Kavali Land Scam: హాంఫట్
ABN , Publish Date - Apr 12 , 2025 | 04:37 AM
కావలి నియోజకవర్గంలో వైసీపీ హయాంలో అపూర్వ సహోదరులు కోట్లాది విలువైన ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేశారు. గ్రావెల్ తవ్వకాలతో పాటు శ్మశానాలు, దేవదాయ భూములు కూడా వదిలిపెట్టలేదు

అపూర్వ సహోదరుల కబ్జాకాండ 300 కోట్ల విలువైన 90 ఎకరాలు కబ్జా
కావలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే,
ఆయన సన్నిహితుడి అరాచక పర్వం
వైసీపీ హయాంలో యథేచ్ఛగా భూదందాలు
శ్మశానాలనూ వదలకుండా ఆక్రమణ
అక్రమాల దారిలో వైసీపీ నేతలకూ వేధింపులు
ఆత్మహత్య చేసుకున్న సొంత పార్టీ కార్యకర్త
ఐదేళ్లలో 100 కోట్ల గ్రావెల్ అక్రమ తవ్వకాలు
ప్రభుత్వానికి అందిన ఆర్డీవో నివేదిక
సిట్ వేస్తానని కావలిలో నాడు బాబు హామీ
దర్యాప్తు జరిగితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి
అప్పటి వైసీపీ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు గత ఐదేళ్లూ రెచ్చిపోయారు. పట్టణం నడిబొడ్డున ఉన్న కాల్వలు, కుంట...డొంక పోరంబోకు అన్నింటినీ కలిపేసుకుని లేఔట్లు వేశారు. చివరికి శ్మశానాలను కూడా వదిలిపెట్టలేదు. మున్సిపల్ కామన్ సైట్లు,దేవదాయశాఖ భూములూ కలిపేసుకున్నారు.
సామాన్యులనేకాదు సొంత పార్టీ కార్యకర్తలనూ కావలి అపూర్వ సహోదరులు వదల్లేదు. దుగ్గిరాల కరుణాకర్ వైసీపీ కార్యకర్త. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ముసునూరు చెరువులో చేపలు వేలంపాటలో పాడుకుని పట్టుకునేవారు. కానీ, ఆయనకు వైసీపీ హయాంలో వేధింపులు తప్పలేదు. తమ స్థలం పక్కనే ఉన్న కరుణాకర్ ఇంటిని కలుపుకొని భారీ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలని వారిద్దరూ ఎత్తువేశారు. కానీ, అందుకు సహకరించలేదని చేపలనూ కరుణాకర్‌ను పట్టుకోనివ్వలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కరుణాకర్ వైసీపీ అయినా లోకేశ్ ఆయన కుటుంబాన్ని నాడు ఆదుకున్నారు. తనఖాలోని ఇంటిని రూ.15 లక్షలు కట్టి విడిపించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత కావలి అపూర్వ సహోదరుల భూదందాలపై సమగ్ర విచారణ చేసేందుకు సిట్ వేస్తామని సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు కావలి పర్యటనలో ప్రకటించారు. రెవెన్యూ అధికారుల విచారణలో ఇప్పుడు తేలింది కొంతే. సిట్ వేస్తే మరిన్ని భూదందాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో అపూర్వ సహోదరులంటే హడల్. వారి కన్ను పడి ఎక్కడ తమ భూములు, ఆస్తులు, ఇళ్లూ హాంఫట్ అయిపోతాయేమోనని ప్రజలు, టీడీపీ శ్రేణులే కాదు, చివరికి వైసీపీ నేతలూ భయపడతారు. కాల్వలు..కుంట పోరంబోకు..డొంక పోరంబోకు..అసైన్డ్ భూములు.. వేటినీ వీరు వదలరు. చివరికి శ్మశానాలనూ కలిపేసుకొన్నారు. గ్రావెల్ కోసం వీరు తీసిన లోతైన గోతుల్లో పడి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అక్రమాలదారిలో తన, మన లేదు. అందరినీ వణికించేస్తారని వీరి గురించి కావలి నియోజకవర్గంలో చెబుతుంటారు. ఆఖరికి సొంత పార్టీవారే ధర్నా చేసే స్థాయికి వారిద్దరి అరాచక పర్వం కొనసాగింది. వైసీపీ ఐదేళ్ల కాలంలో కావలిలో 90 ఎకరాలను కబ్జా చేశారు. ఈ కబ్జా విలువ రూ.300 కోట్లు. వారే...కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆయన సన్నిహితుడు మన్నెమాల సుకుమార్ రెడ్డి. ఆ వివరాల్లోకి వెళితే.. వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడికక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు దోపిడీకి తెరదీశారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్ రెడ్డి కనుసన్నల్లో ఆయన అనుచరులు రెచ్చిపోయారు. కావలి పట్టణం నడిబొడ్డున ఉన్న కాల్వలు, కుంట...డొంక పోరంబోకు అన్నింటినీ కలిపేసుకుని లేఔట్లు వేసి విక్రయించేందుకు సిద్ధం చేశారు. వీరి కబ్జాకు గురైన భూముల్లో శ్మశానాలు, మున్సిపల్ కామన్ సైట్లు, దేవదాయశాఖ భూమ ులూ ఉన్నాయి. ఈ భూములను ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు మన్నెమాల సుకుమార్ రెడ్డి, ఈతముక్కల మురళీరెడ్డి, చెన్నకేశవుల నాయుడు, మహేంద్ర యాదవ్, కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి పేరుతో బదలాయించేసుకున్నారు. వీరి దందాకు అప్పటి రెవెన్యూ, ఇరిగేషన్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అందరూ సహకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరి అక్రమాలపై విచారణకు సిట్ వేయాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డితోపాటు పలువురు టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తూ వచ్చారు. దీంతో ప్రభుత్వం కలెక్టర్‌ను విచారణకు ఆదేశించడంతో వీరి కబ్జాకాండ బట్టబయలు అయింది. ఆర్డీవో విచారణలో 77.34 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ ముఠా తమ పేరుతో బదలాయించుకుందని తేలింది. ఈమేరకు ఆర్డీవో జిల్లా కలెక్టర్‌కు గత ఏడాది జూలైలో నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను అనుసరించి..
కబ్జాకాండ ఇలా...
కావలి పట్టణంలో సర్వే నంబరు 656లో 4.24 ఎకరాలు కుంట పోరంబోకుగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు 2023లో రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి అదే ఏడాది డిసెంబరు 19న ఫ్రీహోల్డ్‌కు ప్రతిపాదిస్తూ నివేదికలు పంపారు. ఫ్రీహోల్డ్ ఆఫ్ అసైన్‌మెంట్‌లో అప్పటి కావలి మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌కు ఎలాంటి లాగిన్ లేకపోయినప్పటికీ ఫీల్డ్ విజిట్ చేయకుండానే మాన్యువల్ ఎక్సెల్ షీట్ ప్రతిపాదనలపై సంతకం చేసి పంపేశారు. దీనిపై 2024 జూలై 9న ఆర్డీవో విచారణ ప్రారంభించగానే, ఒక రోజు ముందు అంటే జూలై 8వ తేదీ అర్ధరాత్రి సమయంలో మాజీ ఎమ్మెల్యే అనుచరులు హడావిడిగా సదరు భూమిలో దారులు ఏర్పరచి, లౌఔట్ మార్కింగ్ చేశారు. కావలి పట్టణంలో సర్వే నంబరు 656-2, 4, 6, 7లో 3.53 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈ భూమిపై ఒరిజినల్ లబ్ధిదారుల వారసులే ఉన్నట్లు పేర్కొంటూ 2023లో ఫ్రీహోల్డ్‌కు ప్రతిపాదించడం.. సంబంధిత ఉత్తర్వులు ఇచ్చేయడం జరిగిపోయింది. అయితే తాజా పరిశీలనలో సదరు భూమిలో ఒరిజినల్ లబ్ధిదారుల వారసులు ఎవ్వరూ లేరని, ఆ భూమిని అనుమతులు లేకుండానే వ్యవసాయేతర భూమిగా మార్పు చేశారని తేలిందని ఆర్డీవో నివేదిక ఇచ్చారు.
ఫ్రీహోల్డ్ ఉత్తర్వులను రద్దు చేయాలని ప్రతిపాదించారు. సుకుమార్‌రెడ్డి గరుడ లేఔట్ పేరుతో వేసిన దాంట్లో సర్వే నంబరు 656-5,9లో 66 సెంట్ల కాల్వలు, సర్వే నంబరు 656- 1,2,3,6,7,8లో 4.24 ఎకరాల్లో అనాధీన భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సుకుమార్ రెడ్డి తుమ్మలపెంట రోడ్డు లో వేసిన లేఔట్‌లో 5.18 ఎకరాల కాల్వలు, 3.78 ఎకరాల డొంక కలిపేసుకున్నారు. చెన్నకేశవుల నాయుడు తుమ్మలపెంట రోడ్డులో వేసిన లేఔట్‌లో సర్వే నంబర్లు 126,1219, 1221, 1213, 1261, 1263, 1267-5ఎ, 1267-5సి, 1249, 1238-2, 1283లో 3.77 ఎకరాల పరిధిలోని కాల్వలను కబ్జా చేయగా, సర్వే నంబర్లు 1282, 1281, 1273ల్లో 6.44 ఎకరాల కుంటలను మాయం చేశారు. మరో 4.01 ఎకరాల అనాధీన భూమి, 2.01 ఎకరాల డొంక కలుపుకొని మొత్తం 16.23 ఎకరాల ప్రభుత్వ భూములను లేఔటులో కలిపేసుకున్నారు. వెంగయ్యగారి పాలెంలో చెన్నకేశవుల నాయుడు వేసిన లేఔట్‌లో కాల్వలు, అనాధీనం, మందబయలు భూములు 1.22 ఎకరాలు ఉన్నట్లు తేలింది. మహేంద్రయాదవ్ వేసిన లేఔట్‌లో సర్వే నంబర్లు 303-1, 308-1, 316లో 18.29 ఎకరాల కాల్వలు, 4.97 ఎకరాల కుంటలు, మొత్తం 31.43 ఎకరాల ప్రభుత్వ భూములు కలిపేసుకున్నారు. కావలి జాతీయరహదారి పక్కన సుబ్రమణ్యం వేసిన లేఔట్‌లో 6.70 ఎకరాల కాల్వలు, కుంటలు కలిపేసుకున్నట్లు తేలింది. కాటా శ్రీనివాసరెడ్డి తుమ్మలపెంట రోడ్డులో వేసిన లేఔట్‌లో 9.67 ఎకరాల కాల్వలు, కుంటలు, డొంక, దేవదాయశాఖ భూములు ఉన్నట్టు గుర్తించారు. రమణారెడ్డి వేసిన లేఔట్‌లో 0.42 ఎకరాల కాల్వలను కలిపేసుకున్నారు. కాగా, వైసీపీ ఐదేళ్ల పాలనలో కావలిలో అపూర్వసహోదరులు చేయని అరాచకం లేదు.
2023 డిసెంబరులో హర్ష అనే ఎస్సీ మాల సామాజికవర్గం యువకుడు ఎమ్మెల్యేని ప్రశ్నించాడని బట్టలూడదీసి మోకాళ్లపై కూర్చోబెట్టి ఎమ్మెల్యేకు ఆయన అనుచరుడికి క్షమాపణ చెప్పించారు. కూటమి అధికారంలోకి రావడంతో తాము చేసిన అక్రమాల నుంచి బయటపడేందుకు.. మన్నెమాల సుకుమార్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఆయనను బీజేపీ లేదా జనసేనలోకి పంపి తాము చేసిన అక్రమాల నుంచి బయటపడేందుకే ఈ ఎత్తు వేశారన్న ప్రచారం ఉంది.
రూ. వంద కోట్ల గ్రావెల్ తవ్వేశారు
వైసీపీ హయాంలో కావలి నియోజకవర్గంలో సుమారు రూ.100 కోట్ల పైచిలుకు విలువైన గ్రావెల్‌ను తవ్వి తరలించేశారు. ఈ దందా మొత్తం అపూర్వ సహోదరుల నేతృత్వంలోనే సాగింది. రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, జగనన్న కాలనీలతోపాటు కావలిలోని అనధికార లేఔట్లకు అక్రమంగా తవ్విన గ్రావెల్‌ను సరఫరా చేసి వందల కోట్లు ఆర్జించారు. ఎలాంటి అనుమతులు లేకుండా 20 నుంచి 30 అడుగుల లోతున వందల ఎకరాల్లో గ్రావెల్‌ను తవ్వేశారు. మైనింగ్ డిపార్ట్‌మెంట్‌కు రూపాయి రాయల్టీ చెల్లించకుండా ఈ దందా నడిపించారు. వీరి దందాకు.. కావలి మండలం రుద్రకోటలో జాతీయరహదారిని ఆనుకుని ఉన్న సుమారు 30 అడుగుల లోతున గుంతలే నిదర్శనం. కప్పరాళ్ల తిప్ప పోలీసుస్టేషన్‌ను ఆనుకుని 30 అడుగుల లోతున గ్రావెల్ తవ్వారు. ఎస్పీ, కలెక్టర్ హెచ్చరించినా వీరి అక్రమ దందా ఆగలేదు. ‘సేవ్ ద కావలి’ పేరుతో కమ్యూనిస్టులు, బీజేపీ కలిసి ఇక్కడ ఉద్యమా లు చేయడం గమనార్హం. కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలు అయినా అపూర్వ సహోదరులపై చర్యలు తీసుకోవడం లేదన్న అసంతృప్తి టీడీపీ కార్యకర్తలు, నేతలూ, అఖిలపక్షం నాయకుల్లోనూ ఉంది.
For AndhraPradesh News And Telugu News