State Tourism : పర్యాటకాభివృద్ధితో ప్రత్యేక ముద్ర
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:26 AM
రాష్ట్ర పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించడం ద్వారా ప్రత్యేక ముద్ర వేయాలని ఆ శాఖ అధికారులకు మంత్రి కందుల దుర్గేశ్ నిర్దేశించారు. గురువారం మంగళగిరిలోని ఏపీఐఐసీలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ), ఏపీ టూరిజం ఆథారిటీ (ఏపీటీఏ) అధికారులతో ఆయన సమీక్షించారు.

టూరిజం, కల్చర్ ఈవెంట్ క్యాలెండర్ రూపొందించాలి
ప్రచారానికి ట్యాగ్‌లైన్ సిద్ధం చేయండి: మంత్రి దుర్గేశ్
అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించడం ద్వారా ప్రత్యేక ముద్ర వేయాలని ఆ శాఖ అధికారులకు మంత్రి కందుల దుర్గేశ్ నిర్దేశించారు. గురువారం మంగళగిరిలోని ఏపీఐఐసీలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ), ఏపీ టూరిజం ఆథారిటీ (ఏపీటీఏ) అధికారులతో ఆయన సమీక్షించారు. రాష్ట్ర పర్యాటక రంగానికి అద్భుతమైన ట్యాగ్‌లైన్ సిద్ధం చేయాలని, ఈ నెలలో సీఎం చంద్రబాబుతో జరిగే సమావేశంలో అనుమతి తీసుకొని విస్తృత ప్రచారం కల్పిద్దామని సూచించారు. అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టు పనులపై మంత్రి ఆరా తీశారు. జిల్లాల వారీగా ఆయా ప్రాంతాల్లో పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలకు సంబంధించి ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి ఈవెంట్లు చేద్దామని, టూరిజం, కల్చర్ ఈవెంట్ క్యాలెండర్ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. తిరుపతి తరహాలో శ్రీశైలం క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో తలెత్తిన సిబ్బంది సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. సూర్యలంక, మైపాడు బీచ్‌లను మరింత అభివృద్ధి చేయాలన్నారు. నూతన పర్యాటక పాలసీపై పెట్టుబడిదారులకు అవగాహన కల్పించి పెట్టుబడులు రాబట్టాలన్నారు. ఇటీవలే విజయవాడ, విశాఖపట్నంల్లో ఇస్వెస్టర్ సమ్మిట్లు నిర్వహించామని త్వరలో తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో సైతం నిర్వహించాలని సూచించారు. ఇన్వెస్టర్లును ఆకర్షించి యువతకు ఉపాధి కల్పిద్దామన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఎండీ అమ్రపాలి పనితీరును మంత్రి ప్రశంసించారు.