Child Abuse: హింసిస్తున్నారని పిల్లల ఫిర్యాదు
ABN , Publish Date - May 28 , 2025 | 06:07 AM
తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామంలో పిల్లలపై చిత్రహింసలు చేసిన తల్లి మరియు ఆమె సహజీవనం చేస్తున్న వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. పిల్లల ఫిర్యాదుతో సకాలంలో దర్యాప్తు చేసి పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో శిక్ష విధించించారు.
తల్లి, మరో వ్యక్తికి మూడేళ్ల జైలు
కడియం, మే 27(ఆంధ్రజ్యోతి): తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారని పిల్లలు ఇచ్చిన ఫిర్యాదుతో తల్లి, ఆమెతో సహ జీవనం చేస్తున్న వ్యక్తికి మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ రాజమహేంద్రవరం 7వ ఏజేఎఫ్‌సీఎం మేజిస్ట్రేట్ పి.బాబు సోమవారం తీర్పునిచ్చినట్టు సీఐ ఎ.వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కడియం గ్రామానికి చెందిన ఖండవిల్లి దాసు భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కృపావతితో సహజీవనం చేస్తున్నాడు. కృపావతికి భర్త లేడు. నాలుగు, ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలిద్దరినీ దాసు, కృపావతి కలిసి శారీరకంగా చిత్రహింసలకు గురి చేసేవారు. దీంతో చిన్నారులిద్దరూ స్థానికుల సాయంతో 2021లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి ఎస్‌ఐ ఎస్‌కే అమీనాబేగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి దాసు, కృపావతిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సాక్షులను సకాలంలో కోర్టులో ప్రవేశపెట్టి నిందితులకు శిక్షపడేలా కృషి చేసిన సీఐ ఎ.వెంకటేశ్వరరావు, కోర్టు హెడ్ కానిస్టేబుల్ కె.శ్రీనివాసరావు, స్టేషన్ రైటర్ కె.సురేష్‌బాబును పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News