ఇసుక క్వారీల్లో ఇక యంత్రాలు!
ABN , Publish Date - Feb 16 , 2025 | 01:09 AM
ఇసుక క్వారీల్లో యంత్రాల వినియోగం ఇక తధ్యమని స్పష్టమైంది. రెండు నెలలుగా ఇసుక లోడింగ్‌తో జీవనోపాధి పొందిన కార్మికులు ఇక పని కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి రానుంది. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మైనింగ్‌శాఖ ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సదస్సుల్లో మినీ మిషన్స్(చిన్న జేసీబీ)లను ఉపయోగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. టిప్పర్లలో జేసీబీతో ఇసుక లోడింగ్ చేసినా ఇతర కార్యకలాపాలకు ఒక్కో క్వారీలో 22 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. దీంతో కార్మికులు యంత్రాలు వద్దని, ఎంత ఇసుక కావాలన్నా మేమే లోడింగ్ చేస్తామని అధికారులకు అర్జీలు అందించారు. కాని ప్రభుత్వం యంత్రాలను ప్రవేశపెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా అధికారులు ప్రకటించేశారు. దీనిపై పోరాటం చేసేందుకు కార్మికులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇది భవిష్యత్తులో ప్రభుత్వానికి తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది.
-ప్రజాభిప్రాయ సేకరణ సదస్సుల్లో స్పష్టం చేసిన అధికారులు
- ఒక్కో క్వారీలో 22 మంది కార్మికులకు ఉపాధి లభిస్తుందని హామీ
- కార్మికుల్లో మొదలైన అలజడి.. పోరాటానికి సన్నద్ధం!
- రెండు నెలలుగా ఇసుక లోడింగ్‌తో జీవనోపాధి పొందిన కార్మికులు
ఇసుక క్వారీల్లో యంత్రాల వినియోగం ఇక తధ్యమని స్పష్టమైంది. రెండు నెలలుగా ఇసుక లోడింగ్‌తో జీవనోపాధి పొందిన కార్మికులు ఇక పని కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి రానుంది. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మైనింగ్‌శాఖ ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సదస్సుల్లో మినీ మిషన్స్(చిన్న జేసీబీ)లను ఉపయోగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. టిప్పర్లలో జేసీబీతో ఇసుక లోడింగ్ చేసినా ఇతర కార్యకలాపాలకు ఒక్కో క్వారీలో 22 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. దీంతో కార్మికులు యంత్రాలు వద్దని, ఎంత ఇసుక కావాలన్నా మేమే లోడింగ్ చేస్తామని అధికారులకు అర్జీలు అందించారు. కాని ప్రభుత్వం యంత్రాలను ప్రవేశపెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా అధికారులు ప్రకటించేశారు. దీనిపై పోరాటం చేసేందుకు కార్మికులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇది భవిష్యత్తులో ప్రభుత్వానికి తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది.
ఆంధ్రజ్యోతి-తోట్లవల్లూరు:
తోట్లవల్లూరు మండలంలో ఈ నెల 6వ తేదీ వరకు నడిచిన క్వారీల్లో కార్మికులు మాత్రమే ఇసుక లోడింగ్ చేయాలని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధన ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లు యంత్రాలను ఉపయోగించి కార్మికులకు రోజువారి రూ.40 వేలు ప్యాకేజీ ఇచ్చారు. అలాగే కార్మికులను ట్రాక్టర్లలో ఇసుక లోడింగ్‌కు అనుమతించారు. దాంతో రెండు విధాలుగా కార్మికులు లాభపడ్డారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క కార్మికుడిని క్వారీల్లోకి అడుగు పెట్టనీయకుండా కేవలం యంత్రాలతోనే ఇసుక లోడింగ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి స్వేచ్చనీయటంతో రొయ్యూరు, వల్లూరుపాలెం, తోట్లవల్లూరు, భద్రిరాజుపాలెం, చాగంటిపాడు, దేవరపల్లి గ్రామాల్లో కార్మికులు క్వారీలను ఏర్పాటు చేసుకుని రోజుకు రూ.వెయ్యి ఆదాయం పొందుతూ వచ్చారు. సీఎం చంద్రబాబు చలవతో తామే ఐదేళ్ల తర్వాత ఇసుక క్వారీల్లో ఉపాధి పొందుతున్నామని ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇపుడు కొత్త విధానంతో ఇసుక క్వారీలను తెరుస్తామని అధికారులు ప్రజా సదస్సులు ఏర్పాటు చేసి యంత్రాలను వినియోగిస్తామని వెల్లడించటంతో కార్మికుల ఆనందం ఆవిరైంది.
నాడు టీడీపీ ప్రభుత్వంలో కార్మికుల ఉపాధి
2014 నుంచి 2019 వరకు కొనసాగిన నాటి టీడీపీ ప్రభుత్వం కార్మికుల జీవనోపాధి దెబ్బతినకుండా ఇసుక విధానం అమలు చేసింది. పట్టా భూముల్లో ఏర్పాటు చేసిన ప్రైవేటు క్వారీల్లో యంత్రాలకు అవకాశమిచ్చి కార్మికుల కోసం ప్రభుత్వ క్వారీలను నిర్వహించింది. ఆ విధానంతో కార్మికులతో ఎలాంటి వివాదం ఏర్పడలేదు. తోట్లవల్లూరు(నార్తువల్లూరు) పెద్దఏటిపాయలో ప్రభుత్వ క్వారీని ఏర్పాటు చేయగా, జిల్లాలో అనేక ప్రాంతాల నుంచి కార్మికులు వచ్చి ఇసుక లోడింగ్ చేసేవారు. రోజుకు రూ.1000 నుంచి రూ.1200 వరకు ప్రభుత్వ క్వారీలో ఆదాయాన్ని కార్మికులు పొందారు. రోజుకు రెండు వేల మంది కార్మికులు 2019 వరకు ఇసుక క్వారీలో పని చేసేవారు. ఇపుడు కూడా 2019కి పూర్వం ఉన్న ఇసుక విధానాన్ని సీఎం చంద్రబాబు అమలు చేయాలన్న ఆలోచన కార్మికుల్లో బలపడుతోంది.
యంత్రాలు వద్దని చెప్పాం
ఇసుక క్వారీల్లో యంత్రాలు ప్రవేశపెట్టవద్దని అధికారులకు కార్మికుల సంతకాలతో కూడిన వినతి పత్రాలను అందించాం. కార్మికుల జీవనోపాధిని కాపాడాలని కోరాం. ప్రజాభిప్రాయ సేకరణ సదస్సులోనే కార్మికులు ఏకాభిప్రాయంతో యంత్రాలు వద్దని చెప్పారు.
- నిమ్మగడ్డ రాకేష్, ఇసుక మేస్త్రీ, రొయ్యూరు
ఇసుక పని కల్పించాలి
రొయ్యూరులో 300 మంది ఇసుక కార్మికులున్నారు. యంత్రాలు ఏర్పాటు చేస్తే వారందరి ఉపాధి దెబ్బతింటుంది. ఇలా ప్రతి గ్రామంలో వందలమంది ఇసుక క్వారీలపై ఆధారపడిన కార్మికులున్నారు. యంత్రాలు పెట్టుకున్నా ట్రాక్టర్లలో ఇసుక లోడింగ్‌కు వినియోగించుకోవాలి. కార్మికులకు ప్రత్యేకంగా క్వారీ ఉండాల్సిందే.
- లుక్కా దుర్గా నాగేశ్వరరావు, ఇసుక మేస్త్రీ, రొయ్యూరు