రహదారులకు మోదీ శంకుస్థాపన
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:52 PM
ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో రూ.848.99 కోట్లతో చేపట్టే రెండు ప్రధానమైన జాతీయ రహదారులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు.

రూ.241.99 కోట్లతో ఆదోని బైపాస్ రోడ్డు
రూ.607 కోట్లతో సంగమేశ్వరం-నల్లకాలువ, వెలుగోడు-నంద్యాల రెండు లైన్ల రహదారి
కర్నూలు-డోన డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు కూడా
నేడు విశాఖ నుంచి వర్చువల్‌గా...
కర్నూలు, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో రూ.848.99 కోట్లతో చేపట్టే రెండు ప్రధానమైన జాతీయ రహదారులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో 20 జాతీయ రహదారులు, రైల్వే డబ్లింగ్ పనులకు శంకుస్థాపన, మరో పది పనులు ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోదీ నేడు విశాఖపట్నంరానున్నారు. అక్కడి నుంచి జిల్లాలో నిర్మించబోయే పనులకు వర్చువల్ ద్వారా భూమిపూజ చేస్తారని నేషనల్ హైవే విభాగం కర్నూలు ఈఈ శంకర్‌రెడ్డి మంగళవారం ఆంధ్రజ్యోతికి వివరించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి సమీపంలోని హగరి నుంచి ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, రాయచూరు మీదుగా జాతీయ రహదారి-167 2012-13లో నిర్మించారు. ఆదోని పట్టణంలో ఈ జాతీయ రహదారి వెళ్తుంది. ట్రాఫిక్ సమస్యలు దృష్ట్యా ఆదోని-ఆలూరు రోడ్డు నుంచి ఆదోని-పత్తికొండ రోడ్డు దాటి ఆదోని-ఎమ్మిగనూరు రోడ్డును కలుపుతూ 7.3 కి.మీల బైపాస్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 10 మీటర్ల తారు (బీటీ) రోడ్డు, రెండు వైపుల రెండు మీటర్లు మట్టిరోడ్డు (సోల్డర్) కలిపి 12 మీటర్లు వెడల్పుతో బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం రూ.241.99 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులకు ప్రధాని మోడీ వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేయబోతున్నారు.
ఫ సంగమేశ్వరం-నంద్యాల నేషనల్ హైవేకు భూమి పూజ:
తెలంగాణ - ఆంధ్రప్రదేశ రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ భారతమాల ప్రాజెక్టులో భాగంగా కల్వకుర్తి - నంద్యాల వయా ఆత్మకూరు 170 కి.మీలు జాతీయ రహదారి - 167కే నిర్మాణానికి కేంద్ర జాతీయ రాహదారుల మంత్రిత్వ శాఖ 170 కి.మీల రోడ్డు గ్రీన సిగ్నల్ ఇవ్వడంతో పాటు అవసరమైన నిధులు కూడా మంజూరు చేసింది. అందులో భాగంగానే నంద్యాల జిల్లాలో సంగమేశ్వరం-నల్లకాలువ వయా ఆత్మకూరు, వెలుగోడు-నంద్యాల వరకు 62 కి.మీలు 12 మీటర్లు (10 మీటర్ల బీటీ రోడ్డు) రెండు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి రూ.607 కోట్లతో టెండర్లు కూడా పూర్తి చేశారు. ఈ పనులకు నేడు ప్రధాని మోదీ వర్చువల్ ద్వారా భూమి పూజ చేసి శిలాఫలకం వేస్తారు. ఈ రహదారిలో భాగంగా సంగమేశ్వరం చెంత కృష్ణా నదిపై 900 మీటర్లు పొడవు పర్యాటకులను ఆకట్టుకునేలా ఐకాన తీగల వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దాదాపు రూ.400 కోట్లతో నిర్మించే ఈ ఐకానిక్ తీగల వంతెన నిర్మాణం పనులు తెలంగాణ రాష్ట్రం చేపట్టబోతుంది. ప్రస్తుతం టెండర్ల దశలో ఉందని ఇంజనీర్లు పేర్కొన్నారు. నేషనల్ హైవే-167కే, ఐకానిక్ తీగల వంతెన నిర్మాణం పూర్తి అయితే నంద్యాల, కడప జిల్లాల ప్రజలు, వాహనదారులు హైదరాబాద్‌కు వెళ్లాలంటే దాదాపు 70 కి.మీల వరకు దూరం తగ్గుతుందని ఇంజనీర్లు పేర్కొన్నారు.
ఫ కర్నూలు-డోన డబ్లింగ్ రైల్వే లైన:
కాచిగూడ (హైదరాబాద్)-డోన ప్రధాన రైల్వే మార్గం. డబ్లింగ్, విద్యుదీకరణ రైల్వేలైనగా ఆధునికీకరణ చేయాలని ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదన ఉంది. ఇప్పటికే మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్ పనులు పూర్తయ్యాయి. మహబూబ్‌నగర్-డోన వయా గద్వాల, కర్నూలు, వెల్దుర్తి మీదుగా డబ్లింగ్ లైన, విద్యుదీకరణ పనులు చేపట్టాలి. 197 కి.మీల ఈ పనులకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ రూ.2,208 కోట్లు కేటాయించింది. టెండర్లు కూడా పూర్తి చేసిందని అధికారులు తెలిపారు. ఈ పనుల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో కర్నూలు - డోన వయా వెల్దుర్తి మీదుగా జిల్లాలో 54 కి.మీలు డబ్లింగ్ రైల్వే లైన, విద్యుదీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులకు ప్రధాని నేడు విశాఖ నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు.