రూ.6,78,345కోట్ల పెట్టుబడులు!
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:24 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోందని సమాచార పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇప్పటి వరకూ రూ.6,78,.345 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 34 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు

ఒప్పందాలు జరిగిన 34 ప్రాజెక్టుల ప్రతిపాదనలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం
మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్థసారథి
అమరావతి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోందని సమాచార పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇప్పటి వరకూ రూ.6,78,.345 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 34 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయని.. ఆ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించిందని చెప్పారు. వీటి ద్వారా 4,28,705 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. గురువారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వివరించారు. 2024-29 మధ్య చేపట్టే ఎంఎ్‌సఎంఈ, ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ డెవల్‌పమెంట్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఏపీ సస్టెయినబుల్ ఎలక్ర్టిక్ మొబిలిటీ పాలసీ, టెక్స్‌టైల్, అపెరల్, గార్మెంట్ల పాలసీల సవరణల కోసం చేసిన ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదించిందని వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విభిన్న ప్రతిభావంతులు, మహిళా ఎంటర్‌ప్రైన్యూర్స్‌ను ప్రోత్సహించేందుకు వారికిస్తున్న 35ు పెట్టుబడి రాయితీని 45శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. రవాణా లాజిస్టిక్స్‌కు కూడా 45ు రాయితీని.. గరిష్ఠంగా రూ.75లక్షల వరకు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికే ఈ రాయితీలు వర్తిస్తాయన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు భూమి విలువపై 75శాతం రాయితీ.. గరిష్ఠంగా రూ.25 లక్షలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఎంఎ స్‌ఎంఈడీపీ-4.0 పాలసీలో మహిళలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులకు ప్రతి యూనిట్ విద్యుత్‌పై రూపాయిన్నర రాయితీ ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ ప్రోత్సాహాన్ని ఐదేళ్లపాటు అన్ని వర్గాలకూ ఇస్తామన్నారు.
మరిన్ని నిర్ణయాలు..
రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్న నినాదంలో భాగంగా వారిని ప్రోత్సహించడానికి 8 ప్రాధాన్య అంశాలు ఖరారు.
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు గత నెల 30న చేసిన సిఫారసులకు ఆమోదం.
కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఎలీప్, ఈఎంసీ(కొప్పర్తి) తదితర కంపెనీలు కోరిన ప్రోత్సాహాలపై సానుకూల నిర్ణయాలు.
ఎలీప్ సంస్థకు తూర్పుగోదావరి జిల్లా బాలభద్రాపురంలో గతంలో కేటాయించిన 34.19 ఎకరాల బదులు అనకాపల్లి జిల్లా కోడూరులో 31.77 ఎకరాలు కేటాయింపు.
2014-19 మధ్య నీరు-చెట్టు కింద చేపట్టిన పనులకు పెండింగ్ బిల్లుల చెల్లింపు.. పనుల తనిఖీ, 386 మంది ఇంజనీర్లపై చేపట్టిన క్రమశిక్షణ చర్యల ఉపసంహరణ.
టీటీడీలో నూతన పోస్టుల సృష్టికి బదులుగా ప్రస్తుతం ఉన్న 15 వర్కర్స్(సీనియర్) పోస్టులను.. పోటు సూపర్‌వైజర్ల స్థాయికి అంటే సీనియర్ అసిస్టెంట్ కేడర్‌కు సమానంగా పెంచేందుకు ఆమోదం.
రిజిస్ట్రేషన్లు-స్టాంపుల విభాగంలో పత్రాల నమోదు కోసం డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టం ప్రవేశపెట్టేందుకు సమ్మతి.
చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటులో తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం, కోట మండలం కొత్తపట్నంలో భూములు కోల్పోయిన వారికి కొన్ని షరతులకు లోబడి ఏకకాల ప్రత్యేక పరిహారం కింద ఎకరానికి రూ.8 లక్షల చొప్పున మొత్తం రూ.78,84,83,200 మంజూరుకు ఆమోదం.
ఏపీ హక్కుల భూమి, పట్టాదార్ పాస్ పుస్తకాల చట్టం (1971)లోని సెక్షన్ 5 (1), (2), (4) సవరణ కోసం చేసిన ప్రతిపాదనకు, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ఆమోదం. ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ సొసైటీ, కెపాసిటీ బిల్డింగ్ పాలసీ-2025 ముసాయిదాకు ఆమోదం.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రూ. 920 కోట్లతో సహాయ పునరావాస కాలనీ నిర్మాణం పూర్తి చేయాలని తీర్మానం.