Share News

Kollu Ravindra: మేం చిటికేస్తే రోడ్డుపై తిరగలేరు

ABN , Publish Date - Apr 11 , 2025 | 06:43 AM

వైసీపీ నాయకులపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర హెచ్చరిక చేశారు. "మేము చిటికె వేస్తే ఒక్క వైసీపీ నాయకుడూ రోడ్డుపై తిరగలేడు" అంటూ హెచ్చరించారు

Kollu Ravindra: మేం చిటికేస్తే రోడ్డుపై తిరగలేరు

  • వైసీపీ నాయకులకు మంత్రి కొల్లు హెచ్చరిక

అనంతపురం, హిందూపురం, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): ‘టీడీపీ నాయకుల తలలు తీస్తామని మాజీ మంత్రి కారుమూరి అంటున్నారు. మేము ఒక చిటికె వేస్తే రాష్ట్రంలో ఒక్క వైసీపీ నాయకుడూ రోడ్డుపై తిరగలేడు. మా సీఎం ప్రజాస్వామ్యబద్ధంగా వెళుతున్నారు. అందుకే ఊరుకున్నాం’ అని ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలో మద్యం డిపోను మంత్రి సవితతో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. అనంతపురం శివారులోని సోములదొడ్డి వద్ద ఐఎంఎ్‌ఫఎల్‌ గోడౌన్‌ను ప్రారంభించారు. ఈ రెండు చోట్లా మంత్రి మీడియాతో మాట్లాడారు. పాపిరెడ్డిపల్లి పర్యటనలో పోలీసులపై జగన్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘పోలీసులను బట్టలూడదీసి కొడతానంటున్నావ్‌. ఈరోజు నువ్వు బట్టలు వేసుకుని తిరుగుతున్నావంటే అందుకు పోలీసులే కారణమని మరచిపోవద్దు. పోలీసుల్లో మహిళలు కూడా ఉన్నారు. వారిని కూడా అవమానించిన జగన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి’ అని అన్నారు. పరామర్శకు సైతం జనాలకు డబ్బులిచ్చి పిలిపించి, అరాచకానికి పాల్పడ్డారని విమర్శించారు. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం స్కాంను బయటకు తీస్తున్నామని, ఇటీవలే సిట్‌ దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు.

Updated Date - Apr 11 , 2025 | 06:43 AM