Share News

హోరాహోరీ..!

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:43 AM

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో అభ్యర్థులు హోరాహోరీగా ఢీకొనబోతు న్నారు. గతంలో ఇదే ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 37 మంది మధ్య పోటీ జరగ్గా, ఇప్పుడు ఆ సంఖ్య 35కు తగ్గింది.

 హోరాహోరీ..!

బరిలో 35 మంది.. పెరిగిన ప్రచార వేడి

27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు

కూటమి అభ్యర్థిగా రాజశేఖరం..

అన్ని చోట్ల టీడీపీ మోహరింపు.. మద్దతుగా జనసేన, బీజేపీ దీటైన ప్రచారం

పీడీఎఫ్‌ నుంచి వీర రాఘవులు.. వామపక్షాల అండతో జనంలోకి..

మిగిలిన వారు ఉరుకులు.. పరుగులు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో అభ్యర్థులు హోరాహోరీగా ఢీకొనబోతు న్నారు. గతంలో ఇదే ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 37 మంది మధ్య పోటీ జరగ్గా, ఇప్పుడు ఆ సంఖ్య 35కు తగ్గింది. గతంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి లేకపోగా, ఇప్పుడు ఆ పార్టీయే ప్రత్యక్షంగా రాజశేఖరంను అభ్యర్థిగా రంగంలోకి దింపింది. పీడీఎఫ్‌ పక్షాన దిడ్ల వీరరాఘవులు రంగంలో ఢీకొంటున్నారు. నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసినప్పటికీ, గడిచిన 45 రోజులుగా ప్రచారాన్ని వీలైనంత మేర కొనసాగిస్తూనే ఉన్నారు.

మూడు నెలల క్రితం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా, తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవ త్తరంగా జరగనున్నాయి. ఇప్పటికే అఽధికార కూటమి పక్షాన తెలుగుదేశం అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని బరిలో నిలిపారు. నెలన్నర క్రితమే రాజశేఖరాన్ని కూటమి క్యాడర్‌కు పరిచయం చేశారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఓటర్ల నమోదులో నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. ఓటర్లు సంఖ్య పెరగని నియోజకవర్గాల బాధ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికి నమోదైన ఓటర్ల సంఖ్య లక్షా పాతిక వేలకు మించ లేదు. సీఎం సీరియస్‌ను అర్థం చేసుకున్న నేతలంతా 45 రోజులుగా ఓటర్ల జాబితాపై దృష్టి పెట్టడంతో ఈ సంఖ్య మూడు లక్షల 14 వేలకు పైగా చేరింది. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న పట్టభద్రులతోపాటు మిగతా వారు ఓటర్ల జాబితాలో చేరేందుకు ఆసక్తి చూపించడం కొత్త పరిణామం. నమోదైన ఓటర్ల సంఖ్యలో పురుష ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. సాధారణ ఎన్నికలకు ఇది రివర్స్‌గానే ఉంది.

టీడీపీ.. పీడీఎఫ్‌ మధ్యే పోటీ !

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 27న సందర్భంగా అభ్యర్థులంతా ఎవరంతటి వారీగా వ్యూహం అమలు చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం తన గెలుపు విషయంలో భారమంతా సిట్టింగ్‌ ఎమ్మె ల్యేలు, నియోజకవర్గ సీనియర్లపైనే వేశారు. రాజశేఖ రం గెలిచి తీరాలని అధినాయకత్వం ఆదేశించడంతో ఆ దిశగా ముఖ్యులంతా ఓటర్లను పోలింగ్‌ కేంద్రా నికి చేర్చేందుకు కార్యాచరణలో ఉన్నారు. నియోజక వర్గాల వారీగా టీడీపీ పరిశీలకులను నియమించింది. జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర మంత్రులు, ఇన్‌ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు మండలాల వారీగా పట్టభద్రులను కలుస్తున్నారు. కూటమి ప్రభుత్వం కూటమి యువతకు అండగా నిలిచేందుకు చేస్తున్న ప్రయత్నాలను పదేపదే వారి చెవినవేస్తున్నారు. రాబోయే మెగా డీఎస్సీతోపాటు ఉపాధికి ఊతంమిచ్చేలా తామెలాంటి చర్యలు తీసుకుం టున్నామో వివరించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కేడర్‌ యావత్తు ప్రచారంలో తలమునకలై ఉన్నారు. పీడీఎఫ్‌ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు ఓ వైపు వామపక్షాలు కేడర్‌ అండదం డలతో ప్రచారాన్ని వేగవంతం చేశారు. పట్టభద్రుల పక్షాన విధాన పరిషత్‌లో గళమెత్తే అవకాశం తనకు ఇవ్వా ల్సిందిగా అన్నీచోట్ల ఏకరవు పెడుతున్నారు. ఉద్యోగాల్లో ఉన్నవారు తమ వైపే మొగ్గు చూపేలా ఎన్జీవోలు, టీచర్ల ను ఆకర్షించే పనిలో టీడీపీ, పీడీఎఫ్‌తోపాటు మిగిలిన అభ్యర్థులంతా ప్రయత్నాల్లో దిగారు. గతంకంటే ఈసారి ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో గట్టి పట్టు నిలుపుకునేలా కరపత్రాల యుద్ధం చేస్తున్నారు. పోటీలోని అభ్యర్థుల సంఖ్య భారీగా ఉండటంతో ఆ మేరకు బ్యాలెట్‌ లో వరుస సంఖ్యను బట్టి తమ అదృష్టం ఆధారపడి ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు.

ఇప్పటికి మూడుసార్లు

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి 2007 నుంచి ఇప్పటివరకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. దీనికి భిన్నంగా నాలుగో విడత పోటీ హోరాహోరీగా సాగనుంది.

2007లో పీడీఎఫ్‌ అభ్యర్థి జార్జి విక్టర్‌ గెలుపొందారు. అప్పట్లో పట్టభద్రులైన ఓటర్ల సంఖ్య లక్షన్నరలోపే ఉంది.

2013 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు తనయుడు రవికిరణ్‌వర్మ గెలుపొందారు. ఆ తర్వాత ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు అత్యధికులు ఉత్సాహం కనబరుస్తూ వచ్చారు.

2019లో నువ్వా నేనా అన్నట్లు పీడీఎఫ్‌ పక్షాన ఇళ్ల వెంకటేశ్వరరావు ఆదిత్య శేషారెడ్డిని ఢీకొన్నారు. అప్పుడు పరోక్షంగా వైసీపీ వర్గీయులంతా శేషారెడ్డి వైపే మొగ్గు చూపారు. పీడీఎఫ్‌ అభ్యర్థిగా ఉన్న ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ)ను ఓడించేందుకు విశ్వప్రయ త్నాలు చేశారు. ఓటర్లకు నజరానాలు పంచారు. ఓటర్లను విందు, వినోదాల్లో తేల్చారు. కానీ పీడీఎప్‌ అభ్యర్థిగా వెంకటేశ్వరరావు 65 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పట్టభద్రుల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను పీడీఎఫ్‌ అభ్యర్థి తన విజయం వైపు మలుచుకున్నారు.

రాజశేఖరాన్ని గెలిపిద్దాం

తాడేపల్లిగూడెం : కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి, బీజేపీ కన్వీనర్‌ ఈతకోట తాతాజీలతో కలిసి శుక్రవారం పట్టణంలో కరపత్రాలను పంపిణీ చేశారు.

Updated Date - Feb 15 , 2025 | 12:43 AM