టమాటా రైతుల్ని ఆదుకుంటాం: అచ్చెన్న
ABN , Publish Date - Oct 07 , 2025 | 04:54 AM
టమాటా రైతుల్ని ఆదుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.
అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): టమాటా రైతుల్ని ఆదుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. టమాటా ధర పడిపోయిన నేపథ్యంలో సోమవారం మంత్రి ఒక ప్రకటన చేశారు. ‘ఆదివారం రాప్తాడు మార్కెట్‌లో టమాటా కిలో గరిష్ఠంగా రూ.18, కనిష్ఠంగా రూ.9, సగటున రూ.12 పలికింది. ట్రెండింగ్‌ను బట్టి రైతులకు మంచి ధర లభిస్తుంది. పత్తికొండ మార్కెట్‌కు 30-40టన్నుల సరుకు వస్తుంది. దసరా సెలవుల కారణంగా 10 టన్నులు అదనంగా వచ్చింది. రోడ్లపై 2వ రకం టమాటాలు పడేసి, గందరగోళం సృష్టించారు. ఇప్పటివరకు 10 టన్నుల టమాటాలు వివిధ రైతుబజార్లకు పంపాం. సోమవారం పత్తికొండ మార్కెట్ నుంచి 10 టన్నులు చిత్తూరు ప్రొసెసింగ్ యూనిట్లకు, 15 టన్నులు రైతుబజార్లకు పంపించాం. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో టమాటా అమ్మకాలు మందగించాయి. అందువల్ల ఎగుమతులకు ఆటంకం ఏర్పడింది. టమాటా రైతుల్ని ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం’ అని మంత్రి పేర్కొన్నారు.