Rainfall Alert: ఎట్టకేలకు కదిలిన నైరుతి
ABN , Publish Date - Jun 17 , 2025 | 04:14 AM
సుమారు 19 రోజులపాటు నిలిచిపోయిన నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు పుంజుకున్నాయి. మధ్య, ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, విదర్భ, ఛత్తీస్‌గఢ్ ఒడిశాలో పలు ప్రాంతాలు.. కొంకణ్, మధ్య మహారాష్ట్ర, తెలంగాణలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించాయి.
తిరిగి వేగం పుంజుకున్న రుతుపవనాలు
మహారాష్ట్ర, గుజరాత్,ఛత్తీస్‌గఢ్ కు విస్తరణ
ముంబైను ముంచుతున్న భారీ వర్షాలు
కేరళలోనూ కుండపోత
విశాఖపట్నం/ న్యూఢిల్లీ, జూన్ 16(ఆంధ్రజ్యోతి): సుమారు 19 రోజులపాటు నిలిచిపోయిన నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు పుంజుకున్నాయి. మధ్య, ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, విదర్భ, ఛత్తీ్‌సగఢ్, ఒడిశాలో పలు ప్రాంతాలు.. కొంకణ్, మధ్య మహారాష్ట్ర, తెలంగాణలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో గుజరాత్, మహారాష్ట్ర, విదర్భ,ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ , జార్ఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్‌లోనూ విస్తరించనున్నాయి. గుజరాత్ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మంగళవారానికి అల్పపీడనంగా మారనుంది. ఇంకా వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా.. ఏపీలో సోమవారం పలుచోట్ల వర్షాలు కురిశాయని, రానున్న 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
31 శాతం తక్కువ వర్షపాతం
నైరుతి రుతుపవనాలు సోమవారం నాటికి మహారాష్ట్ర మొత్తం వ్యాపించి, పొరుగున ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్‌లోకి కూడా ప్రవేశించాయని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా జూన్ 1న కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఈ ఏడాది షెడ్యూల్ కంటే ముందు మే 24నే పలకరించాయి. ఆ తర్వాత దక్షిణ, ఈశాన్య, పశ్చిమ భారతంలోకి ప్రవేశించాయి. కానీ, ఉన్నట్టుండి మే 29 నుంచి రుతుపవనాల్లో స్థబ్దత నెలకొంది. ప్రస్తుతం అవి వేగం పుంజుకున్నాయని, వీటి ప్రభావంతో రాబోయే పది రోజుల్లో పశ్చిమ తీరం, మధ్య, ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రుతుపవనాల్లో కదలిక లేక జూన్ మొదటి అర్ధ భాగంలో భారత్‌లో సగటు కంటే 31 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఇప్పుడు నైరుతి వేగం పుంజుకోవడంతో జూన్ రెండో అర్ధభాగంలో సగటు కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ పేర్కొంది. రాబోయే రోజుల్లో రుతుపవనాలు మరింత వేగంగా పురోగమిస్తాయని, ఈ నెలాఖరులోగా దేశంలోని చాలా ప్రాంతాలకు విస్తరిస్తాయని తెలిపింది.
ముంబైలో విస్తారంగా వర్షాలు
రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ముంబై, శివారు నగరాల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సబర్బన్ రైళ్లు, మెట్రో రైళ్ల సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకూ ముంబైలో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో 5.8 సెం.మీ, 7.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకూ 18 మంది మరణించారని, 65 మంది గాయపడ్డారని మహారాష్ట్ర అధికారులు తెలిపారు. రాబోయే 24 గంటల్లో ముంబై నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. సోమవారం కురిసిన భారీ వర్షాలకు ముంబై, థాణే, పాల్ఘర్ తదితర ప్రాంతాలకు ‘ఆరెంజ్’ అలర్ట్, రాయగడ్‌కు రెడ్ అలర్ట్ జారీచేశారు.
కేరళ అతలాకుతలం..
కేరళలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాది జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. బస్సులు, రైలు ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు నదులు, జలాశయాల్లో నీటి మట్టాలు పెరిగాయి. వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో కన్నూర్, కాసర్‌గోడ్ సహా పలు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కన్నూర్‌లోని కక్కడ్ ప్రాంతంలో రహదారిపైకి నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాసర్‌కోడ్ జిల్లాలోని వెల్లరికుండ్ ప్రాంతంలో కనీసం 10 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మలప్పురం జిల్లా తెన్నలలో 21 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. కోజికోడ్‌లోని వడకరలో 18 సెం.మీ., కాసరకోడ్, కన్నూర్‌లోని పలు ప్రాంతాల్లో 16 సెం.మీ. వర్షపాతం నమోదైంది.