అలనాటి జ్ఞాపకాల తలపోత
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:40 PM
ఆ పాఠశాలలో, కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు దశాబ్దాల తర్వాత కలసి అలనాటి అనుభూతులను తలపోసుకున్నారు.

ఉద్వేగభరితంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఎమ్మిగనూరు పాఠశాల, కళాశాల 75 వసంతాల సందడి
ఎమ్మిగనూరు, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ఆ పాఠశాలలో, కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు దశాబ్దాల తర్వాత కలసి అలనాటి అనుభూతులను తలపోసుకున్నారు. మధ్య వయస్సులోకి, వృద్ధాప్యంలోకి వచ్చిన పూర్వ విద్యార్థులు తాము చదివిన విద్యా సంస్థ 77 వసంతాల సందర్భంగా కలుసుకున్నారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల ఉద్వేగాలతో ఆదివారం ఆ ప్రాంగణమంతా వెల్లువెత్తింది.
ఎమ్మిగనూరు పట్టణంలో 75ఏళ్ల క్రితం ఆవిర్భవించిన ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల ఉత్సవాలు ఆదివారం అట్టహాసంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు పాఠశాల, కళాశాలలో చదివి దేశవిదేశాల్లో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వేలాది మంది విద్యార్థులు తరలి వచ్చారు. ఉత్సవాలు ప్రారంభానికి ముందు పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున కళాశాల నుంచి సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి చేనేత పిత పద్మశ్రీ మాచాని సోమప్పకు పూలమాలలు వేసి నివాళి అర్పించి బాణసంచా పేల్చారు. వేడుకలకు హాజరైన ప్రముఖులు పారిశ్రామికవేత్త ఎమ్మార్ గంగాధర్, మాచాని జగదీష్, మాచాని రఘునాథ్, కేఎస్‌పీ శివన్న, ప్రముఖ రాజకీయనాయకుడు, టీడీపీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, డీఆర్‌డీవో శాస్త్రవేత్త యుగంధర్, రిటైర్డు ఐజీ నరసింహారెడ్డి, నలంద విద్యాసంస్థల అధినేత మహానందయ్య, వైష్ణవి కళాశాలల అధినేత గడిగెలింగప్ప, కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులుతో పాటు పలువురు ప్రముఖులను వేదికపైకి పిలిచి ఘనంగా సన్మానించారు. అంతకు ముందు తమకు విద్యనేర్పిన గురువులకు పూర్వ విద్యార్థులు పూలమాలలు, శాలువలు కప్పి ఘనంగా సన్మానించి పాదాభివందనాలు చేశారు. ఈ సందర్భంగా కొంతమంది పూర్వ విద్యార్థులు తమ పాఠశాల, కళాశాల అభివృద్ధికి విరాళాలను ప్రకటించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.