Share News

Nara Lokesh: నిరూపిస్తే రాజీనామా

ABN , Publish Date - May 28 , 2025 | 05:01 AM

ఉర్సా భూములపై జగన్‌ చేసిన ఆరోపణలపై మంత్రి లోకేశ్‌ సవాల్‌ విసిరారు. తండ్రి చంద్రబాబు నాయకత్వంలో పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతపై దృష్టి సారించామని తెలిపారు.

Nara Lokesh: నిరూపిస్తే రాజీనామా

ఉర్సాపై జగన్‌కు లోకేశ్‌ సవాల్‌

99 పైసలకు భూములివ్వలేదు.. జగన్‌ ఇంకా అబద్ధాలాడుతున్నారు

టాప్‌-100 ఐటీ కంపెనీలు విశాఖ వస్తే 99 పైసలకే భూమి ఇవ్వడానికి రెడీ

సీఎం పదవిపై తొందరెందుకు?.. నేను ఏనాడూ పదవులు అడగలేదు

కార్యకర్తలందరికీ న్యాయం చేస్తాం.. మరో 50 ఏళ్లు పార్టీ పటిష్ఠంగా ఉండాలి

పార్టీ పటిష్ఠానికి వర్కింగ్‌ గ్రూపులు.. మోదీ నుంచి ఈ ఆలోచన తీసుకున్నా

ఆయన్నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.. మీడియాతో లోకేశ్‌ చిట్‌చాట్‌

(మహానాడు ప్రాంగణం నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి)

ర్సా సంస్థకు ఎకరా భూమి 99 పైసలకు ఇచ్చినట్లు జగన్‌ నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి లోకేశ్‌ సవాల్‌ విసిరారు. జగన్‌ ఇంకా అబద్ధాలే మాట్లాడుతున్నారని అన్నారు. మంగళవారం కడప మహానాడు ప్రాంగణంలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ఈ సందర్భంగా ఉర్సాపై జగన్‌ చేసిన ఆరోపణలపై లోకేశ్‌ స్పందించారు. ఉర్సాకు 99 పైసలకు భూములు కేటాయించలేదని స్పష్టం చేశారు. విశాఖలో టీసీఎస్‌కు ఎకరా 99 పైసలకు కేటాయించిన మాట వాస్తవమని, విశాఖలో 5లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఐటీ సంస్థలకు భూకేటాయింపులు జరుపుతున్నామని, ప్రపంచంలో టాప్‌-100 ఐటీ కంపెనీలు విశాఖలో తమ సంస్థల స్థాపనకు ముందుకొస్తే వాటికి 99 పైసలకే భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో చేస్తోందన్నారు. ఇకపై రాష్ట్రానికి పరిశ్రమలు రావడం ఉంటుందే తప్ప గత ప్రభుత్వంలో మాదిరి పోవడం ఉండదన్నారు. జగన్‌ను అరెస్టు చేస్తారన్న ప్రచారంపై స్పందిస్తూ.. అది తనకు తెలియదని హోం మంత్రి, ముఖ్యమంత్రిని అడగాలన్నారు.


చంద్రబాబు నాయకత్వంలో...

ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముందని లోకేశ్‌ ప్రశ్నించారు. తదుపరి సీఎం మీరేనా? అన్న మీడియా ప్రశ్నకు ఆయనపై విధంగా స్పందించారు. తాను ఏనాడూ పదవులు అడగలేదన్నారు. చంద్రబాబు యంగ్‌ అండ్‌ డైనమిక్‌ నాయకుడని, ఆయన వయసు ఎక్కువ కానీ ఆలోచనలు యూత్‌ఫుల్‌గా ఉంటాయన్నారు. ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్లడమే తమకు ఆనందంగా ఉందన్నారు. ‘దేశానికి మోదీ, రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం చాలా అవసరం. చంద్రబాబులా నేను యోగా చేయలేను. నేను, అచ్చెన్నాయుడు శవాసనం వేసి హాయిగా నిద్రపోతాం. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో చేస్తా. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయి. అందరికీ ఒకేసారి న్యాయం చేయలేం. పదవులు రాలేదని నాయకులు అలగడం మానాలి’ అని అన్నారు. రాబోయే ఐదు దశాబ్దాలు పార్టీ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టామని లోకేశ్‌ వివరించారు. అందులో భాగంగానే నా తెలుగు కుటుంబం పేరుతో 6 శాసనాలు తీసుకొచ్చామని తెలిపారు. ‘పార్టీలో నేను ఒక భాగమే తప్ప నేనే పార్టీ కాదు. క్షేత్రస్థాయిలో పార్టీలో ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు మండల స్థాయి నుంచి పొలిట్‌బ్యూరో వరకు వర్కింగ్‌ గ్రూపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రధానితో భేటీ సమయంలో ఈ ఆలోచన చెప్పారు. దాన్నే మేం ఇక్కడ అమలు చేస్తున్నాం. సుమారు 20 ప్రశ్నలకు మోదీ నుంచి సమాధానాలు రాబట్టాను. ఆయన ఎంతో ఓపిగ్గా తండ్రిలా అన్నింటికీ సమాధానం ఇచ్చారు. ప్రధాని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. ‘అధికారంలో ఉన్నామని కాలర్‌ ఎగరేయకుండా ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నాం. జూన్‌ 12లోగా అన్ని నామినేటెడ్‌ పదవులు భర్తీ చేస్తాం. పార్టీలో సీనియర్లకు తగిన గౌరవం ఉంటుంది. యువగళం పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. గత ప్రభుత్వం పరిశ్రమలను తరిమేసింది. ఏపీ బ్రాండ్‌ను నాశనం చేసింది. మేము తిరిగి దాన్ని పునరుద్ధరించే పనిలో ఉన్నాం. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒక్క పాఠశాల కూడా మూతపడలేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా 9,800 పాఠశాలలలో వన్‌ క్లాస్‌ వన్‌ టీచర్‌ విధానాన్ని తీసుకొస్తున్నాం’ అని లోకేశ్‌ చెప్పారు.


నా తల్లి ఆవేదనను కళ్లారా చూశా

‘మహిళలను గౌరవించాలి. ముందు రాజకీయ నాయకులు తమ భాషను మార్చుకోవాలి. వైసీపీ ప్రభుత్వంలో మహిళలను ప్రతిరోజూ కించపరుస్తూ వచ్చారు. నా కన్నతల్లితో పాటు హోంమంత్రి అనిత కూడా వైసీపీ బాధితుల జాబితాలో ఉన్నారు. ఆ సమయంలో నా తల్లి ఆవేదనను కళ్లారా చూశాను. జగన్‌ కుటుంబంలో ఎవరినీ మా నేతలు ఒక్క మాట కూడా అనడం లేదు. మావాళ్లు ఎవరైనా మహిళల పట్ల తప్పుగా మాట్లాడితే ఉపేక్షించం’ అని లోకేశ్‌ అన్నారు. రెడ్‌బుక్‌ పేరు చెబితే గతంలో తప్పులు చేసిన వారు చాలామంది భయపడుతున్నారన్నారు. కొంతమంది అడవుల్లోకి పోతుంటే, మరి కొంతమంది బాత్‌రూమ్‌ల్లో జారిపడుతున్నారన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే

అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2025 | 05:01 AM