం ఉండటంతో సత్రంలో మెరుగైన వసతులు కల్పిస్తున్నారు. మాడ వీధుల్లో స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు.

ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ

మహా కుంభాభిషేకంలో భాగంగా ఆలయం వద్ద ఫిబ్రవరి 1,2,3వ తేదీలలో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ఇప్పటికే పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. రాజగోపురంతో పాటు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ గోపురాలను అలంకరించనున్నారు. నవగ్రహల మంటపం, గణపతి విగ్రహ ప్రతిష్టాపన, హోమాల నిర్వహణకు ప్రత్యేక గదులు నిర్మిస్తున్నారు. చివరి రోజు కలశాల ప్రతిష్టాపనకు కర్ణాటక భక్తుడు ఒకరు హెలికాప్టర్‌ ద్వారా పూల వర్షం కురిపిస్తున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్‌ విజయరాజు తెలిపారు. దాతల సహకారంతో మునుపెన్నడు చూడని రీతిలో ఆలయం వద్ద వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

వివిధ మఠాల పీఠాధిపతుల రాక

మహా కుంభాభిషేకానికి వివిధ మఠాల పీఠాధిపతులు హాజరవుతున్నారు. కంచి కామకోటి పీఠం పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి, పుష్పగిరి మఠం పీఠాధిపతి విద్యానృసింహ భారతి స్వామి, శ్రీశైల పీఠాధిపతి శ్రీచెన్న సిద్ధరామ శివాచార్య స్వామి, మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ స్వామి, హల్వి పీఠాధిపతి మహంతేష్‌ స్వామి హాజరవుతున్నట్లు ఆలయ ఈఓ తెలిపారు.

ప్రముఖులకు ఆహ్వానం:

ఈ మహాకుంభాభిషేక ఉత్సవాలకు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్‌ సత్య నారాయణ, రాష్ట్ర ఇనచార్జి మంత్రి నిమ్మల రామనాయుడు, మంత్రులు టీజీ భరత, ఎంపీ నాగరాజు, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయకుడు, నాయకులు తిక్కారెడ్డి, పలువురు అధికారులను ఆహ్వానించినట్లు ఈఓ తెలిపారు.

Updated Date - Jan 30 , 2025 | 12:05 AM