Atcchannaidu and Botsa Satyanrayana: యూరియాపై ఎన్ని గంటలైనా చర్చిద్దాం
ABN , Publish Date - Sep 19 , 2025 | 07:32 AM
యూరియా, ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై ఎన్ని గంటలు చర్చించడానికైనా సిద్ధంగా ఉన్నామని, ఎక్కడకూ ప్రభుత్వం పారిపోవడం లేదని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ప్రభుత్వం పారిపోవడంలేదు.. రైతుకోసం ఎవరేం చేశారో తేల్చేద్దాం
మంత్రి అచ్చెన్న స్పష్టీకరణ.. ఇప్పుడే..ఇక్కడే చర్చించాలన్న వైసీపీ
అమరావతి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): యూరియా, ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై ఎన్ని గంటలు చర్చించడానికైనా సిద్ధంగా ఉన్నామని, ఎక్కడకూ ప్రభుత్వం పారిపోవడం లేదని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అయితే, ఇప్పుడే.. ఇక్కడే..చర్చించాలంటూ వైసీపీ సభ్యులు మొండి పట్టుపట్టడంతో శాసనమండలిలో ఈ అంశంపై వాగ్వాదం సాగింది. యూరియా సరఫరాతోపాటు వ్యవసాయ ఉత్పత్తులపై సభలో చర్చించాలని గురువారం మండలి ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. చైర్మన్ మోషేన్‌రాజు దానిని తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు సభలో వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. పోడియంపైకి ఎక్కి ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు స్పందించారు. ‘‘రైతులకు యూరియా సరఫరాతోపాటు వ్యవసాయ ఉత్పత్తులపై సభలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం జరిగే బీఏసీలో దీనిపై నిర్ణయం తీసుకుని, ఎన్ని గంటలైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం.’’ అని వివరించారు. ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉందని మంత్రి, చైర్మన్ చెబుతున్నా వినకుండా వైసీపీ సభ్యులు వెల్‌లో నినాదాలు చేశారు. ఈ సమయంలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరగడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. అనంతరం తిరిగి 10.31 గంటలకు ప్రారంభమైంది. మళ్లీ వైసీపీ సభ్యులు వెల్‌లోకి వెళ్లారు. ఈ సమయంలో మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ స్పందించారు. ‘‘యూరియా చాలా ముఖ్యమైన అంశం. ప్రభుత్వం తయారుగా ఉన్నప్పుడు ఎల్లుండిదాకా వాయిదా వేయడం ఎందుకు? అన్నీ రద్దు చేసి ఇప్పుడే చర్చించాలి. గతంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయా?’’ అని ఆవేశంగా ప్రశ్నించారు. దీనిపై అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఏం చేసింది, తమ ప్రభుత్వం 15 నెలల కాలంలో ఏం చేసిందనే విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరోసారి చైర్మన్ చెప్పడంతో వైసీపీ సభ్యులు నిరసన విరమించి కూర్చున్నారు.