Anantapur Suicide: మా అమ్మ ఊగుతోంది..
ABN , Publish Date - Jun 02 , 2025 | 06:07 AM
అనంతపురంలో ఇద్దరు చిన్నారుల ఎదుటే తల్లి ధనలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త వ్యసనాలకు తోడు కుటుంబ కలహాలతో కలత చెంది క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం.
బిడ్డల కళ్లముందే ఉరేసుకున్న తల్లి
బయటకు వచ్చి చెప్పిన చిన్నారులు
చిన్న సంసారంలో చిచ్చుపెట్టిన ఆన్‌లైన్ బెట్టింగ్, తాగుడు వ్యసనం
భార్యాభర్తల ఘర్షణ...క్షణికావేశంలో భార్య ఆత్మహత్య
అనంతపురం జిల్లా యాడికిలో ఘటన
యాడికి, జూన్1(ఆంధ్రజ్యోతి): ఎదురుగా ముద్దులొలికే కన్నబిడ్డలు ఇద్దరూ ఆడుకుంటున్నారు...అయితే, ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో ఏమో...పిల్లలు ఏమైపోతారో అని కూడా ఆలోచించకుండా వారి కళ్లముందే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి ఏం చేస్తోందో తెలియని పిల్లలు ‘మా అమ్మ ఇంట్లో ఊగుతోంది’ అని బయటకు వచ్చి చెప్పడంతో చుట్టుపక్కల వారు వచ్చిచూసినా ఫలితం లేకపోయింది. ఆమె అనంతలోకాలకు వెళ్లిపోయింది. అనంతపురం జిల్లా యాడికిలోని చౌడేశ్వరికాలనీలో పామిశెట్టి తిరుపతయ్య, ధనలక్ష్మి (26) దంపతులు నివసిస్తున్నారు. వీరికి కుమారుడు శ్రీహాస్ (6), కుమార్తె లాస్య (4) ఉన్నారు. తిరుపతయ్య కూలి మగ్గం నేసే పని, ధనలక్ష్మి పట్టుచీరల దుకాణంలో కూలి పని చేస్తుం టారు. ఈ చిన్న సంసారంలో వ్యసనం చిచ్చుపెట్టింది. తిరుపతయ్య ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడ్డాడు. మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ పోషణ విషయమై ఆదివారం ఉదయం భార్యాభర్తలు గొడవపడ్డారు. అనంతరం తిరుపతయ్య బయటకు వెళ్లిపోయాడు. క్షణికావేశానికి లోనైన ధనలక్ష్మి పిల్లల ఎదుటే ఇంట్లో ఉరేసుకుంది. ధనలక్ష్మి ఉరేసుకుని, విలవిల్లాడుతున్నా అభంశుభం తెలియని బిడ్డలు అక్కడే ఆడుకుటుండడం గమనార్హం. ‘మా అమ్మ ఇంట్లో ఊగుతోంద’ని చిన్నారులు చెప్పడంతో స్థానికులు చూసి కిందికి దింపి, యాడికి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమె మృతిచెందినట్టు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి:
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి