Share News

Minister Atchannaidu: రబీ నుంచి ఆధార్‌పై ఎరువులు

ABN , Publish Date - Sep 23 , 2025 | 05:22 AM

ఐదేళ్లు భూసార పరీక్షలు నిర్వహించకుండా.. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన సూక్ష్మపోషకాలను ఎత్తేసిన మాజీ సీఎం జగన్‌..

Minister Atchannaidu: రబీ నుంచి ఆధార్‌పై ఎరువులు

  • అవసరమైతే డోర్‌ డెలివరీ చేస్తాం.. సభకు రాకుండా.. విమర్శలా?

  • యూరియాపై 800 పోస్టులు పెట్టారు

  • రైతులు ఆందోళనతో ముందే కొనేశారు

  • అసెంబ్లీలో లఘుచర్చలో మంత్రి అచ్చెన్న వెల్లడి

అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఐదేళ్లు భూసార పరీక్షలు నిర్వహించకుండా.. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన సూక్ష్మపోషకాలను ఎత్తేసిన మాజీ సీఎం జగన్‌.. శాసనసభకు రాకుండా బయట ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఐదేళ్లు వ్యవసాయ రంగాన్ని, రైతు సంక్షేమాన్ని ఆయన గాలికి వదిలేస్తే.. బడ్జెట్‌ కేటాయింపులతో పని లేకుండా సీఎం చంద్రబాబు రైతులను ఆదుకుంటున్నారని చెప్పారు. సోమవారం అసెంబ్లీలో వ్యవసాయ రంగంపై ఆయన లఘు చర్చను ప్రారంభించి మాట్లాడారు. ‘ఏపీ అంటే అన్నపూర్ణ. 64ు జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. రైతులను ఆదుకోవడానికి చంద్రబాబు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. 15ు వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నాం. ఈ ఏడాది 1.23 లక్షల హెక్టార్లలో సాగు పెరిగింది. యూరియా అధికంగా వాడితే క్యాన్సర్‌ వంటి ముప్పుందని పంజాబ్‌లో తేలింది. కేంద్రం కూడా యూరియా తగ్గించాలని చెప్పింది. అయితే దీనిపై యూరియా ఇవ్వడం లేదంటూ 800 పోస్టులు పెట్టారు. అమెరికా నుంచి కూడా పెట్టిన తప్పుడు పోస్టులతోనే యూరియా దొరకదన్న ఆందోళనతో రైతులు ముందే కొనేశారు. యూరియా ఇవ్వలేని చంద్రబాబు, అచ్చెన్నాయుడు బావిలో దూకాలని జగన్‌ మాట్లాడాడు. రైతులు కష్టాల్లో ఉన్నారు. సమస్యలు లేవనడం లేదు. ఏవైనా లోపాలుంటే సరిజేసుకుంటాం. అంతే గానీ తప్పుడు మాటలు మాట్లాడతారా? చంద్రబాబు కేంద్ర మంత్రితో మాట్లాడి, డిమాండ్‌ మేరకు యూరియా తెప్పించారు. ఎక్కడైనా కొరత ఉంటే రవాణా ఖర్చులు భరించి, సరఫరా చేశాం.


ఏపీకి కోటా ప్రకారమే యూరియా వచ్చింది. రబీకి కూడా కొరత ఉండదు. రబీ నుంచి ఆధార్‌పై ఎరువులు సరఫరా చేస్తాం. అవసరమైతే డోర్‌ డెలివరీ ఇస్తాం’ అని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క భూసార పరీక్ష కూడా చేయలేదని చెప్పారు ‘1,375 ప్రయోగశాలలున్నాయంటారు. ఒక్కటీ పని చేయడం లేదు. ల్యాబ్‌ అసిస్టెంట్లు లేరు. చాలెంజ్‌ చేస్తున్నా.. ఒక్కటైనా సక్రమంగా ఉంటే చూపాలి. ల్యాబ్‌లు ఎవరు పెట్టినా ప్రభుత్వ ఆస్తి. వాటిని మేం పునరుద్ధరిస్తాం. ఈ ఏడాది 10.31 లక్షల భూసార పరీక్షల కార్డులిచ్చాం. వైసీపీ హయాంలో ఉచిత పంటల బీమా అని మూడేళ్లు ప్రీమియం కట్టలేదు. ఐదేళ్లూ రబీకి బీమా వర్తింపజేయలేదు. యాంత్రీకరణకు రూపాయి ఖర్చు చేయలేదు. సూక్ష్మసేద్యానికి నిధులివ్వలేదు. ధరల స్థిరీకరణ కింద రూ.8 వేల కోట్లు ఇచ్చానన్న జగన్‌.. రూపాయి ఖర్చు చేయలేదు. వరి ధాన్యం, రొయ్యలపై సెస్‌ విధించి, సొమ్మంతా ఇతర అవసరాలకు వాడుకున్న వాళ్లను ఉరితీయాలి. మొత్తం తినేసి, వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించిన వాళ్లా రైతుల గురించి మాట్లాడేది? ప్రజలు బుద్ధి చెప్పినా.. ఇంకా బుద్ధి రాలేదు’ అని ధ్వజమెత్తారు.


కేంద్ర పథకాలను వినియోగించాలి..

విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ.. కేంద్ర ప్రయోజిత పథకాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యూరియా లేదంటూ కారుకూతలు కూస్తున్న జగన్‌ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు. కౌలురైతులకు యజమానితో నిమిత్తం లేకుండా రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సూచించారు. పల్నాడు జిల్లాలో సూక్ష్మసేద్యం ద్వారా ఉద్యాన సాగు పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు కోరారు. వైట్‌ గోల్డ్‌గా పేరున్న జీడి మామిడి పరిశ్రమకు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకోవాలని.. జీడి పిక్కలపై సెస్‌ ఎత్తేయాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. వ్యవసాయ రంగంలో ఏఐ, డ్రోన్‌ టెక్నాలజీ పెంచాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ (ఆళ్లగడ్డ) సూచించారు. ఆక్వా రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ (ఆముదాలవలస) కోరారు.

Updated Date - Sep 23 , 2025 | 07:24 AM