Share News

Land Scam: పేదల పేరిట గద్దలకు

ABN , Publish Date - Feb 06 , 2025 | 04:04 AM

ఏకంగా 4.72 లక్షల ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా జీఓ 596ను ఉల్లంఘించి మరీ నిషేఽధిత జాబితా నుంచి తొలగించి హక్కులు కల్పించారు. రెవెన్యూ శాఖ ఈ మేరకు నిగ్గు తేల్చింది.

Land Scam: పేదల పేరిట గద్దలకు

4.72 లక్షల ఎకరాల్లో ఉల్లంఘనలు

జగన్‌ జమానాలో అక్రమాలు నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత

జాబితా నుంచి ‘అసైన్డ్‌’ తొలగింపు

నిగ్గు తేల్చిన రెవెన్యూ శాఖ

అసైన్డ్‌ చట్టం కింద అక్రమార్కులపై కఠిన చర్యలకు ఆదేశం

బాధ్యులైన అధికారులపై కూడా

అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు

భూములు తిరిగి నిషేధిత జాబితాలోకి

జిల్లా కలెక్టర్లకు సీసీఎల్‌ఏ ఆదేశాలు

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందన

పేరు పేదలది.. దండుకున్నదేమో పెద్దలు. నాడు జగన్‌ ప్రభుత్వంలో అసైన్డ్‌ భూముల వ్యవహారంలో జరిగింది ఇదే. 20 ఏళ్ల కాలపరిమితి దాటిన అసైన్డ్‌ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి శాశ్వత హక్కులు కల్పిస్తామంటూ జీఓ 596 జారీ చేశారు. దీన్ని అడ్డం పెట్టుకొని 20 ఏళ్ల కాలపరిమితి దాటని భూములకు కూడా హక్కులు కల్పించారు.

నాడు 4.72 లక్షల ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా నిషేఽధిత జాబితా నుంచి తొలగించి హక్కులు కల్పించినట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. అక్రమాలకు బాధ్యులైన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌ ప్రభుత్వంలో అసైన్డ్‌ భూముల అక్రమాల లెక్క తేలింది. పేదల భూములను పెద్దలు అడ్డగోలుగా కొట్టేశారు. వందలు, వేలు కాదు.. ఏకంగా 4.72 లక్షల ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా జీఓ 596ను ఉల్లంఘించి మరీ నిషేఽధిత జాబితా నుంచి తొలగించి హక్కులు కల్పించారు. రెవెన్యూ శాఖ ఈ మేరకు నిగ్గు తేల్చింది. అందులోనూ ఎన్నికల ముందు.. రోజుల వ్యవధిలోనే 25,284 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌ జరగ్గా, ఇందులో 7,827 ఎకరాలు అడ్డగోలుగా చేశారని గుర్తించింది. ఈ అక్రమాలకు పాల్పడినవారిపై ఆంధ్రప్రదేశ్‌ అసైన్‌మెంట్‌ చట్టం-1977లోని సెక్షన్‌ 4 ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. చేజారిపోయిన భూములను తిరిగి కాపాడాలని, వాటిని నిషేఽధిత జాబితాలో చేర్చాలని సూచించింది. అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి ఒక్కో కేసును నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) జి. జయలక్ష్మి ఈ మేర కు కలెక్టర్లకు సర్క్యులర్‌ జారీ చేశారు.

jh.jpg


నాడు ఎన్నో అక్రమాలు

జగన్‌ ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ చేసిన సంగతి తెలిసిందే. డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలో అధికారుల కమిటీ 15 లక్షల ఎకరాల భూముల రికార్డులను పునఃపరిశీలన చేసింది. 13,59,805 ఎకరాల అసైన్డ్‌ భూమిని ఫ్రీ హోల్డ్‌ చేశారని కమిటీ గుర్తించింది. ఇందులో 4.72 లక్షల ఎకరాలను జీఓ 596ను ఉల్లంఘించి నిషేధిత జాబితా 22(ఏ) నుంచి బయటకు తీశారని లెక్కతేల్చారు. నివేదికల ఆధారంగా అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని గత కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే సమావేశం ముగిసి రెండు నెలలు దాటినా టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయలేదు. భూ అక్రమాలపై శాఖాపరమైన చర్యలు లేవు. దీంతో అక్రమార్కులు మరింతగా రెచ్చిపోతున్నారు. దీనిపై ‘టాస్క్‌ లేదు.. ఫోర్స్‌ లేదు’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించగా దానిపై ప్రభుత్వం స్పందించింది. భూముల అక్రమాలపై విచారణ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో సీసీఎల్‌ఏ సర్క్యులర్‌ జారీచేశారు. దానిలోని కీలకాంశాలు...

అడ్డగోలుగా హక్కులు

జగన్‌ ప్రభుత్వంలో అసైన్డ్‌ భూములకు శాశ్వత హక్కులు కల్పించే పేరిట జీఓ 596 జారీ చేశారు. దీన్ని అడ్డం పెట్టుకొని 20 ఏళ్ల కాలపరిమితి దాటని భూములను కూడా నిషేధిత జాబితా నుంచి బయటపడేసి హక్కులు కల్పించారు. ఈ ఉదంతాలపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపించింది. డిప్యూటీ కలెక్టర్‌, తహసీల్దార్‌, మండల సర్వేయర్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌లతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయించి ఫ్రీహోల్డ్‌ చేసిన రికార్డులను పునఃపరిశీలన చేయించింది. 13,59,805 ఎకరాలను ఫ్రీహోల్డ్‌ చేసినట్లు సీసీఎల్‌ఏ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. జీఓ 596ను ఉల్లంఘించి 4,72,423 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి బయటకు తీశారని వెల్లడించారు.


మళ్లీ నిషేధిత జాబితాలోకి...

జీఓ 596ను ఉల్లంఘించి ఫ్రీహోల్డ్‌ చేసిన భూములను సంరక్షించాలని సీసీఎల్‌ఏ ఆదేశించారు. ఆ తర్వాత ఆ భూములను నిషేధిత జాబితా 22(ఏ)లో చేర్చిన తర్వాత నోటిఫై చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ భూముల వివరాలను తిరిగి రెవెన్యూ రికార్డుల్లో, ఆన్‌ లైన్‌లో తాజాపరచి, జిల్లా రిజిస్ట్రార్‌కు వివరాలను పంపించాలన్నారు. అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలని సూచించారు. మండ ల స్థాయిలో తహసీల్దార్లు అక్రమార్కులపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.

ఆ అధికారులను గుర్తించండి

భూముల అక్రమాల్లో ప్రైవేటు వ్యక్తులతో పాటు రెవెన్యూ అధికారుల పాత్ర ఉంది. చట్టవిరుద్ధంగా జీఓ 596ను ఉల్లంఘించి మరీ లక్షల ఎకరాలను ప్రైవేటుపరం చేయడంలో అధికారుల పాత్రే కీలకం. ఈ నేపథ్యంలో అక్రమాలకు బాధ్యులైన అధికారులను గుర్తించి సీసీఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సీసీఎల్‌ఏ జయలక్ష్మి కలెక్టర్లను ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Nara Lokesh : జగన్‌ సెక్యూరిటీపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan: విశాంత్రిలో పవన్ కళ్యాణ్.. అసలు విషయం ఇదే..

Updated Date - Feb 06 , 2025 | 04:04 AM