Share News

Minster Lokesh: మీకు అండగా ఉంటా

ABN , Publish Date - Nov 07 , 2025 | 05:01 AM

రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, ఇటీవల ఆకస్మికంగా మరణించిన టీడీపీ సీనియర్‌ నేత మాలేపాటి సుబ్బానాయుడి కుటుంబాన్ని మంత్రి లోకేశ్‌ పరామర్శించారు.

Minster Lokesh: మీకు అండగా ఉంటా

రాజకీయంగా ముందుకు తీసుకెళ్తా

సుబ్బానాయుడి కుటుంబానికి లోకేశ్‌ భరోసా

కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, అనుయాయుల వేధింపులపై కుటుంబ సభ్యుల లేఖ

నేడు, రేపు కల్యాణదుర్గంలో పర్యటన

కావలి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, ఇటీవల ఆకస్మికంగా మరణించిన టీడీపీ సీనియర్‌ నేత మాలేపాటి సుబ్బానాయుడి కుటుంబాన్ని మంత్రి లోకేశ్‌ పరామర్శించారు. ఆయన కుటుంబానికి అండగా ఉండటమే కాక రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా దగదర్తిలో సుబ్బానాయుడు, ఆయన సోదరుడి కుమారుడు భానుచందర్‌ ఇటీవల మృతిచెందిన సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులను ఓదార్చేందుకు గురువారం లోకేశ్‌, మంత్రి ఫరూక్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి దగదర్తికి వచ్చారు. సుబ్బానాయుడి సతీమణి భవాని, ఇతర కుటుంబసభ్యులతో లోకేశ్‌ ఏకాంతంగా మాట్లాడారు. మాలేపాటి కుటుంబం టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉందని, కావలి ఇన్‌చార్జిగా సుబ్బానాయుడు చేసిన సేవలు, పార్టీ కోసం చేసిన కృషిని వారు వివరించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక కావలి టీడీపీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, ఆయన అనుచరులు పెట్టిన కష్టాలు, వేధింపులపై ఓ లేఖ అందజేశారు. కొన్ని ఆధారాలు కూడా ఇచ్చారు. వీటిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఇచ్చి.. తగిన నిర్ణయం తీసుకోవాలని మంత్రి చెప్పినట్లు తెలిసింది. అలాగే కుటుంబ సభ్యులను ఈ నెల 19వ తేదీన అమరావతికి వచ్చి కలవాలని సూచించినట్లు కూడా సమాచారం.


రెండ్రోజులు కల్యాణదుర్గంలో..

అనంతపురం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): మంత్రి లోకేశ్‌ శుక్ర, శనివారాల్లో అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో పర్యటించనున్నారు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు కల్యాణదుర్గం టీడీపీ కార్యాలయానికి వెళ్తారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని, రాత్రికి అక్కడే బసచేస్తారు. శనివారం ఉదయం కల్యాణదుర్గంలో నిర్వహించే భక్త కనకదాస జయంతి వేడుకల్లో ఆయన పాల్గొంటారు.

లోకేశ్‌కు స్వాగతం పలికి వెళ్తూ..

దగదర్తికి వస్తున్న లోకేశ్‌కు గుడ్లూరు మం డలం మోచర్ల హైవే వద్ద కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కరేడు పంచాయతీ పరిధిలోని అలగాయపాలెం ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు ఓ ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఒంగోలు వైపు వెళ్లే కారు వేగంగా వచ్చి దానిని ఢీకొనడంతో బోల్తాపడింది. డ్రైవర్‌తోపాటు ఆటోలోని 10 మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కారులో ఉన్న ఆరుగురిలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

Untitled-2 copy.jpg

Updated Date - Nov 07 , 2025 | 05:02 AM