జగన్‌కు మద్యంపై మాట్లాడే అర్హత లేదు: అచ్చెన్న
ABN , Publish Date - Oct 24 , 2025 | 04:04 AM
మద్యంపై మాట్లాడే నైతిక అర్హత జగన్‌రెడ్డికి ఎక్కడుందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో గురువారం విలేకరులతో మంత్రి మాట్లాడారు.
శ్రీకాకుళం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): మద్యంపై మాట్లాడే నైతిక అర్హత జగన్‌రెడ్డికి ఎక్కడుందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో గురువారం విలేకరులతో మంత్రి మాట్లాడారు. ‘కల్తీ మద్యం తయారీ దారులను పట్టుకున్నదే మా ప్రభుత్వం. నిందితుల్లో టీడీపీ నాయకులుంటే వారిని సస్పెండ్ చేశాం. ఓ వైపు గంజాయి, మరోవైపు కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని గత ఐదేళ్లు జగన్‌రెడ్డి భ్రష్టు పట్టించేశారు. అప్పట్లో లిక్కర్ మాఫియా నడిపి రూ.3,600 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. గత ప్రభుత్వం మద్యం తయారీ కంపెనీలన్నింటినీ జగన్ గుప్పెట్లో పెట్టుకొని ‘జే-బ్రాండ్’ పేరిట మద్యం తయారు చేశారు. కల్తీ మద్యం తయారు చేసిన వారిపై కనీస చర్యలు తీసుకోలేదు. కల్తీ మద్యంలోని వాస్తవాలను బయటకు తీసేందుకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేశాం. ప్రజారోగ్యమే మాకు ముఖ్యం. ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతీయాలని చూస్తే ఉపేక్షించేదిలేదు’ అని అచ్చెన్న స్పష్టం చేశారు.