Share News

Mithun Reddy: సీజే వద్దకు మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ ఫైల్‌

ABN , Publish Date - Jun 24 , 2025 | 06:59 AM

మద్యం కుంభకోణం వ్యవహారంలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు స్పందిస్తూ.. పిటిషన్‌పై ఇప్పటికే మరో న్యాయమూర్తి విచారణ ప్రారంభించారని గుర్తుచేశారు.

 Mithun Reddy: సీజే వద్దకు మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ ఫైల్‌

రిజిస్ట్రీని ఆదేశించిన హైకోర్టు న్యాయమూర్తి

అమరావతి, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం వ్యవహారంలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు స్పందిస్తూ.. పిటిషన్‌పై ఇప్పటికే మరో న్యాయమూర్తి విచారణ ప్రారంభించారని గుర్తుచేశారు. పిటిషనర్‌ తరఫు వాదనలు ముగిశాయని, ప్రాసిక్యూషన్‌ వాదనలు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. పార్ట్‌ హెర్డ్‌ వ్యాజ్యాన్ని తాను విచారించడం సబబు కాదన్నారు. పిటిషన్‌పై ఏ బెంచ్‌ విచారించాలనే దానిపై నిర్ణయం తీసుకొనేందుకు వీలుగా కేసు ఫైలును సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. మద్యం కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి సోమవారం వాదనలు వినిపిస్తూ.. నాలుగువారాల్లో పిటిషన్‌పై నిర్ణయం వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. ప్రాసిక్యూషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిసి నిర్ణయం వెల్లడించేవరకు మిథున్‌రెడ్డిని అరెస్టు చేయబోమన్నారు. పిటిషనర్‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 06:59 AM