Aadudam Andhra Scam Exposed: ఆడుదాంలో కోట్లాట
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:47 AM
ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భారీ అవినీతి వెలుగులోకి వచ్చింది. టెండర్ల ద్వారా కోట్లు కుమ్మేసిన ఇంజనీరింగ్ అధికారి సన్నిహితురాలికి భూమి, నగదులు బదిలీ చేసిన వ్యవహారం పోలీస్ కేసు వరకు వెళ్లింది

ఇంజనీరింగ్ అధికారి ఇంటి ‘గుట్టు’ రట్టు
ఆడుదాం ఆంధ్రా టెండర్లలో కోట్లు కుమ్ముడు
సన్నిహితురాలికి భూమి, 12 కోట్ల నగదు
గత ప్రభుత్వంలో శాప్ అధికారి అవినీతి లీలలు
చివరికి కుటుంబ సభ్యులకు తెలియడంతో రచ్చ
ఆస్తి వెనక్కి ఇవ్వాలని సదరు మహిళతో గొడవ
వ్యవహారం నందిగామ స్టేషన్‌కు.. కేసు నమోదు
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన ‘ఆడుదాం ఆంధ్రా’లో ఆటల సంగతి ఏమో గానీ.. ఈ కార్యక్రమం పేరిట జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు. తాజాగా శాప్‌లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న కడప జిల్లాకు చెందిన ఓ ఇంజనీరింగ్ అధికారి ఇంటి ‘గుట్టు’ రట్టు బయటపడింది. గత ప్రభుత్వంలో ఈ కార్యక్రమంలో టెండర్ల ప్రక్రియను నిర్వహించిన ఆయన కాంట్రాక్టర్ల నుంచి కోట్లు కుమ్మేశారు. విజయవాడలో పరిచయమైన ఓ మహిళ ఆయనకు అత్యంత సన్నిహితురాలిగా ముద్ర పడింది. ఆ ఇంజనీరింగ్ అధికారి శ్రీసత్యసాయి జిల్లాలో కియా కార్ల పరిశ్రమకు సమీపంలో ఉన్న తన భూమిని ఏకంగా ఆమె పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అంతేగాక ఆమె బ్యాంకు ఖాతాలకు రూ.12 కోట్ల నగదు బదిలీ చేయించారు. గత ప్రభుత్వంలో గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగిపోయింది. ఎట్టకేలకు సదరు అధికారి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో ‘అసలు కథ’ మొదలైంది. వారు ఆమె ఇంటికి వెళ్లి తమ ఆస్తి తిరిగి ఇవ్వాలని అడగటంతో వివాదం రాజుకుంది. ఇది కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది. దీంతో ఇంజనీరింగ్ అధికారి ఇంటి ‘గుట్టు’ రట్టయింది. అవినీతి వ్యవహారం రచ్చకెక్కింది. కొద్దిరోజులుగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ కేంద్రంగా జరుగుతున్న ఈ పంచాయితీ ఇటు పోలీసు, అటు శాప్ వర్గాల్లో దుమారం రేపుతోంది.
ఇదీ అవినీతి కథ..
కడప జిల్లాకు చెందిన సదరు ఇంజనీరింగ్ అధికారి విజయవాడలోని రహదారులు, భవనాల శాఖలో విధులు నిర్వహించేవారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శాప్ ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకోసం వివిధ పరికరాలు, సామగ్రి కొనుగోలుకు నిర్వహించే టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడానికి ఈ అధికారిని డిప్యుటేషన్‌పై శాప్‌కు తీసుకొచ్చారు. నాడు ఆడుదాం ఆంధ్రా ఆరంభం నుంచి ముగింపు వరకు మొత్తం ప్రక్రియను ఈ అధికారి భుజాలపై మోశారని శాప్ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు కొన్నేళ్ల క్రితం ఓ మహిళ విజయవాడలో పరిచయమైంది. ఆమె సొంతూరు ఎన్టీఆర్ జిల్లా నందిగామ. ఈ ఇంజనీరింగ్ అధికారికి శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి గ్రామంలో కియా కార్ల పరిశ్రమకు సమీపంలో ఉన్న భూమిని ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ విషయం అధికారి కుటుంబ సభ్యులకు తెలియడంతో కొద్దిరోజుల క్రితం నందిగామలో ఉంటున్న ఆమె ఇంటికి వెళ్లారు. తమ ఆస్తిని తిరిగి తమకు ఇవ్వాలని, తమ పేరిట రాయించాలని డిమాండ్ చేశారు. దీనికి ఆమె ఎదురు తిరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ వివాదం జరిగింది. అధికారి కుటుంబ సభ్యులు తన ఇంటికి వచ్చి దాడి చేశారని ఆమె నందిగామ పోలీసులకు కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు ఇంజనీరింగ్ అధికారిని పోలీసులు విచారణకు పిలిపించారు. భూమిని రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా ఆమె బ్యాంకు అకౌంట్లకు రూ.12 కోట్లు బదిలీ చేసినట్టు ఆయన పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం. సదరు మహిళకు చెందిన మూడు అకౌంట్లకు ఈ డబ్బు చేరిందనే ప్రచారం నడుస్తోంది. ఈ డబ్బు తనతో పాటు స్నేహితులు పంపారని ఇంజనీరింగ్ అధికారి చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. నందిగామ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఈ డబ్బులు ఇచ్చామని పోలీసులకు వెల్లడించారు.
వేర్వేరు ఖాతాల నుంచి బదిలీ
నాడు టెండర్లలో కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి చేకూర్చినందుకు వారు ఇంజనీరింగ్ అధికారికి భారీగా ముడుపులను కానుకలుగా ఇచ్చారు. వాటిని చాలా తెలివిగా వేర్వేరు అకౌంట్ల ద్వారా ఆ మహిళ ఖాతాలకు బదిలీ చేయించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాప్‌లో ఆ ఇంజనీరింగ్ అధికారి డిప్యుటేషన్ కాలం కొన్నాళ్ల క్రితమే ముగిసింది. కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రితో ఉన్న అనుబంధం, మరో మంత్రితో విద్యాభ్యాసం నుంచి ఉన్న బంధం రెండూ కలిసి డిప్యుటేషన్‌ను పొడిగించాయి.
ఆడుదాం పేరిట భారీ దోపిడీ
ఆడుదాం ఆంధ్రా పేరిట అప్పటి క్రీడల మంత్రి ఆర్కే రోజా, అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి భారీ అవినీతి చేశారని కూటమి ప్రభుత్వం గుర్తించింది. దీనిపై శాప్ అధికారులు ఏసీబీకి ఫిర్యాదు కూడా చేశారు. సీఐడీకీ ఫిర్యాదు ఇచ్చారు. ఆడుదాం ఆంధ్రాలో మొత్తం రూ.119 కోట్లు ఖర్చు చేయగా, అందులో రూ.70 కోట్ల వరకు కాజేశారని ప్రాథమికంగా గుర్తించారు. సీఐడీకి అందిన ఫిర్యాదు విజయవాడ పోలీసు కమిషనర్‌కు రావడంతో ఏసీపీ స్థాయి అధికారితో విచారణ చేయించారు. దీనికి సంబంధించి ఆయన నివేదిక ఇచ్చినట్టు తెలిసింది.