Share News

Minister Nimmala: కాంట్రాక్టు సంస్థలకు వత్తాసా..!

ABN , Publish Date - Jul 30 , 2025 | 06:00 AM

లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయనప్పటికీ కాంట్రాక్టు సంస్థలకు వత్తాసు పలికేలా ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు కితాబుల్విడంపై మంత్రి

Minister Nimmala: కాంట్రాక్టు సంస్థలకు వత్తాసా..!

పనులు పూర్తికాకపోయినా ఏజెన్సీలకు కితాబులిస్తారా?

  • ఆ ఈఈలు ఇద్దరికీ షోకాజ్‌ నోటీసులు ఇవ్వండి

  • జల వనరుల శాఖ అధికారులకు మంత్రి నిమ్మల ఆదేశం

  • హంద్రీనీవా, వెలిగొండ పనులపై ఉన్నతాధికారులతో సమీక్ష

  • నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులు సాగకపోవడంపై అసంతృప్తి

అమరావతి, జూలై 29(ఆంధ్రజ్యోతి): లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయనప్పటికీ కాంట్రాక్టు సంస్థలకు వత్తాసు పలికేలా ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు కితాబుల్విడంపై మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంగళవారం హంద్రీనీవా, వెలిగొండ పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు కాంట్రాక్టు సంస్థలను వెనకేసుకొచ్చేలా మాట్లాడటంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు బ్రాంచి కెనాల్‌లో 0 నుంచి 22 కిలోమీటర్లు, 26 నుంచి 75 కిలోమీటర్ల వరకు పనులు చేయాల్సిన కాంట్రాక్టు ఏజెన్సీ సకాలంలో పనులు పూర్తి చేయలేదు. చేసిన పనికూడా సక్రమంగా చేయలేదు. అయితే వాస్తవాన్ని మరుగుపరిచి కాంట్రాక్టు సంస్థను వెనకేసుకొస్తూ, సంస్థ పనులను వేగంగా చేస్తోందంటూ హంద్రీనీవా డివిజన్‌-8, పెనుగొండ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు ఎస్‌.మురళి సమావేశంలో చెప్పారు. దీనిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తప్పుదోవ పట్టించేలా మాట్లాడిన ఈఈ మురళికి చార్జ్‌మెమోను ఇవ్వాలని అధికారులను మంత్రి అదేశించారు. పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌లో 75వ కిలోమీటరు నుంచి 207వ కిలోమీటరు వరకూ ప్రవాహం ఆగిపోవడంపై మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు ఈ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ 0 కిలోమీటర్ల నుంచి చివరిదాకా పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీవద్దని మంత్రి స్పష్టం చేశారు. ఈ కెనాల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు వి.వెంకటేశ్వర్లు పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం, సమావేశాలకు గైర్హాజరు కావడం, హెడ్‌ క్వార్టర్స్‌లో నివసించకపోవడం వంటి కారణాలతో ఆయనకు మూడు చార్జి మెమోలను ఇవ్వాలని నిమ్మల ఆదేశించారు.


వెలిగొండ పనుల జాప్యంపై నిలదీత

వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్స్‌ బెంచింగ్‌ పనులు 1,025 మీటర్లు పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులు అన్ని 2025 జూన్‌కి పూర్తి చేస్తామని, ఆ తర్వాత డిసెంబరుకు, మళ్లీ 2026 మార్చికి... పూర్తి చేస్తామంటూ కాంట్రాక్టు సంస్థ వాయిదా వేయడంపై మంత్రి నిమ్మల అసంతృప్తిని వ్యక్తం చేశారు. లక్ష్యం విషయంలో చెప్పిన దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థకు, పనులు పూర్తిచేయించాల్సిన బాధ్యత ఇంజనీరింగ్‌ అధికారులకూ ఉంటుందని విస్పష్టంగా పేర్కొన్నారు. టన్నెల్స్‌లో బెంచింగ్‌ పూర్తయితే కాని లైనింగ్‌ చేయడానికి కుదరదని నిమ్మల అన్నారు. బెంచింగ్‌ పూర్తికాగానే లైనింగ్‌ను పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. టన్నెల్‌లో ఉన్న టీబీఎం మిషన్‌ తొలగింపునకు ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలో త్వరలోనే సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నామని జల వనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఫీడర్‌ కెనాల్‌ రోజువారీ పనులు కూడా నిర్దేశించిన దానికి కంటే 50 శాతం వెనుకబడి ఉన్నాయని మంత్రి చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును 2026 జూన్‌ నాటికి పూర్తి చేసేలా పనులు వేగవంతం చేయాలని నిమ్మల ఆదేశించారు.

Updated Date - Jul 30 , 2025 | 06:00 AM