Mega DSC Certificate Verification: రేపు మెగా డీఎస్సీ జాబితా
ABN , Publish Date - Aug 19 , 2025 | 02:16 AM
మెగా డీఎస్సీ 2025కు సంబంధించిన అభ్యర్థుల కీలక జాబితా బుధవారం విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది...
తొలుత సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించి అభ్యర్థుల లిస్టు
అనంతరం తుది ఎంపిక
అమరావతి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ-2025కు సంబంధించిన అభ్యర్థుల కీలక జాబితా బుధవారం విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే టెట్ మార్కుల సవరణపై పలుమార్లు అభ్యంతరాలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ.. క్రీడల కోటాకు సంబంధించిన జాబితా కూడా రావడంతో సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను విడుదల చేయాలని నిర్ణయించింది. సర్టిఫికెట్ల ఎంపిక జాబితా అంటే దాదాపుగా ఉద్యోగాలు పొందిన వారి జాబితాగానే భావించాలి. 16,347 పోస్టులు భర్తీ చేస్తుండగా, అంతే సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలవనున్నారు. వారిలో ఎవరివైనా సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే, ఆ సంఖ్యకు సమానంగా తర్వాత మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులను పిలుస్తారు. ఇలా 16,347 మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేసిన తర్వాత ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, బుధవారం విడుదలయ్యే సర్టిఫికెట్ల పరిశీలన జాబితాలతోనే ఎవరు ఉద్యోగాలు ఎంపికయ్యారనే విషయంపై స్పష్టత వస్తుంది. కానీ.. అధికారులు మాత్రం ఇది సర్టిఫికెట్ల పరిశీలన జాబితా మాత్రమేనని, తుది జాబితా తర్వాత విడుదల చేస్తామని చెబుతున్నారు.