Share News

Massive Floods: కన్నీటి సుడి.. గండి

ABN , Publish Date - Nov 07 , 2025 | 04:48 AM

తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం ఓళూరు రాయలచెరువుకు గండి పడి అపార ఆస్తినష్టం సంభవించింది.

Massive Floods: కన్నీటి సుడి.. గండి

  • 55 పశువులు మృతి, మరో 800 గల్లంతు.. కూలిన మూడు ఇళ్లు, 90 విద్యుత్‌ స్తంభాలు

  • గంటన్నరపాటు పది అడుగుల ఎత్తున ప్రవాహం

  • నీటిలో కొట్టుకుపోయిన సామగ్రి, వాహనాలు

  • తిరుపతి జిల్లా కళత్తూరు దళితవాడలో విధ్వంసం

  • అరగంట ముందు హెచ్చరికలతో తప్పిన ప్రాణనష్టం

  • సర్వస్వం కోల్పోయిన దళిత కుటుంబాలు

తిరుపతి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం ఓళూరు రాయలచెరువుకు గండి పడి అపార ఆస్తినష్టం సంభవించింది. అరగంట ముందు అందిన హెచ్చరికలతో ప్రాణనష్టం మాత్రం తప్పింది. దూసుకొచ్చిన జలప్రవాహానికి కళత్తూరు దళితవాడవాసులు సర్వస్వం కోల్పోయారు. గురువారం ఉదయం గంటన్నర పాటు పది అడుగుల ఎత్తున కొనసాగిన నీటి ప్రవాహానికి ఇళ్లలోని ధాన్యం సహా వస్తువులు, పశువులు, వాహనాలు కొట్టుకుపోయాయి. మూడు ఇళ్లు, సుమారు 90 విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. 55 పశువులు మృతి చెందాయి. మరో 800కు పైగా పశువులు ప్రవాహంలో గల్లంతయ్యాయి. ఇళ్లలోనూ, వీధుల్లోనూ బురద, కొట్టుకొచ్చిన ముళ్లకంపలు, పశువుల కళేబరాలతో ఊరంతా బీభత్సంగా మారింది.

‘మొంథా’ సమయంలోనే

చెరువుకట్ట బలహీనం!

158 ఎకరాల విస్తీర్ణం, 1,123 ఎకరాల ఆయకట్టు కలిగిన ఈ చెరువు ఇటీవలి మొంథా తుఫాను సమయంలో పూర్తిగా నిండింది. ఆ సమయంలోనే చెరువు కట్ట బలహీనపడింది. నాడు కట్టపై బొగడ(రంధ్రం) పడగా గ్రామస్తులు, అధికారులు పూడ్చివేశారు. గురువారం తెల్లవారుజామున 6.30 గంటల సమయంలో చెరువు కట్టపై మళ్లీ బొగడ పడింది. రైతులు గుర్తించి సర్పంచ్‌కు, దిగువన ఉన్న గ్రామాలకు సమాచారం అందించారు.


ఉదయం 7.20 గంటలకు కట్ట తెగిపోయింది. దీంతో అక్కడున్న వారు దిగువన నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తొలి గ్రామం కళత్తూరు దళితవాడ వాసులను ఫోన్ల ద్వారా అప్రమత్తం చేశారు. సామాన్లు, పశువుల కోసం చూడొద్దని, తక్షణం ప్రాణాలు కాపాడుకోవాలని హెచ్చరించారు. చెరువులో 88 అడుగుల ఎత్తు వరకూ నిల్వ వున్న 0.008 టీఎంసీల నీరు ఒక్కసారిగా వెలుపలికి ప్రవహించి కళత్తూరు దళితవాడను ముంచెత్తింది. అప్పటికే గ్రామస్థులు కొందరు ఎత్తైన ప్రదేశాలకు పారిపోగా మరికొందరు ఇళ్ల పైకి చేరుకున్నారు. ఉదయం 8 నుంచి 9.30 గంటల దాకా పది అడుగుల ఎత్తున ఉధృతంగా సాగిన నీటి ప్రవాహం.. తర్వాత తగ్గినప్పటికీ మరో అరగంటపాటు కొనసాగింది. గంటన్నర పాటు గ్రామస్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. చాలామంది రెండంతస్తుల సచివాలయ భవనంపైకి చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రవాహ ఉధృతికి ఇళ్లలోని సామాన్లతోపాటు 413 గేదెలు, 421 పాడి ఆవులు, 121 కోళ్లు, పలు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. రెండు పూరి గుడిసెలు, ఒక రేకుల ఇల్లు కూలిపోయాయి.

Updated Date - Nov 07 , 2025 | 04:48 AM