Minister Satyakumar: ప్రజల ఆయుష్షు 85 ఏళ్లకు పెరగాలి
ABN , Publish Date - Jul 02 , 2025 | 05:45 AM
రాష్ట్ర ప్రజల సగటు ఆయుష్షును ప్రస్తుతం ఉన్న 71ఏళ్ల నుంచి 85ఏళ్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రసవకాల మాతృ మరణాలను 45 నుంచి...
మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు ప్రణాళికలు
వైద్యులపై దాడులు సరికాదు:మంత్రి సత్యకుమార్
అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజల సగటు ఆయుష్షును ప్రస్తుతం ఉన్న 71ఏళ్ల నుంచి 85ఏళ్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రసవకాల మాతృ మరణాలను 45 నుంచి ఐదుకు, శిశు మరణాలను 24 నుంచి రెండుకు తగ్గించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మంగళవారం విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, ప్రజల ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉందని చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణకు నిరంతరం శ్రమించే వైద్యులను అందరూ గౌరవించాలని కోరారు. ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర కీలకమని, ఈ దిశగా ప్రజాసేవ పట్ల చిత్తశుద్ధి, అంకితభావంతో పని చేస్తున్న వైద్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రోగుల ప్రాణాలు కాపాడేందుకు ఆఖరి క్షణం వరకు శ్రమించే వైద్యులపై దాడులు, జులుం చేయడం సరికాదన్నారు. చికిత్సలో నిర్లక్ష్యం జరిగిందని భావిస్తే ప్రభుత్వం, ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సిబ్బం ది పనితీరుపై నిఘా పెంచామని, ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గత ప్రభుత్వ నిర్వాకంతో గాడితప్పిన ప్రజారోగ్య రంగాన్ని కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పాలనలో తిరిగి పట్టాలెక్కించిందని వివరించారు. ‘జాతీయ వైద్యుల దినోత్సవం’ సందర్భంగా వివిధ విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన పది మంది వైద్యులను మంత్రి సత్కరించారు. ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్ పద్మశ్రీవాత్సవ, డీఎంఈ, ప్రముఖ శస్త్రచికిత్స వైద్య నిపుణుడు డాక్టర్ నరసింహంకు ఉత్తమ వైద్యులుగా అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏపీఎంసీ చైర్మన్ శ్రీహరిరావు, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ రాధిక రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.